close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

గోకులం.. నిర్వేదం

● షెడ్లు నిర్మించుకున్నా అందని బిల్లులు

● రావాల్సిన బకాయిలు రూ.45 కోట్లు

● 5,633 మంది లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు

గోకులం పథకంతో కరవు రైతులను ఆదుకోవాలన్న లక్ష్యం కాస్తా నీరుగారిపోతోంది. అష్టకష్టాలు పడి షెడ్లను నిర్మించుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. అర్హులందరూ అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టారు. 90 శాతం రాయితీతో సొంత స్థలం ఉన్న వారు పశువుల పోషణకు అవసరమైన షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు రావడంతోనే చాలామంది ఆసక్తి చూపారు. పశుసంవర్థ.క శాఖ అధికారులు రైతుల నుంచి 10 శాతం వాటాగా సొమ్మును డీడీ రూపంలో తీసుకున్నారు. లబ్ధిదారులంతా బిల్లుల కోసం ఆరు నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. 

న్యూస్‌టుడే, చిప్పగిరి, మద్దికెర, గోనెగండ్ల: జిల్లాలో ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా 5,633 మినీ గోకులాలు మంజూరు చేశారు. వాటిలో 2,991 షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. నిధుల కొరతతో కొన్ని పూర్తి దశకు చేరుకోలేదు. పూరైన వాటికే ప్రభుత్వం దాదాపు రూ.45 కోట్ల చెల్లించాల్సి ఉంది. జిల్లాలో 6,43,623 ఆవులు, ఎద్దులు, 8,51,533 గేదెలు, 17,39,427 గొర్రెలు, 7,20,293 మేకలు ఉన్నాయి. ఇందులో 40 శాతం పాడి పశువులపై చిన్న, సన్నకారు రైతులే ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో పాడి పశువుల నుంచి జనాభాకు అవసరమైన పాల దిగుబడి లేకపోవడంతో అత్యధిక ప్రజానీకం పాల ప్యాకెట్లపై ఆధారపడుతున్నారు. పాడిని మరింతగా అభివృద్ధి చేసి పాల దిగుబడిని గణనీయంగా పెంచేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నిధుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది. పాడి రైతుల కోసం ప్రభుత్వం గతేడాది నవంబరులో మందుకు మూడు రకాల గోకులాలను నిర్మంచుకోవచ్చని అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. మూడింటికి వేర్వేరుగా నిధుల కేటాయింపుల వివరాలు ప్రకటించారు. ఆరు పశువులకు రూ.1.80 లక్షలు, నాలుగు పశువులకు రూ.1.50 లక్షలు, రెండు పాడి పశువులకు రూ.లక్ష మంజూరు చేస్తామని పశు వైద్యాధికారులు చెప్పారు. వీటి నిర్మాణానికి పది శాతం లబ్ధిదారుడి వాటాను డీడీ రూపంలో అధికారులు తీసుకున్నారు.

గోకులం బకాయిలు చెల్లించాలి

చిప్పగిరి మండలంలో గోకులం పథకానికి సంబంధించిన బిల్లులను చెల్లించాలని లబ్ధిదారులు మంత్రి గుమ్మనూరు జయరాంను ఇటీవల కోరారు. గత సెప్టెంబరులోనే మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. మండలానికి మినీ గోకులం షెడ్లు 50 మంజూరు కాగా రైతులు అందరూ ఏర్పాటు చేసుకున్నారు. వాటికి నిధులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. గొర్రెల షెడ్లు 32, ఊరూరా పశుగ్రాసం క్షేత్రాలు 15 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పటి వరకు చిల్లి గవ్వ అందలేదని లబ్ధిదారులు చెరువు తిమ్మప్ప, ప్రశాంత్‌రెడ్డి, గద్దాల మోహన్‌, కారుమంచప్ప, శ్రీనివాసులు వాపోతున్నారు.

*ఇక్కడ కన్పిస్తున్న గోకులం షెడ్డును మద్దికెరకు చెందిన జగన్నాథరావు నిర్మించారు. గోకులం పథకం కింద షెడ్డు మంజూరు కావడంతో 10 శాతం డీడీ చెల్లించడంతోపాటు ఈ షెడ్డు నిర్మాణానికి సొంతంగా రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. ఆరు నెలలు గడిచిపోయినా.. పైసా బిల్లు మంజూరు కాలేదు. గత ఏడాది నుంచి తీవ్ర వర్షాభావంతో ఉన్న కర్షకులు అప్పులు చేసి ఈ షెడ్లను నిర్మించుకున్నారు. సొమ్ము చేతికందక నానా అవస్థలు పడుతున్నా ఎవరికీ పట్టడం లేదు.

*పునాదులకే పరిమితమైన ఈ నిర్మాణం గోకులం పథకం కింద చేపట్టిన షెడ్డుది. గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామానికి చెందిన రైతు అప్పు చేసి ఈ షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులకు సంబంధించి బిల్లు అందకపోవడంతో పనులు మధ్యనే నిలిపేశారు. సంబంధిత అధికారులు బిల్లులు మంజూరు చేయాలని విన్నవిస్తున్నారు.

అప్పు చేసి నిర్మించాం

గోకులం పథకం కింద షెడ్డు మంజూరు కాగా నిర్మాణం కోసం అప్పు చేశాం. పనులేమో పూర్తయి నెలలు గడుస్తోంది. ఇప్పటికీ పైసా చేతికందలేదు. పాడి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసి నిధులు మంజూరు చేయకుండా అపహాస్యం చేసింది. బాధిత రైతులను ఆదుకునేందుకు ఇప్పటికైనా బిల్లులు మంజూరుకు చర్యలు చేపట్టాలి. - ఉద్దండరాయుడు, రైతు, మద్దికెర

వడ్డీ పెరుగుతోంది

షెడ్డు నిర్మాణం కోసం చేసిన రుణానికి వడ్డీ భారం పెరుగుతోంది. రూ.10 శాతం డీడీ చెల్లించడంతోపాటు రూ.లక్షకు పైగా అప్పు చేసి ఈ నిర్మాణం చేపట్టాం. సంబంధిత అధికారులను అడిగితే నిధులు మంజూరయ్యేదాకా ఏమీ చెప్పలేమంటూ చేతులెత్తేస్తున్నారు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. - మోహన్‌, గంజహళ్లి, గోనెగండ్ల

నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బిల్లులు

గోకులం పథకం కింద ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసిన పాడి రైతులకు తప్పకుండా బిల్లులు మంజూరవుతాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. 25 శాతం పనులు పూర్తి చేసి ఆపై వదిలేసిన రైతులు బిల్లుల కోసం జిల్లా అధికారుల అనుమతి పొందాల్సి ఉంది. ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టని వారి పనులు రద్దయ్యాయి. వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. - లక్ష్మీప్రసాద్‌, డీడీ, పశుసంవర్థక శాఖ, ఆదోని

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.