close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

32 వేలు దాటిన కరోనా కేసులు

● కొత్తగా 956 మందికి వైరస్‌

● చికిత్స పొందుతూ 12 మంది మృతి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. అదే స్థాయిలో మరణాలు సైతం నమోదవుతున్నాయి. శుక్రవారం 956 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఫలితంగా జిల్లాలో ఇప్పటివరకు 32,012 కరోనా కేసులు నమోదయ్యాయి. 22,556 మంది కరోనాను జయించి ఇళ్లకు చేరుకున్నారు. కొవిడ్‌ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, హోం ఐసోలేషన్‌లో 9,180 మంది చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో చికిత్స పొందుతూ 12 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క రోజులో ఇంతమంది మృతి చెందడం ఇదే ప్రథమం. ఫలితంగా జిల్లాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 276కు చేరింది.

ఆసుపత్రుల్లో బెడ్ల కొరత

జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా బాధితులను చేర్చుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బెడ్లు ఖాళీగా లేవని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటూ వైద్య సిబ్బంది చెబున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు లక్షలాది రూపాయల బిల్లులు వేస్తున్నారు. రోగి ఆస్పత్రిలో చేరిన రోజే రూ.లక్షలు డిపాజిట్‌ చేయాలంటూ నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు. అటవీ శాఖలో పనిచేసే ఓ ఫారెస్ట్‌ రేంజర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో కర్నూలు కొత్త బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఏకంగా రూ.3.10 లక్షల వరకు బిల్లు వేశారు. అంత ఎందుకైందంటూ అతని బంధువులు ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. ఆ మొత్తానికి బిల్లు వేసి ఇవ్వాలంటూ వారు కోరగా తాము రూ.90 వేలకు మాత్రమే బిల్లు వేస్తామని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వారం రోజుల కిందట బళ్లారి చౌరస్తాలోని ఓ ఆస్పత్రిలో కరోనా పేషెంట్‌కు రూ.7 లక్షల బిల్లు వసూలు చేసి చివరికి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన ఉదంతం మరవకముందే ఈ సంఘటన వెలుగు చూసింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఆళ్లగడ్డలో ఒకే రోజు నాలుగు మరణాలు

ఆళ్లగడ్డ పురపాలికలో కరోనా కేసులు అదుపులో ఉన్నా మరణాలు మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ఒక వృద్ధురాలు, ఎల్‌ఎం కాంపౌండులో ఒక వృద్ధుడు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దివ్యాంగుడైన ఉద్యోగి, టీబీ రోడ్డులో ఒకరు మరణించారు. ఆళ్లగడ్డలో కరోనాతో మరణాలు అధిక సంఖ్యలో ఉండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

డిశ్ఛార్జి అయిన మరుసటి రోజే..:

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగికి కరోనా సోకడంతో గత శుక్రవారం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. కేవలం వారం రోజులకే ఇతడు డిశ్ఛార్జి కావడం గమనార్హం. నంద్యాలలోని తన ఇంటికి వచ్చిన మరుసటి రోజే ఆరోగ్యం విషమించడంతో బంధువులు హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.

ఒకే ఇంట్లో నాలుగో మరణం

ఆళ్లగడ్డలోని చర్చి-మసీదు వీధిలో ఒకే ఇంట్లో నాలుగు కరోనా మరణం సంభవించింది. ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తికి 20 రోజుల కిందట కరోనా సోకింది. ఆయన కరోనా చికిత్స పొందుతూ ఈ నెల 1న మరణించారు. ఆయన తల్లిదండ్రులకు, మామ, బావమరిదికి కరోనా సోకింది. మూడు రోజుల కిందట తల్లి చనిపోగా, తర్వాతి రోజు మామ మరణించారు. శుక్రవారం బావమరిది చనిపోయారు. ఇలా 20 రోజుల నుంచి కరోనాతో ఆ కుటుంబం పడతున్న బాధ అంతా ఇంతా కాదు. తండ్రి కరోనాతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉన్నారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులకు మాత్రం కొవిడ్‌ సోకలేదు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా నాలుగు మరణాలు చోటు చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.