close

సోమవారం, మార్చి 30, 2020

ప్రధానాంశాలు

ఎస్సీ-2, ఎస్టీ-1

రిజర్వుడు స్థానాలకు అభ్యర్థుల్లేని వైనం

‘డీసీసీబీ’ నోటిఫికేషన్‌ నేపథ్యంలో ఆసక్తికర చర్చ

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: నాలుగు జిల్లాలకు విస్తరించి ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో డైరెక్టర్ల స్థానాల రిజర్వేషన్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఖమ్మంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయ పాలక మండలి సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులు పాలకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇటీవల ఎన్నికైన సహకార సంఘాల అధ్యక్షుల్లోంచి డీసీసీబీకి 20 మంది సభ్యులతో, డీసీఎంఎస్‌కు 10 మందితో నూతన పాలకవర్గాలను ఎన్నుకోనున్న విషయం విధితమే. వీటిల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయిన స్థానాల్లో అభ్యర్థుల కొరత నెలకొనడం విశేషం.

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో..

* డీసీసీబీ పాలకవర్గ సభ్యుల్లో 3 స్థానాలు, డీసీఎంఎస్‌లో ఒక స్థానం ఎస్సీలకు రిజర్వు చేశారు. కానీ మొత్తం 101 సహకార సంఘాల్లో ఒక్క సంఘం నుంచి కూడా ఎస్సీ అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవలేదు.

* ఎస్టీ కేటగిరీలో డీసీసీబీలో ఒకటి, డీసీఎంఎస్‌లో ఒక స్థానం రిజర్వు చేశారు. ఈ కేటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సహకార సంఘం నుంచి ఒక్కరే అధ్యక్షుడు ఎన్నికవడం విశేషం. దీంతో ఇప్పుడు రిజర్వు స్థానాలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి ఎదురైంది. ఎస్టీలో మాత్రం ఒకరికి అవకాశం ఉంది.

* రిజర్వు స్థానాల్లో ఎవరైనా అభ్యర్థుల్లేకుంటే వాటికి ఎన్నిక జరిగే అవకాశం ఉండదు. డీసీసీబీకి కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి గెలుపొందిన డైరెక్టర్లను నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంది.

* బీసీ సామాజిక వర్గం నుంచి 19 మంది అధ్యక్షులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.

* ఇతర అధ్యక్షులు దాదాపు ఓసీ వర్గానికి చెందిన వారే కావడం విశేషం. రిజర్వు స్థానాల్లో నామినేట్‌ డైరెక్టర్ల పదవులను చేజక్కించుకునేందుకు ఇప్పటి నుంచే అనేక మంది డైరెక్టర్లు పావులు కదుపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలే అయినా.. అభ్యర్థుల జయాపజయాల వెనుక ‘సహకారం’లోనూ తెరవెనుక పార్టీలు, నాయకుల మద్దతే కొనసాగుతుండటం కొసమెరుపు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.