close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

ఇక డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలు

నిర్వహణపై యంత్రాంగం కసరత్తు

నోటిఫికేషన్‌ రావడమే తరువాయి

పదవులపై పాలకవర్గం నేతల కన్ను

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. డైరెక్టర్ల ఎన్నికతోపాటు సంఘం ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలు కూడా సోమవారంతో పూర్తయ్యాయి. మూడంచెల సహకార వ్యవస్థలో రెండో అంచెలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైదరాబాద్‌లో డీసీవోలకు, డీసీసీబీ సీఈవోలకు సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 20న నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి సమాచారంతో మంగళవారం మళ్లీ జిల్లా అధికారులతో రాష్ట్ర సహకారశాఖ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు.

అధ్యక్షుల చూపు అటువైపు..

పీఏసీఎస్‌ అధ్యక్ష పదవులను కైవసం చేసుకున్న పలువురు నేతలు ఇప్పుడు డీసీసీబీ, డీసీఎంఎస్‌లో ఉన్న పదవులపై దృష్టి సారించారు. ఖమ్మం డీసీసీబీలో జిల్లాలోని 76, భద్రాద్రి కొత్తగూడెం- 21, ములుగు- 2, మహబూబాబాద్‌- 3 కలిపి మొత్తం 101 మంది అధ్యక్షులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా తెరాస మద్దతుదారులు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ నేతలు డీసీసీబీ, డీసీఎంస్‌ పదవులపై దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు.

 

ప్రధాన పదవులివీ..

డీసీసీబీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌తోపాటు డీసీఎంఎస్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులు ముఖ్యమైనవి. వీటిలో అతి ముఖ్యమైనవి డీసీసీబీ ఛైర్మన్‌, తర్వాత డీసీఎంస్‌ ఛైర్మన్‌ పదవులు. వీటితోపాటు డీసీసీబీలో 21 మంది, డీసీఎంఎస్‌లో 10 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకునే అవకాశం ఉంది. డైరెక్టర్లుగా ఎన్నికైన వారు డీసీసీబీ, డీసీఎంస్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. వీటిలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ పదవులకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. డైరెక్టర్‌ పదవుల్లో మాత్రం కొన్నింటికి రిజర్వేషన్‌ ఉంటుంది. దీంతో పలువురు తమ సామాజిక వర్గాల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

డీసీసీబీ ఎన్నిక ఇలా...

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మొత్తం 21 డైరెక్టర్‌ పదవులుంటాయి. వీటిలో ‘ఏ’క్లాస్‌ సంఘాలు అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌)ల నుంచి 16 మంది డైరెక్టర్లు, ‘బి’క్లాస్‌ సంఘాలు అంటే వ్యవసాయేతర సంఘాలు(గొర్రెల పెంపకం, మత్స్య, లేబర్‌ కాంట్రాక్టు సొసైటీలు, ఉద్యోగ సహకార సంఘాలు, ఇతర సహకార సంఘాలు) నుంచి అయిదుగురు డైరెక్టర్లు పాలకవర్గంలో ఉంటారు.

నామినేటెడ్‌ డైరెక్టర్ల ఎంపిక ఇలా...

వీరు కాక మరో నలుగురు నామినేటెడ్‌ సభ్యులకు కూడా పాలకవర్గంలో అవకాశం ఉంటుంది.

జిల్లా సహకార అధికారి పాలకవర్గంలో ప్రతినిధిగా ఉంటారు. ఆయనతోపాటు మరొకరిని సహకారశాఖ రిజిస్ట్రార్‌ డైరెక్టర్‌గా నామినేట్‌ చేస్తారు.

వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఒకరిని పాలకవర్గ సభ్యునిగా నామినేట్‌ చేస్తారు.

పదేళ్ల సర్వీసుకు తక్కువ కాకుండా ఉన్న సీఏను కూడా పాలకవర్గంలో నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

డీసీఎంఎస్‌ ఎన్నిక ఇలా...

డీసీఎంఎస్‌లో మొత్తం 10 డైరెక్టర్‌ పదవులుంటాయి. వీరిలో ఆరుగురిని ‘ఏ’క్లాస్‌ సంఘాలు అంటే పీఏసీఎస్‌ల నుంచి, నలుగురిని ‘బి’క్లాస్‌ సంఘాల నుంచి తీసుకుంటారు

నామినేటెడ్‌ డైరెక్టర్లు: 03

రెండు డైరెక్టర్‌ పదవులకు ఇద్దరు అభ్యుదయ రైతులను నామినేట్‌ చేస్తారు.

ఒక డైరెక్టర్‌ పదవికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి ఒక ప్రతినిధిని నామినేట్‌ చేస్తారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.