close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రహణం వీడక.. సాగు సాగక

● ఏళ్ల తరబడి అనుమతులకు ఎదురుచూపులు

● పూర్తిస్థాయిలో నిల్వ ఉంచలేని పరిస్థితి

కర్నూలు, కడప జిల్లాలకు కృష్ణా జలాలు తరలించడంలో కీలకమైన అవుకు జలాశయానికి గ్రహణం వీడటం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు మరింత ప్రాధాన్యం ఇచ్చి నిధులు వెచ్చిస్తున్నా ఏళ్ల తరబడి అటవీశాఖ అనుమతులు సాధించలేకపోతుండటంతో రైతులు నష్టపోతున్నారు. చివరికి జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నింపలేని దుస్థితి నెలకొంది. - న్యూస్‌టుడే-బనగానపల్లి, అవుకు

అవుకు జలాశయంలో 4.14 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం 3 టీఎంసీలకే పరిమితమైంది. జలాశయానికి సంబంధించి అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులు గత పదేళ్లుగా అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపుతున్నా బుట్టదాఖలవుతున్న పరిస్థితి. ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకపోవడంతో ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. రిజర్వాయర్‌ పనులు పూర్తి చేసి ఇప్పటికి పదేళ్లు కావస్తోంది. ఈ ప్రాంత రైతులకు జలాశయం వరంగా మారినా పూర్తిస్థాయిలో ఆ ఫలాలను అందించడంలో అధికారులు సఫలం కాలేకపోతున్నారు.

సర్వేలో లోపాలతో ఇబ్బందులు: జలాశయానికి సంబంధించి అటవీ భూమి ఎంత కావాలి.. ప్రస్తుతం ఎంత పరిధిలో అటవీ భూమికి జలాశయం ఆనుకుని ఉంది.. కొండ ప్రాంతంలో నీటి సామర్థ్యం పెంచేందుకు అటవీ భూమి (కొండలు) ఎంత అవసరం అన్నదాంట్లో స్పష్టత కొరవడిందనే విమర్శలు లేకపోలేదు. మొదటిసారిగా సర్వే చేసినప్పుడు 76 హెక్టార్ల కొండ ప్రాంతం ఉన్నట్లు గుర్తించారు. వీటికి అనుమతులు వచ్చాయి. జలాశయం రెండో దశ పనులు పూర్తయ్యాక సర్వే సమయంలో స్థానిక అధికారులు 48 హెక్టార్లు భూమి ఉన్నట్లు గుర్తించగా కేంద్రం నుంచి వచ్చిన సభ్యుల బృందం 36 హెక్టార్ల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా అనుమతులు రాకుండా ప్రతిపాదనలు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తిరిగి ఇటీవలే మూడోసారి పంపగా అవి ఎంతవరకు సఫలమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

తాజాగా ప్రతిపాదనలు పంపాం - మధుప్రసాద్‌రెడ్డి, ఈఈ

అటవీ అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు పంపాం. సుమారు 36 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. ఇప్పటికే రెండుసార్లు పంపినా ఫలితం కనిపించలేదు. అనుమతులు వస్తే పూర్తిస్థాయిలో నీటిమట్టం నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది. మా పరిధిలో రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. స్థానిక అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తున్నాం.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.