close

గురువారం, అక్టోబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆశ పడితే... ఆలౌటే!  

● జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌లు

 

● ఆన్‌లైన్‌ యాప్‌ల్లోనూ పందేలు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు : కొన్ని నిమిషాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. కొన్ని గంటల్లో జీవితాలు తలకిందులవుతున్నాయి. సప్త వ్యసనాల్లో లేని కొత్త వ్యసనం ఒకటి దశాబ్దకాలంగా పల్లె, పట్టణ ప్రాంతాల యువతను పెడదోవ పట్టిస్తోంది. దాని పేరే క్రికెట్‌ బెట్టింగ్‌. మొదట్లో భారత జట్టు మ్యాచ్‌ల వరకే నడిచే ఈ జూదం.. ప్రస్తుతం వన్డే, టెస్టు అనే బేధం లేకుండా విదేశీ జట్ల పైనా బెట్టింగ్‌ వేసే పరిస్థితికొచ్చింది. ట్వంటీ-20 మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్‌ జాఢ్యం బాగా ఊపందుకుంది. శనివారం నుంచి ప్రారంభమైన ఐపీఎల్‌ మ్యాచ్‌లకు పందెం రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు.

మాజీ క్రీడా దిగ్గజాలతో ముంబయిలో చేపట్టిన సూపర్‌ సిరీస్‌ మార్చి 11న కరోనాతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) ప్రేక్షకుల్లేకుండా సాగింది. రెండు నెలల పైగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత జరుగుతున్న మ్యాచ్‌లు కావడంతో బెట్టింగ్‌లకు బుకీలు సిద్ధమయ్యారు.

జిల్లాలో జోరుగా...: నంద్యాల పరిధిలో 2018లో అయిదు కేసులు నమోదు చేసి 17 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.39 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాల పరిధిలో 2019లో ఏడు కేసులు నమోదు చేసి 11 మంది బెట్టింగ్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా రూ.37.43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఆదోని పరిధిలో రెండేళ్ల క్రితం పోలీసులు ఓ బెట్టింగ్‌ ముఠాను పట్టుకున్నారు. ఒకేసారి పది మందితో మాట్లాడే సాంకేతిక సామగ్రితోపాటు, పది మందిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.2 లక్షల పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు పాతబస్తీలో వన్‌టౌన్‌ కేంద్రంగా బెట్టింగ్‌ సాగుతుంది. గతంలో పలువురు లాడ్జీల్లో బెట్టింగ్‌ కొనసాగిస్తూ దొరకగా, రూ.లక్షల్లో స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి కొందరు కర్నూలు వచ్చి నగర శివారుల్లో అద్దె ఇళ్లలో ఉంటూ బెట్టింగ్‌కు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. కర్నూలు సబ్‌డివిజన్‌లో 2018-19 రెండేళ్లలో 12 కేసుల వరకు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ పందేలను నిరోధించేందుకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సి ఉంది.

బంతి..బంతికి, ఓవర్‌.. ఓవర్‌కి: క్రికెట్‌ బెట్టింగ్‌లో క్షణాల్లో జీవితాలు తారుమారయ్యే ఆట పేరు ఫ్యాన్సీ. ఇందులో బంతి..బంతికి ఫోర్‌, సిక్స్‌ కొడతారా? అవుట్‌ అవుతారా? అనే దానిపై పందెం సాగుతుంది. మరికొందరు ఒక ఓవర్‌లో 18 కంటే పరుగులు ఎక్కువ వస్తాయని, వికెట్లపైనా పందెం వేస్తారు. గెలుపోటములపై బెట్టింగ్‌ వేస్తారు. మధ్యలో రేటింగ్‌ మారితే దాని తగ్గట్టు పందేన్ని మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇలా నలుగురైదుగురికి కలిపి ఒక చరవాణి నెంబరు ఇస్తారు. ఆ నెంబరుకు ఫోన్‌ చేసి బెట్టింగ్‌ వేసే అవకాశం ఇస్తారు. పెద్ద బోర్డులో అయితే ముందస్తుగా రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు డిపాజిట్‌ చేస్తుంటారు. అదే చిన్న బోర్డు అయితే రూ.10 వేలు డిపాజిట్‌ చేయించుకుని బెట్టింగ్‌కు అవకాశమిస్తారు. ఇలా పందెంలో సిరీస్‌ పూర్తయ్యేలోగా అప్పులపాలయ్యేవాళ్లే ఎక్కువగా ఉంటారు. హోటళ్లు అద్దెకు తీసుకుని పందేల జోరు కొనసాగించేవారున్నారు.

నంద్యాలలో భారీగా...: క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహించే బుకీల వద్ద ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్ల ద్వారా బడా వ్యాపారుల కుమారులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, దుకాణాల్లో పనిచేసే గుమస్తాలు, యువకులు, విద్యార్థులు, ఆఖరికి పొలం పనులు చేసే రైతులు సైతం బెట్టింగ్‌ మహమ్మారి బారిన పడి జీవితాలు ఛిద్రం చేసుకుంటున్నారు. జిల్లాలో కర్నూలుతోపాటు, నంద్యాల, ఆదోని, డోన్‌, బనగానపల్లి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో భారీ స్థాయిలో పందేలు సాగుతున్నాయి. హైదరాబాద్‌ కర్నూలుకు దగ్గరగా ఉండటంతో బెట్టింగ్‌ ప్రభావం ఎక్కువగానే ఉంది. నంద్యాలలో గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఒక్క రోజుకు రూ.10 కోట్ల వరకు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. పొద్దుటూరు, హైదరాబాద్‌, బెంగళూరులోని బుకీలతో జిల్లాకు లింకుంది. కొందరు రాజకీయ నాయకులు సైతం ఈ వ్యసనానికి బానిసలే. ఇలా బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఇంట్లో చెప్పలేక, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ జిల్లాలో ఉన్నాయి. బెట్టింగ్‌ పెట్టేందుకు డబ్బు కోసం కొందరు యువత దొంగలుగా మారుతున్నారు.

యాప్‌ల ద్వారా కొత్త పంథా: బెట్టింగ్‌ వేసే బుకీలు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఆన్‌లైన్‌పై అవగాహన కలిగిన యువతే ప్రధాన లక్ష్యంగా యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు దిగుతున్నారు. వీరంతా 10క్రిక్‌, బెట్‌ 365, క్రికెట్‌ మజా, క్రికెట్‌ లైవ్‌లైన్‌, ఎల్‌సీఈఎక్స్‌సీహెచ్‌ వంటి యాప్‌లు డౌన్‌లోడు చేసి సబ్‌ బుకీలను ఎంచుకుని పందేలు కడుతుంటారు. వాటి ద్వారా ఓడిన వారి నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారు. 34 సెకన్లు ముందుగా జరిగే ప్రసారాన్ని ‘బైరంగ్‌ ర్యాప్‌’ యాప్‌ ద్వారా తెలుసుకుని పందేలకు దిగిన వాళ్లని బోల్తా కొట్టిస్తున్నారు. ఈ పంథాపై పోలీసు నిఘా వర్గాలు దృష్టి పెట్టి, పందేలను నిరోధించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.