close

శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేను తడవాలంటే.. చేయి తడపాల్సిందే

డీడీలు చెల్లించినా అందని నియంత్రికలు

అపరిష్కృతంగా 11,325 దరఖాస్తులు

ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో అక్రమ వసూళ్లు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

సీమలో వ్యవసాయం అంటే ఎప్పుడు అతివృష్టి.. ఎప్పుడు అనావృష్టి వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే బోరు నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులెందరో ఉన్నారు. కొత్త నియంత్రికల (ట్రాన్స్‌ఫార్మర్ల) కోసం డీడీలు చెల్లించి ఏడాది దాటిపోయినా ఎదురు చూపులు తప్పడం లేదు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు అదిగో..ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు మరమ్మతులకు గురైన నియంత్రికల బాధ్యత సైతం రైతులపైనే పడుతోంది.

జిల్లాలో కర్నూలు, ఆదోని, డోన్‌, నంద్యాల డివిజన్ల పరిధిలో 2.50 లక్షల ఎకరాలకు పైగా బోర్ల కింద వ్యవసాయం సాగుతోంది. జిల్లాలో ఏడు లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. 2019-20 సంవత్సరానికి నియంత్రికల కోసం వచ్చిన అర్జీల్లో ఇంకా 11,325 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటికి ఇప్పటికే రైతులు రూ.5,450 చొప్పున డీడీలు చెల్లించారు. నలుగురైదుగురు కర్షకులకు కలిపి 25 కేవీ, ముగ్గురు రైతులుంటే 16 కేవీ నియంత్రికలను విద్యుత్తు అధికారులు అందించాల్సి ఉంది. ఆ ఊసే మరిచారు.

●ఈ చిత్రంలో ఉన్నది గడివేములకు చెందిన రైతు వెంకటరమణ. తనకున్న మూడు ఎకరాల పొలంలో పంటలు సాగు చేసేందుకు బోరు వేయించారు. విద్యుత్తు నియంత్రిక కోసం 2019 జనవరిలో డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఇంత వరకు నియంత్రిక అందలేదు. ఇలా ఒక్క గడివేముల మండలంలో 49 నియంత్రికలకు డీడీలు కట్టిన అన్నదాతలు ఎదురుచూపులతోనే గడుపుతున్నారు. సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు అందక పంటలు వేయక నష్టపోయామని వాపోతున్నారు.

సాగుదారు జేబుకు చిల్లు

నియంత్రికలు అందజేయడానికి ముందు మూడు స్తంభాలు, దానికి సంబంధించిన తంతి, ఇతర సామగ్రి ఉచితంగా అందించాలి. అదనపు స్తంభాలు వేయాల్సి వస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర సాగుదారులు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు తుంగలో తొక్కి ప్రతి నియంత్రికకు అదనంగా రూ.20 వేలు తీసుకుంటున్నారు. అందులో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌కు రూ.3 వేలు, లైన్‌మెన్‌కు రూ.2 వేలు, ఏఈ, ఏడీ, డీఈలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున పంపకాలు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. స్తంభాల రవాణా భారం రైతులపైనే మోపుతున్నారు..

2019-20 సంవత్సరానికి జిల్లాలో డోన్‌ డివిజన్‌ పరిధిలో కోటా 1791 నియంత్రికలు కాగా, 2,611 మంజూరు చేశారు. అంటే 820 అదనంగా కేటాయించినట్లే. నంద్యాల డివిజన్‌ పరిధిలోనూ...కోటా 1878 కాగా, అత్యధికంగా 3,376 విడుదల చేశారు. ఇలా 1498 నియంత్రికలు అదనంగా ఇచ్చేశారు. దీంతో జిల్లా లక్ష్యం 9,476 కాగా 10,870 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసి లక్ష్యం కంటే ఎక్కువగా ఇచ్చారు. ఈ ఏడాది ఆ ప్రభావం పడితే ఇప్పటికే డీడీలు కట్టి 18 నెలలుగా ఎదురుచూస్తున్న రైతులకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పేటట్లు లేవు.

టోల్‌ఫ్రీకి నిత్యం ఫిర్యాదుల వెల్లువ: గత ప్రభుత్వం రైతుల పొలాల్లో నియంత్రికలు మరమ్మతులకు గురైతే వెంటనే అధికారులు బాగుచేసేందుకు శ్రీకారం చుట్టింది. 1912 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం అందజేస్తే వెంటనే మరమ్మతులు చేసి రైతుల పంటలు ఎండిపోకుండా కాపాడాలని ప్రణాళిక చేశారు. ప్రస్తుతం ఈ టోల్‌ఫ్రీ నెంబరుతోపాటు, కార్యాలయాలకు రోజుకు 20-40 ఫిర్యాదులు అందుతున్నాయి. నియంత్రికలు మార్చడానికి కర్నూలు కార్యాలయంలో సింగిల్‌ ఫేజ్‌ నియంత్రికలు 385, త్రీ ఫేజ్‌ నియంత్రికలు 300 అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పనిచేయని నియంత్రికను లైన్‌మెన్‌ పరిశీలించి సంబంధిత ఏఈ దృష్టికి తీసుకెళ్లాలి. ఆయన మరమ్మతుల కేంద్రానికి నివేదిక పంపిస్తే సంబంధిత అధికారులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ తెచ్చి బిగించి మరమ్మతులకు గురైంది తీసుకెళ్లాలి. అధికారులను నమ్ముకుంటే నెలలు గడుస్తున్నా పట్టించుకోరని, రైతులే నియంత్రికలను ట్రాక్టర్లపై తీసుకొచ్చి వేరేది తీసుకెళుతున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.