close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఊరు.. పైరు.. గలగల

రెండో రోజూ వరుణుడి జోరు

కొత్తగూడెం గ్రామీణం: పెనుబల్లి వద్ద వంతెన గోధుమ వాగు ఉద్ధృతి

ఈనాడు, ఖమ్మం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రెండో రోజూ విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో సగటు వర్షపాతం 57.1 మి.మీ.గా నమోదైంది. జిల్లాలో 20 మండలాల్లో భారీ, మరో మండలంలో అతి భారీ వర్షం కురిసింది. ఇక భద్రాద్రి జిల్లాలో 88.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో భారీ, 2 మండలాల్లో అతి భారీ వర్షం పడింది.

కొత్తగూడెం గ్రామీణం: లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ, రేగళ్లలో చెరువులు అలుగుపోశాయి. అశోక్‌నగర్‌ కాలనీలో లోతట్టు ప్రాంతాలోని ఇళ్లలోక్లి నీరు చేరింది. పెనుబల్లి పంచాయతీలో గోధుమ వాగుపైనున్న వంతెన మీదుగా వరద ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది.

పాల్వంచ (పెద్దమ్మగుడి): ముర్రేడు వాగు సంగం వంతెన వద్ద పోటెత్తింది. సమీప దంతెలబోర, దంతెలబోర ఎస్సీ కాలనీ, బండ్రుగొండ గ్రామాల్లో వరద ముంచెత్తడంతో పొలాలు నీటమునిగాయి.

పాల్వంచ పట్టణం: పాతపాల్వంచలోని గోవర్థనగిరి కాలనీని వరద ముంచెత్తింది. 80 ఎకరాల్లో నారుమడులు నీట మునిగాయి. పాల్వంచ-దమ్మపేట రహదారిలో నిర్మాణంలో ఉన్న కందకంలోకి వరద చేరింది. కేఎల్‌ఆర్‌ ఘాట్‌రోడ్డులో వరద చేరడంతో రాకపోకలు అటుగా రాకపోకలు నిలిచాయి.


వెంకటాపురం సాహెబులగుంపు వద్ద వంతెన మీదుగా పొంగిపొర్లుతున్న లోతువాగు

మధిర: మధిర- విజయవాడ ప్రధాన రహదారిలో ఐవోబీ పెట్రోల్‌ పంపు ఎదురుగా వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.

తల్లాడ: మండలంలోని మిట్టపల్లి, పినపాక, కుర్నవల్లి వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. మంగాపురం-గొల్లగూడెం గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి పొలాలు వర్షపునీటిలో మునిగిపోయాయి.

సత్తుపల్లి: వర్షం కారణంగా జేవీఆర్‌ ఓసీలో ఓబీ పనులు నిలిచిపోయాయి.

ఖమ్మం నగరపాలకం: కాల్వలు సరిగా లేక రాపర్తినగర్‌ టీఎన్జీవోస్‌ కాలనీ, దానవాయిగూడెం కాలనీల్లో వరద నీరు నిలిచింది. కాల్వొడ్డు ఆంజనేయస్వామి ఆలయం వద్ద గోళ్లపాడు మరమ్మతులతో నీరు నిలిచింది.

* నాయిబ్రాహ్మణ కాలనీ గుట్టపైనున్న ఓ ప్రహరీ కూలడంతో కిందనున్న నివాసాలు దెబ్బతిన్నాయి.

ఖానాపురం హవేలి: లకారం వాగుకు వరద పోటెత్తడంతో ఖానాపురం, చైతన్యనగర్‌, శ్రీనగర్‌ కాలనీ, రస్తోగీనగర్‌లోని ఖాళీ స్థలాల్లో భారీగా నీరు నిలిచింది.

రఘునాథపాలెం, ఖమ్మం సారథినగర్‌: కేవీ బంజర చెక్‌డ్యాం మీదుగా వరద పొంగి పొర్లుతోంది. బుగ్గవాగు ఉప్పొంగి ఖమ్మం-డోర్నకట్‌ మధ్య రాకపోకలు నిలిచాయి.

ఖమ్మం గ్రామీణం: మున్నేరులో కొత్త నీటి పరవళ్లు

ఖమ్మం గ్రామీణం: వరుస వర్షాలకు మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పొలిశెట్టిగూడెం, తీర్థాల, గోళ్లపాడు, రాజీవ్‌స్వగృహ వద్ద చెక్‌డ్యాంలు నిండి పొంగిపొర్లుతున్నాయి. మున్నేరు ఒడ్డున ఉన్న పొలాలు ముంపునకు గురయ్యాయి.

ములకలపల్లి: పెద్దయ్య చెరువుకు మళ్లీ ఏర్పడిన గండి

పెద్దయ్య చెరువుకు మళ్లీ గండి..

ములకలపల్లి: కమలాపురం శివారు పెద్దయ్య చెరువు అలుగుకు మళ్లీ గండి పడింది. వారం క్రితం కూడా గండి పడటంతో ఇసుక బస్తాలు అడ్డుగా వేశారు. మళ్లీ కట్ట కొట్టుకుపోవడంతో చప్టా వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. 58 ఎకరాల్లో వరి, 46 ఎకరాల్లో పత్తి నీట మునిగింది. తహసీల్దార్‌ సురేష్‌, ఏవో కరుణామయి పైర్లను పరిశీలించారు.

పాల్వంచ గ్రామీణం: మొండికట్ట, బసవతారకకాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో వరద చేరింది. ఉల్వనూరు, గంగదేవిపల్లి, యానంబైలులో చెరువుల కింద వేసిన వరి నాట్లు.. పాండురంగాపురం, పుల్లాయిగూడెం కోడిపుంజులవాగు, పునుకులలో పత్తి చెట్లు కొట్టుకుపోయాయి.

మణుగూరు పట్టణం: వర్షం కారణంగా బీటీపీఎస్‌లో సివిల్‌ పనులకు అంతరాయం ఏర్పడింది. సమితిసింగారం, శ్రీశ్రీ నగర్‌, ఆదర్శ్‌నగర్‌, సుందరయ్యనగర్‌ గ్రామాల్లో డ్రైనేజీలు లేక వరద రోడ్లపైకి చేరింది.

కామేపల్లి: బుగ్గవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తలింగాల-డోర్నకల్‌ రహదారిపై రాకపోకలు నిలిచాయి.

టేకులపల్లి: ఇనుపమోరివాగు ఉద్ధృతంగా ప్రవహించింది. తుమ్మలచెలకలో పత్తి పంట, టేకులపల్లి ఏ కాలనీలో వరిపొలాలు నీటమునిగాయి.

కొణిజర్ల: మల్లుపల్లి, కొణిజర్ల మధ్య పగిడేరు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. అంజనాపురం వద్ద ఏరు రహదారిపై నుంచి ప్రవహించడంతో కొణిజర్ల, ఏన్కూరు మధ్య రాకపోకలు స్తంభించాయి.

కరకగూడెం: వట్టెవాగు పొంగడంతో చొప్పాల, శ్రీరంగాపురాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

జూలూరుపాడు: బేతాళపాడు- పడమటినర్సాపురం మధ్య తుమ్మల వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పాపకొల్లు వెనుకతండాలోని వీధుల్లోకి వరద ప్రవేశించింది.

కారేపల్లి: పేరుపల్లి శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లకు పక్కనే ఉన్న బుగ్గవాగు ప్రమాదం పొంచి ఉండటంతో ఎమ్మెల్యే రాములు నాయక్‌ ఆదేశానుసారం తహసీల్దార్‌ పుల్లయ్య ఇళ్లను పర్యవేక్షించారు. కారేపల్లి బస్టాండ్‌ కూడలిలో విద్యుత్తు నియంత్రిక సిమెంటు దిమ్మెతోపాటు కుప్పకూలింది.


జల దిగ్బంధంలోనే గ్రామాలు..


అశ్వాపురం: గొల్లగూడెంలో చెరువులా మారిన మాగాణి పొలాలు

అశ్వాపురం: అశ్వాపురం-గొందిగూడెం మార్గంలో ఇసుక వాగు ప్రవాహం తగ్గలేదు. గొందిగూడెం సహా కొత్తూరు, మనుబోతులగూడెం పంచాయతీల్లోని 8 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తుమ్మల చెరువు, వెంకటాపురం పంచాయతీల్లోని మరో 8 గ్రామాల జలదిగ్బంధనం కొనసాగింది. మొండికుంట-భద్రాచలం ప్రధాన రహదారి మార్గంలో, రామచంద్రాపురం-ఒడ్డుగూడెం మధ్య రాకపోకలు గురువారం కూడా నిలిచిపోయాయి. గొల్లగూడెం వద్ద ఉన్న వరి పొలాలు సీతారామ ప్రాజెక్టు మట్టి గుట్టల కారణంగా ముంపునకు గురయ్యాయి. బాధిత రైతులు గురువారం తహసీల్దారును కలిసి సమస్యను విన్నవించారు.


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.