close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్యాన్సర్‌ ఆసుపత్రిపై కరోనా కాటు 

 లాక్‌డౌన్‌ పూర్తయినా వేధిస్తున్న సామగ్రి కొరత

● సమీపంలో కొవిడ్‌ రోగులు ఉండటంతో పనులకు రాని కూలీలు

● మరోసారి ఈవోటీ కోరిన గుత్తేదారు


పునాదుల్లో వర్షపు నీరు.. అరకొర కూలీలతో పనులు

ఈనాడు డిజిటల్‌,కర్నూలు, కర్నూలు,వైద్యాలయం, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ రోగులకు ప్రపంచస్థాయి వైద్యసేవలు అందించేందుకు గతేడాది కర్నూలులో ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాంటి ప్రతిష్టాత్మక రాష్ట్ర క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మాణ పనులపై కరోనా ప్రభావం పడింది. దీంతో ఏడాది గడుస్తున్నా.. పునాదుల స్థాయికే పనులు పరిమితమయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సైతం పునాది గోతుల్లో నీళ్లు నిలవడంతో పనులు మరికొంత జాప్యమవుతున్నాయి. రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, తెలంగాణ, కర్ణాటక నుంచి నిత్యం వేలాది మంది రోగులు సేవలు అందుకునే కర్నూలు సర్వజన వైద్యశాలలో రూ.120 కోట్లతో క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్మిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రయోజిత కార్యక్రమం కింద నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ.54 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. అందులో రూ.11.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ కొన్నిరోజుల క్రితం జీవో ఇచ్చింది. ఈ నిధులతో భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు.

అమ్మో రోగులు...

సర్వజన వైద్యశాలలో పది ఎకరాల స్థలాన్ని క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు కేటాయించారు. ఇందులో 1.5 ఎకరాల్లో భవన నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఇసుక, కంకర కొరత వేధించగా, అదే సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు సర్వజన వైద్యశాలను రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చిన విషయం విదితమే. దీంతో నిర్మాణ పనులకు వచ్చే కూలీలు కొవిడ్‌ రోగులు దగ్గరలో ఉండటంతో భయపడి పనులకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో నిర్మాణ పనులకు 2021 జనవరి వరకు గుత్తేదారు గడువు కోరుతూ ప్రభుత్వానికి వినతి పంపారు. ఈ అభ్యర్థన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయ్‌భాస్కర్‌ తెలిపారు.

మొదటి దశలో 120 పడకలతో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ సేవలందించేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ స్థాయిలో కర్నూలులో ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టాటా ట్రస్ట్‌ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించగా ప్రభుత్వం ఆమోదించింది. జీప్లస్‌1 తరహాలో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. కింది భాగంలో ఓపీ విభాగంతోపాటు, వైద్యపరీక్షలకు ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ సహా ల్యాబొరేటరీలు ఉంటాయి. పైఅంతస్తులో రోగుల కోసం వార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి దశలో 120 పడకల ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇనిస్టిట్యూట్‌లో సర్జికల్‌, మెడికల్‌, రేడియేషన్‌ తదితర అంకాలజీ విభాగాలతోపాటు, పీజీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులతో సహా పరిశోధనలకు అవకాశం కల్పించేలా తీర్చిదిద్దనున్నారు.

క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ నమూనా

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.