close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పౌరుషమై రగిలి.. కీర్తిగా మిగిలి...  

● రెండుసార్లు పర్యటించిన మహాత్మా గాంధీ

● స్వాతంత్య్ర సంగ్రామంలో సీమ వీరులది ఎనలేని పాత్ర

● అభివృద్ధి పథంలో కందనవోలు

ఉయ్యాలవాడ

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: ఆంగ్లేయుల పాలనపై తిరుగుబాటు చేసిన ధీరులు.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని కొనసాగించిన తొలి తరం వీరులు.. చరిత్ర పుటలో కందనవోలును నిలిపిన ఘనులు కర్నూలు జిల్లావాసులు. నేడు 74వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనమిది. 

రాయలసీమ అభివృద్ధిలో...

నివర్తి వేంకట సుబ్బయ్య స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని రాయలసీమ అభివృద్ధికి పాటుపడ్డారు. శాసన మండలి ఛైర్మన్‌గా పనిచేశారు. 1947లో స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న బనగానపల్లి సంస్థానాన్ని 1948లో భారత దేశంలో విలీనం చేయడానికి పోరాడిన వ్యక్తి. దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య నిలిచారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. దళితుల అభ్యున్నతికి సర్ధార్‌ నాగప్ప కృషి చేశారు. రాజ్యాంగ రచనలో ఆయన భాగస్వామి.

*దత్త మండలాల్లో ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటుకు మూతుకూరి గౌడప్ప నాయకత్వం వహించారు. తెర్నేకల్లుకు చెందిన ఈయన బ్రిటీష్‌ ప్రభుత్వం పెంచిన పన్నులను వ్యతిరేకిస్తూ ఎదురు తిరిగిన ధీరుడు. 1846-47 మధ్య కాలంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్ఢి కర్నూలును పాలించిన చివరి నవాబు గులాం రసూల్‌ఖాన్‌ బ్రిటీష్‌ పాలకులపై తిరుగుబాటుకు రహస్యంగా ఆయుధ కర్మాగారం నిర్మించి కారాగారం పాలయ్యారు. 1920-40 వరకు కర్నూలులో స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన తొలితరం వ్యక్తిగా మేడం వెంకయ్య శెట్టి నిలిచారు. జిల్లాలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిగా గాడిచెర్ల హరిసర్వోత్తమరావు నిలిచారు. నంద్యాల ప్రాంతంలోనూ పలువురు సమరయోధులు దీటైన పోరాటం చేశారు.

తొలి రాజధానిగా కర్నూలు

రామళ్లకోట తాలూకాలో ఒక గ్రామంగా ఉన్న కర్నూలు 1858లో జిల్లా కేంద్రంగా, 1864లో మున్సిపాల్టీగా, 1994లో కార్పొరేషన్‌గా ఎదిగింది. 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక తొలి రాజధానిగా కర్నూలును ఎంచుకున్నారు. నంద్యాలకు చెందిన దేశపాండ్య సుబ్బారావు ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడిగా పనిచేశారు. ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలిగించే ఉద్దేశంతో 1937లో నియమించిన సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ సంఘం చర్చలే శ్రీబాగ్‌ ఒడంబడికకు దారి తీశాయి.

తొలి పాలకులు...

కర్నూలు తొలి రాజధానిగా టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా త్రివేది పనిచేశారు. నంద్యాల పార్లమెంట్‌ నుంచి నీలం సంజీవరెడ్డి స్పీకర్‌గా ఎన్నికై, ఆ తర్వాత రాష్ట్రపతిగా పనిచేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఎన్నికై తర్వాత ఎంపీగా నంద్యాల నుంచి పోటీచేసి గెలిచారు. కర్నూలు నుంచి దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు.

జాతీయ నిధి కోసం... బాపూజీ

మహాత్మా గాంధీ 1921 సెప్టెంబర్‌ 30న తొలిసారిగా కర్నూలు వచ్చారు. డోన్‌లో రైలు దిగిన బాపూజీ...మౌలానా ఆజాద్‌, కొండా వెంకటప్పయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావుతో కలిసి కర్నూలులో జాతీయ నిధికి విరాళాలు సేకరించారు. తుంగభద్ర నది సమీపంలో మేడం వెంకయ్యశెట్టి ఆధ్వర్యంలో భారీ సభను నిర్వహించారు. వెంకయ్య శెట్టి అప్పట్లో రూ.1116 విరాళంగా గాంధీకి అందజేశారు. ఆ తర్వాత గాంధీజీ మళ్లీ 1929 మే 21న పత్తికొండకు వచ్చారు. వనం శంకరశర్మ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు

అంతరించిన బట్టమేక పక్షి రోళ్లపాడులో కనిపించింది. అతి పెద్దదైన అభయారణ్యంగా నల్లమలను గుర్తించారు. అతి పొడవైన బెలుం గుహలతోపాటు, కేతవరం గుహల్లో ఆదివాసుల ఆనవాళ్లు గుర్తించారు. అచ్యుత దేవరాయుల కాలంలో నిర్మించిన బురుజులో కొండారెడ్డి అనే విప్లవ వీరుడిని బంధించడంతో దానికి కొండారెడ్డి బురుజుగా పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం, తుంగభద్ర నదీ తీరంలో మంత్రాలయం, అహోబిలం, మహానంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కు ఇక్కడ ఉంది. సాగునీటి ప్రాజెక్టులన్నీ జిల్లా కేంద్రంగానే మొదలవ్వడం మరో విశేషం. రామళ్లకోటను రత్నాల కోటగా పిలిచేవారు. జొన్నగిరిలోనూ వజ్రాలు ప్రతి ఏటా దొరకడం ప్రత్యేకం.


గాడిచెర్ల


దామోదరం

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.