close

గురువారం, ఏప్రిల్ 02, 2020

ప్రధానాంశాలు

అదిగో ఆసనం.. వారిదే శాసనం

డీసీసీబీపై కాంగ్రెస్‌, తెదేపాలదే ఆధిపత్యం

కమ్యూనిస్టులది కూడా ప్రముఖ స్థానమే

తొలిసారి గుబాళించనున్న ‘గులాబి’

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

వందేళ్ల చరిత్ర ఉన్న అధ్యక్ష ఆసనం.. పార్టీ రహిత ఎన్నికల్లో ఆద్యంతం రాజకీయ ప్రభావం.. రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పీఠం ఎవరికైనా ప్రతిష్ఠాత్మకమే.. తొలుత కమ్యూనిస్టుల ఏలుబడి సాగింది. అటుపై కాంగ్రెస్‌, తెదేపా, సీపీఎంలను వరించింది. ఈసారి గులాబి వశం కానుంది. 1921లో రామనారాయణ డీసీసీబీ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. 1950 నుంచి 1954 వరకు రామకిశోర్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. డీసీసీబీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రాబల్యం గురించి ‘న్యూస్‌టుడే’ కథనం..

‘ఎరుపు’ గెలుపు

బ్యాంకు చరిత్రను చూస్తే ఆదిలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఎంలు పదవిలో కొనసాగాయి. తొలుత 1954 నుంచి 1959 వరకు రాయల వీరయ్య ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత కూడా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఎ.పురుషోత్తం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో 1959నుంచి 60వరకు కొనసాగారు.

‘హస్త’గతం

ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అనుచరుడు వెల్లంపల్లి రామచంద్రయ్య కాంగ్రెస్‌ పార్టీ నుంచి తొలిసారి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1963 నుంచి 1966 వరకు పదవిలో కొనసాగారు. అనంతరం మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి మద్దతుతో దుగ్గినేని వెంకయ్య ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1967నుంచి 1970 వరకు ఛైర్మన్‌గా పనిచేశారు. రెండోసారి కూడా కాంగ్రెస్‌ పార్టీ ఈ పదవిని కైవసం చేసుకుంది. 1970 నుంచి 1975 మధ్య కాలంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కె.అనంతరెడ్డి కొంతకాలం పాటు ఛైర్మన్‌గా పనిచేశారు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మద్దతుతో ఉడతనేని సత్యంను ఛైర్మన్‌గా నామినేట్‌ చేశారు. ఆయన 1975 నుంచి 1978వరకు పనిచేశారు. ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో జలగం వెంగళరావు తనయుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన 1982 నుంచి 1985వరకు ఛైర్మన్‌గా పనిచేశారు. అంటే కమ్యూనిస్టులు రెండు దఫాలు మినహా 1963 నుంచి 1885 వరకు అంటే సుమారు 32 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంలో కాంగ్రెస్‌ పార్టీ డీసీసీబీపై ఏకఛత్రాధిపత్యాన్ని చలాయించింది. ఇతర పార్టీలను ఎదుర్కొని సుదీర్ఘకాలం పరిపాలన చేసింది.

తెదేపా హ్యాట్రిక్‌

1989లో తొలిసారి కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టి తెలుగుదేశం పార్టీ ఛైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవటం ఇక్కడ విశేషం. తెదేపా తరఫున పోట్ల మధుసూదన్‌రావు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన 1989 నుంచి 1992 వరకు మూడేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఛైర్మన్‌ పదవిని తెదేపా కైవసం చేసుకుంది. ఆపార్టీ నుంచి కొండబాల కోటేశ్వరరావు ఛైర్మన్‌గా ఎన్నికై 1992 నుంచి 1995 వరకు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా గెలుపొంది తెదేపా హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. ఆ పార్టీ తరఫు నుంచి బాలసాని లక్ష్మినారాయణ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1995లో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మినారాయణ 2004 వరకు ఆపదవిలో కొనసాగటం విశేషం. ఈ బ్యాంకుకు సుదీర్ఘకాలం పాటు ఛైర్మన్‌గా పనిచేసిన రికార్డు ఇప్పటి వరకు ఆయన పేరునే ఉంది. పాలకవర్గ ఛైర్మన్లలో అత్యధిక కాలం ఆయన పదవీ బాధ్యతల్లో కొనసాగారు. ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఛైర్మన్ల పదవీ కాలాన్ని అంతకు ముందున్న మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచటం, ఆ తర్వాత సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ రావటం ఆయనకు కలిసొచ్చింది. తొమ్మిదిన్నరేళ్లంటే సుమారు రెండు పర్యాయాల పదవితో సమానం. ఆ విధంగా ఆయనకు సుదీర్ఘకాలం పాటు పనిచేసే అదృష్టం దక్కింది. వరుసగా మూడు పర్యాయాలు ఛైర్మన్‌ పదవిని కైవసం చేసుకున్న తెదేపాకు ఆతర్వాత బ్రేక్‌ పడింది.

* బాలసాని పదవీ కాలం పూర్తయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి టీఎస్‌ ప్రసాద్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. సీపీఎం నుంచి గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2005 నుంచి 2010 వరకు పదవిలో కొనసాగారు. అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. దీంతో ఆ తర్వాత నిర్వహించిన ఛైర్మన్‌ ఎన్నికలో సీపీఎం నుంచి యలమంచిలి రవికుమార్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2013లో జరిగిన ఎన్నికల్లో తెదేపా తిరిగి ఛైర్మన్‌ పదవిని కైవసం చేసుకుంది. ఆపార్టీ తరఫున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు మువ్వా విజయబాబు అనూహ్యంగా ఛైర్మన్‌ పదవికి ఎన్నికయ్యారు. ఆతర్వాత ఆయన తుమ్మలతో పాటు తెరాసలో చేరారు. ఈసారి కూడా రేసులో ఆయన ఉన్నారు.


ఈసారి తెరాసకు దక్కనున్న పీఠం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సహకార ఎన్నికల్లో తెరాస పోటీ చేసి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఖమ్మం డీసీసీబీ పరిధిలోని నాలుగు జిల్లాల్లో అత్యధిక సహకార సంఘాల అధ్యక్షుల పదవులను కైవసం చేసుకుంది. గెలుపు ఏకపక్షంగా జరిగింది. దీంతో ఈసారి డీసీసీబీ ఛైర్మన్‌ పదవి తెరాసకు దక్కటం నల్లేరుపై నడకే అవుతుంది. ఇతర రాజకీయ పార్టీలకు అతి తక్కువగా అధ్యక్ష పదవులు ఉండటం వల్ల ఈసారి ఖమ్మం డీసీసీబీపై గులాబి జెండా ఎగురనుంది. పార్టీ విజయం ఖరారైంది. ఇక ఛైర్మన్‌ ఎవరు అవుతారో తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.