close

శనివారం, ఆగస్టు 15, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇనుప ఖనిజం విలవిల

● కరోనాతో తేరుకోని సిమెంట్‌, స్టీల్‌ పరిశ్రమలు

● ఐరన్‌ ఓర్‌ క్వారీలు మూసివేత

● ఉపాధి కోల్పోయిన వందలాది మంది కూలీలు


భూమి పై పొరల్లో దొరికే ఇనుప ఖనిజం తవ్వకాలు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు : కర్నూలు జిల్లాలో ఇనుప ముడి ఖనిజం ఎక్కువగా దొరికే గనులు వెల్దుర్తి, బేతంచర్ల, డోన్‌లలో ఉన్నాయి. ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో ఎగుమతి చేసే ఈ ఖనిజాన్ని గూడ్సు రైలు ద్వారా తరలించేందుకు తొలిసారి అనుమతులొచ్చాయి. అంతా కలిసొస్తున్న సమయంలో ఇనుప ముడి ఖనిజానికి డిమాండ్‌ తగ్గిపోయింది. కారణం స్టీలు, సిమెంటు పరిశ్రమలు లాక్‌డౌన్‌లో మూతపడటం, కూలీలు స్వగ్రామాలకు వెళ్లడంతో కొరత, ప్రస్తుతం స్పాంజ్‌ ఐరన్‌ తయారీ లాభసాటిగా లేకపోవడంతో ఆ ప్రభావం ముడి ఖనిజంపై పడింది.

వెల్దుర్తిలో లోగ్రేడ్‌ ఐరన్‌ కొన్నిచోట్ల భూమి పై పొరల్లోనే దొరుకుతుండగా, మరికొన్నిచోట్ల లోతుగా తవ్వి వెలికి తీయాల్సి వస్తుంది. ముడి ఖనిజాన్ని ఎలాంటి గ్రేడింగ్‌ చేయకుండా మట్టితో కలిపి పంపితే టన్ను రూ.500-రూ.వెయ్యి పలుకుతుంది. ఈ నెల 6న అలాంటి మిశ్రమాన్నే తమిళనాడు సేలంలోని జిందాల్‌ పరిశ్రమకు 45 వ్యాగన్లు ఉన్న గూడ్సు ద్వారా 2,979 టన్నులు తరలించారు. అదే గ్రేడింగ్‌ చేసిన ఖనిజమైతే టన్ను రూ.3,500 పలుకుతుంది. దీన్ని రోడ్డు మార్గంలో గుజరాత్‌, బళ్లారి తరలిస్తారు. ఒకేసారి వెయ్యి టన్నులు మాత్రమే రోడ్డు రవాణాలో పంపుతున్నారు.

స్టీలు.. సిమెంటు పరిశ్రమలకు...

స్టీలు పరిశ్రమలో టన్ను స్పాంజ్‌ ఐరన్‌ తయారుచేయడానికి రెండు టన్నుల ఐరన్‌ ఓర్‌, ఒక టన్ను కోల్‌, ఒక టన్ను డోలమైట్‌ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం స్పాంజ్‌ ఐరన్‌ తయారీ లాభసాటిగా లేకపోవడం, కరోనాతో కుదేలు కావడంతో ముడి ఖనిజానికి ఆర్డర్లు రావడం తగ్గిపోయాయి. సిమెంటు పరిశ్రమల్లోనూ దీన్ని వాడతారు. ఆ పరిశ్రమల పరిస్థితి దెబ్బతినడంతో ఆ ప్రభావం క్వారీలపై పడింది. దీంతో కోల్‌కతా, ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన వలస కూలీలు వెనుదిరిగారు. దినసరి కూలీకి వచ్చే వెల్దుర్తి పరిధిలోని కొత్తూరు, సర్పరాజపురం, రత్నపల్లె, రామళ్లకోట, పెండేకల్లు గ్రామాల ప్రజలు 200 మందికి పైగా ఉపాధి కోల్పోయినట్లైంది.

ముగిసిన లీజులు

జిల్లాలో వెల్దుర్తి, రామర్లకోటలో మాత్రమే తవ్వకాలకు గనుల శాఖ లీజు అనుమతులున్నాయి. ఈ రెండు సైతం కాలపరిమితి ముగిసినట్లు సమాచారం. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో క్వారీ యజమానులు సైతం కాలపరిమితి పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. లీజులు ముగిశాయని, దరఖాస్తులు వస్తే పొడిగిస్తామని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు.

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.