close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లికానుక..భరోసా  ఇచ్చేనా?

● నిలిచిన పెళ్లికానుక వెబ్‌సైట్‌

● లాక్‌డౌన్‌లో అయిన పెళ్లిళ్లు సుమారు 300

● ఆందోళన చెందుతున్న వధువు తల్లిదండ్రులు

పేదింటి యువతుల పెళ్లికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీలుగా ప్రభుత్వం వైఎస్సార్‌ పెళ్లికానుక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం నుంచి కొన్ని నెలలుగా ఒక్కరికీ నిధులు అందలేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి పెళ్లికానుక నిధులు మంజూరు చేయాలని వధువు తల్లిదండ్రులు కోరుతున్నారు. లాక్‌డౌన్‌లో పెళ్లిళ్లు చేసుకున్న వారికి పెళ్లికానుక వచ్చే అవకాశాలు కన్పించడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని లాక్‌డౌన్‌లో వివాహాలు చేసుకున్న వారికి పెళ్లికానుక వర్తించేలా కృషి చేయాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కర్నూలు గ్రామీణం, సి.బెళగల్‌ గ్రామీణం, పత్తికొండ నాలుగు స్తంభాల కూడలి

జిల్లాలో రెండేళ్ల నుంచి సుమారు 21,676 జంటలు ఒక్కటయ్యాయి. వీరిలో 19,674 మంది వధూవరులను అర్హులుగా గుర్తించారు. అయితే నేట వరకు నిధులు మంజూరు కాకపోవడంతో వారికి అవస్థలు తప్పటం లేదు. పెళ్లికి ముందు 20 శాతం, ఆ తర్వాత 80 శాతం వధువు తల్లి బ్యాంకు ఖాతాలో నిధులు జమ కావాల్సి ఉంది. పెళ్లి కోసం చేసిన అప్పులో కొంత మొత్తం తీర్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయనే ఆశ వారిలో రోజురోజుకూ సన్నగిల్లుతోంది.

 

పెళ్లికానుక ఇస్తే బాగుంటుంది - కౌలుట్ల, దేవనకొండ మండలం

ప్రభుత్వం ఆడపిల్లల వివాహం అనంతరం పెళ్లి కానుక పథకం కింద ఒక్కరికి రూ.50 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ భరోసాతో కుమార్తెకు పెళ్లి చేశా. పెళ్లి తర్వాత కానుకకు కోసం సంబంధిత వాలంటీరుకు అవసరమైన నకలు పత్రాలు అందించా. అయితే దరఖాస్తు చేసుకోవడానికి వీలు కావడం లేదని వాలంటీరు చెబుతున్నాడు. మూడు నెలలుగా ఆన్‌లైన్‌ రావడం లేదని చెబుతున్నారు.ఆపొలం పనులు చేసుకునే తమకు కానుకను అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

 

నిలిచిపోయిన ఆన్‌లైన్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. జన సమూహం ఒకచోట చేరకుండా కొవిడ్‌-19 నిబంధనలు పెట్టారు. దీంతో వివాహాలు చేసుకోవాల్సిన కొంతమంది వాయిదా వేసుకున్నారు. జూన్‌ 8 నుంచి కొంత సడలింపు ఇవ్వడంతోపాటు వివాహ వేడుకలకు 50 మంది కంటే ఎక్కువ జనం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవచ్చని కేంద్రం నిబంధన పెట్టింది. లాక్‌డౌన్‌ సమయంలో వధూవరులు, వారి తల్లిదండ్రులు తప్ప జనం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు.

వీరికి పెళ్లికానుక లేనట్లేనా..!

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో సుమారు 200 వివాహాలు జరిగినట్ల్లు సమాచారం. జూన్‌ నెల నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడంతో 100 పెళ్లిళ్లు అయినట్లు కల్యాణ మిత్రలు పేర్కొంటున్నారు. అయితే మార్చి 21 నుంచి పెళ్లి కానుక వివరాలు నమోదు చేసేందుకు ఆన్‌లైన్‌ పనిచేయకపోవడంతో వధువు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లి చేసేందుకు చేసిన అప్పులు పెళ్లికానుకతో తీర్చాలనుకునే వధువు తండ్రికి నిరాశ మిగులుతుందేమోన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీరందరికీ మార్గం చూపి పెళ్లికానుక వర్తించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఆన్‌లైన్‌లో ఎక్కలేదు - సయ్యద్‌ సబిహా బాను, కర్నూలు

మా నాన్న ఉసేన్‌ కూలీ డ్రైవర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వచ్చిన కూలీ డప్పులను పోగు చేసి నా వివాహం జరిపించారు. వివరాలు నమోదు చేయమని కల్యాణమిత్రను అడిగితే ఆన్‌లైన్‌ రావడం లేదని సమాధానం ఇచ్చారు. పెళ్లికానుక కింద రూ.50 వేలు ప్రోత్సాహం వస్తుందని ఆశ పెట్టుకున్నాం. ఈ డబ్బులు వస్తే పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉపయోగపడతాయి.

ప్రభుత్వం అవకాశమిస్తే దరఖాస్తు తీసుకుంటాం - ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ

కొవిడ్‌-19తో దేశం మొత్తం లాక్‌డౌన్‌ పెట్టారు. ఈ లాక్‌డౌన్‌ కారణంగా వైఎస్సార్‌ పెళ్లికానుక వెబ్‌సైట్‌ నిలిచిపోయింది. ఈ కాలంలో వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం అనుమతి ఇస్తే దరఖాస్తులు స్వీకరించి అర్హత ఉన్న వారందరికీ పెళ్లికానుక వర్తించేలా కృషి చేస్తాం. గతంలో పెళ్లికానుక నిధులు రాని వధువులకు రాష్ట్రస్థాయిలో నిధులు విడుదలయ్యాయి. జిల్లాల వారీగా కేటాయించాల్సి ఉంది. జిల్లాలకు నిధులు వచ్చిన వెంటనే అర్హత ఉన్న వారందరికీ కానుక వర్తించేలా చర్యలు తీసుకుంటాం.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.