close

బుధవారం, అక్టోబర్ 28, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రుణం పొందాలంటే..రణమే.. 

డైరెక్టర్లు, ఛైర్మన్ల సిఫార్సులుంటేనే మంజూరు
రూ.లక్షకు పదివేల వంతున అనధికార వసూళ్లు
సహకార బ్యాంకు గడప తొక్కాలంటేనే హడల్‌
న్యూస్‌టుడే, ఈనాడు డిజిటల్,కర్నూలు, సచివాలయం

అన్నదాతలు పంట రుణం పొందాలంటే సిఫార్సులుండాలని కొత్త భాష్యం చెబుతున్నారు. సామాజిక, ఆర్థిక, ఏకీభావం అనే విలువలను అందించాల్సిన వ్యవస్థ కొందరికే పెద్దపీట వేస్తోంది. అంతేనా రుణాలిచ్చి పర్సంటేజీ పేరుతో రైతును దోచేస్తున్నారు. కేడీసీసీ ప్రధాన బ్యాంకుతోపాటు, వివిధ శాఖల్లో చోటు చేసుకుంటున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
‘రైతును రైతులా చూడండి. పార్టీలకు సంబంధం లేకుండా కర్షకులకు పంట రుణాలు అందించాలి. రుణమిచ్చి రూ.వేలకు వేలు తీసుకుంటున్నారు. నిజమైన రైతుకు రుణం ఇవ్వమంటే సిఫార్సులు చేయించమంటారా? అవసరమైతే కేడీసీసీ బ్యాంకు ముందు ధర్నా చేస్తాం’ - కల్లూరు సొసైటీలో 60 మందికి రుణాలివ్వకుండా వెనక్కి పంపిన తీరుపై నియోజవర్గ తెదేపా నేత చేసిన వ్యాఖ్యలివి.
రూ.లక్షకు పది వేలు సమర్పించాల్సిందే!
వడ్డీ లేని రుణం అందుకుంటున్న రైతులుకు జేబుకు చిల్లు పడుతోంది. నిబంధనల ప్రకారం రూ.లక్ష రుణంలో మూలధనం కింద రూ.10 వేలు బ్యాంకులోనే రైతు పేరుమీద ఉంచుతారు. మిగిలిన దానిలో ఛైర్మన్‌కు రూ.5 వేలు, సంబంధిత బ్యాంకు మేనేజర్, సీఈవో, సొసైటీ ఛైర్మన్ల వాటా కింద మరో రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.10 వేలు అనధికార వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆపై దరఖాస్తు..డాక్యుమెంటేషన్‌ పేరుతో మరో రూ.1500 తీసుకుంటున్నారు. దీంతో రూ.లక్ష రుణానికి రైతు చేతికి రూ.78,500 అందుతోందని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు.
సిఫార్సులుంటేనే...
కేంద్ర ప్రభుత్వ నిధులైనా స్థానిక నాయకులు తమ ప్రభుత్వం ఇచ్చిన నిధులంటూ ఓ వర్గానికి చెందిన రైతులకే సిఫార్సులు చేస్తున్నారు. సొసైటీ పాలకవర్గ సభ్యులు చెప్పిన వారికే రుణాలందుతున్నట్లు సమాచారం. వీటితోపాటు రూ.5లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పెద్ద రుణాలను నేతల అనుయాయులకే కేటాయిస్తున్నారు. గతంలోనూ సిఫార్సులతో రూ.25 లక్షల రుణాలు నేతలకే ముట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటి రికవరీ గురించి అధికారులు పూర్తిగా మరిచారు. నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయని, తగ్గించాలని ఆప్కాబ్‌ ఎండీ ఇటీవల జరిగిన సమావేశంలో పాలకవర్గానికి ఆదేశించిన విషయం విదితమే.
కొవిడ్‌-19 నేపథ్యంలో....
కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌-19 నేపథ్యంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నాబార్డుకు నిధులు విడుదల చేసింది. అక్కడి నుంచి ‘ఆప్కాబ్‌’కు నిధులు కేటాయించగా, వాటిని జిల్లాకు రూ.100 కోట్ల చొప్పున పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌కు సైతం రూ.వంద కోట్లు అందాయి. ఈ నిధులను వివిధ పథకాల ద్వారా సొసైటీలకు మంజూరు చేశారు. డీసీసీబీ పరిధిలోని బ్యాంకు శాఖల నుంచి అన్నదాతలకు రుణాలు అందజేస్తున్నారు. ఇప్పటికే రూ.61 కోట్లు రుణాలు ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఫిర్యాదు అందితే విచారణ 
- రామాంజనేయులు, కేడీసీసీబీ సీఈవో

అనధికార వసూళ్లపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందితే తక్షణమే విచారణ చేపడతాం. ఆలూరులో అనధికార వసూళ్లపై ఫిర్యాదు అందితే వెంటనే స్పందించి విచారణ చేశాం. సొసైటీ, బ్రాంచికి నిధులు ఇవ్వడమే తప్ప, ఫలానా రైతుకు రుణమివ్వమనే అధికారం మాకు లేదు. అందుకే సొసైటీల్లో ఎవరికిస్తున్నారో మాకు తెలియదు. 

ఈ రైతు కల్లూరు మండలం మార్కాపురం గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి. ఈయనకు 4.81 ఎకరాల భూమి ఉంది. రూ.3 లక్షల పంట రుణం కోసం కల్లూరు సొసైటీలో దరఖాస్తు చేశారు. రుణం ఇచ్చేందుకు అన్ని పత్రాలు సమర్పించగా సిద్ధం చేశారు. కేడీసీసీ బ్యాంకు కృష్ణానగర్‌ శాఖకు దరఖాస్తు పంపే క్రమంలో కల్లూరు సొసైటీ డైరెక్టర్‌ను కలిసి వస్తేనే రుణం ఇస్తామన్నారు. సిఫార్సు లేకపోవడంతో రుణం నిలిపివేశారని, దరఖాస్తు వెనక్కి ఇచ్చారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పథకాలు ఇలా...

పథకం పేరు:  కర్షక జ్యోతి
యూనిట్‌ ధర: రూ.15 లక్షలు(5 ఎకరాలపైన ఉన్న రైతులకు)
ఇప్పటి వరకు గ్రౌండింగ్‌ చేసింది: రూ.15 కోట్లు

పథకం: పంట రుణాలు
యూనిట్‌ విలువ: రూ.లక్ష
వడ్డీ: సున్నా(కట్టనవసరం లేదు)
ఎంత మంది రైతులకు ఇచ్చారు: 3 వేలు
ఎంత రుణమిచ్చారు: రూ.23 కోట్లు

పథకం పేరు: రాజన్న చేయూత
యూనిట్‌ విలువ: రూ.3 లక్షలు
వడ్డీ : 9.5%-9.75%
లక్ష్యం: గొర్రెలు, కోళ్లు, పాడి పరిశ్రమ, ట్రాక్టర్ల కొనుగోలు
ఇప్పటి వరకు ఇచ్చింది: రూ.12 కోట్లు

పథకం పేరు: కనకవర్ష గోల్డ్‌ 
యూనిట్‌ విలువ: రూ.3 లక్షలు
లక్ష్యం: రూ.లక్ష పంట రుణం, రూ.2 లక్షలతో గేదెలు, గొర్రెలకు పెట్టుబడి
ఇప్పటి వరకు ఇచ్చింది: రూ.6 కోట్లు
పథకం పేరు: రైతు నేస్తం
యూనిట్‌ విలువ: రూ.5 లక్షలు
ఇప్పటి వరకు పంపిణీ: రూ.5 కోట్లు

కేడీసీసీ బ్యాంకు శాఖలు: 23
పీఏసీఎస్‌(ప్రాథమిక సహకార సంఘాలు): 102
ఆప్కాబ్‌ నుంచి డీసీసీబీకి వచ్చిన నిధులు: రూ.100 కోట్లు
ఇప్పటి వరకు ఇచ్చిన వివిధ రుణాలు: రూ.61 కోట్లు
వడ్డీ లేని రుణాలు: 3 వేల మంది
 రైతులకు ఇచ్చిన రుణం: రూ.23 కోట్లు 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.