close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాల సేకరణే లక్ష్యం

కేంద్రాల పెంపునకు కసరత్తు

ప్రైవేటును తట్టుకునేందుకు ‘విజయడెయిరీ’ ప్రణాళిక

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే


ఖమ్మంలోని విజయడెయిరీ ఉపసంచాలకుడి కార్యాలయం

పాల సేకరణ కేంద్రాల పెంపు కోసం ప్రభుత్వ రంగ సంస్థ ‘విజయ డెయిరీ’ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో సేకరణ కేంద్రాలను విస్తరించన్నారు. ఈ మేరకు నూతన కార్యాచరణ కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో విజయ డెయిరీ ప్రైవేటు డెయిరీల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. దీనికి తోడు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నుంచి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పోటీని తట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఏరోజు సేకరించిన తాజా పాలను ఆరోజే వినియోగదారులకు అందించనున్నారు. రైతులకు ప్రోత్సాహం కూడా పెంచనున్నారు. ప్రతి నెలా రెండు జిల్లాలో కలిపి పాడిరైతులకు రూ.60లక్షల వరకు చెల్లిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో...

ముదిగొండ, కామేపల్లి, ఎర్రుపాలెం, మధిర, సత్తుపల్లిలో మినీ పాల శీతలీకరణ కేంద్రాలున్నాయి. రోజుకు 5వేల లీటర్ల పాలసేకరణ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,500 మంది విజయడెయిరీకి పాలు పోస్తున్నారు. రైతుల భాగస్వామ్యం 5వేల వరకు పెంచనున్నారు. ఖమ్మం నగర పరిధిలో మొత్తం ఐదు డెయిరీ పార్లర్లు ఉండగా, రిటైల్‌ కేంద్రాలు సుమారు 50 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 180 నుంచి 250 వరకు పాల శీతలీకరణ కేంద్రాలను పెంచాలని నిర్ణయించారు. పాల సేకరణ కూడా రోజుకు 5వేల లీటర్ల నుంచి 9వేల లీటర్లకు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో...

ఇప్పుడున్న 40 కేంద్రాల నుంచి 75 కేంద్రాలకు విస్తరించాలని, పాల సేకరణ 1500 లీటర్ల నుంచి 3వేల లీటర్లకు పెంచేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. ఈ జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో మినీ పాల శీతలీకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 500 మంది నుంచి 1000 మంది రైతుల భాగస్వామ్యం పెంచాలని భావిస్తున్నారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో రైతులను ఆకర్షించే యత్నం

కేంద్ర ప్రభుత్వం ప్రతి పాడి రైతుకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డును మంజూరు చేస్తుంది. ఈకార్డు ఉండి విజయడెయిరీకి పాలు పోసే ప్రతి రైతుకు కూడా రూ.1.60లక్షల వరకు బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించనుంది. కరోనా కారణంగా దెబ్బతిన్న పాడి రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఈపథకం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రెండు జిల్లాల్లో కలిపి కనీసం 3వేల మంది రైతులకు రుణాలు మంజూరు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 500 దరఖాస్తులను సంబంధిత బ్యాంకులకు పంపారు. ఆగస్టు నెలాఖరు నాటికి రుణాలు మంజూరు చేసే కార్యక్రమం పూర్తిచేయాలని నిర్ణయించారు.

ప్రత్యేక ధర కోసం ప్రతిపాదన

ప్రస్తుతం విజయడెయిరీ గేదెపాలు లీటరుకు రూ.60, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం లీటరుకు రూ.4 కలిపి మొత్తం రూ.64 చొప్పున, ఆవు పాలకు లీటరుకు రూ.35లు, ప్రభుత్వ ప్రోత్సాహం లీటరుకు రూ.4లు కలిపి రూ.39 చొప్పున రైతులకు చెల్లిస్తోంది. ఇక్కడ ప్రైవేటు డెయిరీలు గేదెపాలకు లీటరుకు రూ.68 వరకు చెల్లిస్తున్నారు. ఈలెక్కన విజయడెయిరీ చెల్లించేది తక్కువ. దీంతో చాలా మంది రైతులు ప్రైవేటు డెయిరీలను ఆశ్రయిస్తుండటంతో పాల సేకరణ తగ్గుతోంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ సమాఖ్య జీఎం శ్రీనివాసరావు దృష్టికి ఇక్కడి రైతులు ఈ విషయం తీసుకెళ్లి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక ధర మంజూరు చేయాలని విన్నవించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. లీటరుకు అదనంగా కనీసం రూ.2లు పెంచే అవకాశం ఉన్నట్లు రైతులు భావిస్తున్నారు.

కొత్త కేంద్రాలు ప్రారంభిస్తాం

-ఎన్‌.గోపాల్‌సింగ్‌, ఉపసంచాలకుడు, విజయడెయిరీ, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం

రెండు జిల్లాల్లో పాల సేకరణ కేంద్రాలను పెంచేందుకు తగిన ప్రణాళిక తయారు చేశాం. ఇప్పటి వరకు లేని గ్రామాల్లో కొత్తగా కేంద్రాలు ప్రారంభిస్తాం. ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించాలి. విజయడెయిరీకి పాలు పోసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

పాడి రైతులకు  రాయితీ పథకాలు

విజయడెయిరీ రైతులకు 50శాతం రాయితీపై పశువులకు ఉపయోగపడే కాల్షియం, మినరల్‌ మిక్సర్లు అందిస్తారు. ఉపాధి హామీ పథకంలో పశుగ్రాసాల పెంపకం, పశువుల షెడ్ల నిర్మాణం, అజొల్లా తయారీకి అవకాశం కల్పిస్తారు.

ప్రభుత్వం లీటరు పాలకు ఇచ్చే ధర

గేదె పాలు రూ. 64

ఆవు పాలు రూ. 39

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పాలసేకరణ కేంద్రాలు

ఖమ్మం 180

భద్రాద్రి కొత్తగూడెం 40

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.