close

బుధవారం, నవంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమరం వద్ధు. సంయమనం ముద్దు

● ప్రజలు పూజలకే పరిమితం కావాలి

● కరోనా వల్లే బన్నీ ఉత్సవం రద్దు

● ‘ఈనాడు-ఈటీవీ’తో ఎస్పీ ఫక్కీరప్ప ముఖాముఖీ

జిల్లాలోని దేవరగట్టులో ఏటా దసరా పర్వదినోత్సవం నాడు... కర్రల సమరం జరుగుతుంది. ఈ ఉత్సవంలో... హింస చోటుచేసుకుంటుంది. ఎంతోమంది తలలు పగులుతాయి. వేలాది మంది పాల్గొనే ఈ ఉత్సవం ద్వారా కరోనా వచ్చే ప్రమాదం ఉండటంతో... ఈ ఏడాది బన్నీ ఉత్సవాన్ని నిషేధిస్తూ కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశాలిచ్చారు. ఈ తరుణంలో... కర్రల సమరాన్ని ఆపేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ‘ఈనాడు-ఈటీవీ’తో ముఖాముఖి మాట్లాడారు. - ఈనాడు డిజిటల్‌, కర్నూలు

ప్రశ్న: బన్ని ఉత్సవం రద్దు చేయడానికి ప్రధాన కారణం కరోనాయేనా? ఇతర కారణాలు ఉన్నాయా?

సమాధానం: దేవరగట్టులో బన్ని ఉత్సవం(కర్రల సమరం) రద్దు చేయడానికి ప్రధాన కారణం కొవిడే. లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సంవత్సరానికి బన్ని ఉత్సవంపై నిషేధం విధించడమైంది.

ప్రశ్న: బన్ని ఉత్సవం నిషేధ ఉత్తర్వులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

సమాధానం: పోలీస్‌, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో సమావేశాలు పెట్టి... బన్ని ఉత్సవాన్ని ఎలాంటి పరిస్థితుల్లో నిషేధించామనే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. పెద్ద మొత్తంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, కర్ర పత్రాలు పంపిణీ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సైతం నిషేధంపై విస్త్రతంగా ప్రచారం చేశాం.

ప్రశ్న: బన్ని ఉత్సవంలో రక్త పాతం జరగకుండా పక్కా కార్యాచరణ ఏమైనా చేపట్టారా?

సమాధానం: కచ్చితంగా... పోయిన సంవత్సరం కర్రలతో రాకూడదని భక్తి భావంతో పండగ నిర్వహించుకోవాలని చెప్పాం. ఈ సంవత్సరం అసలు రాకూడదని చెబుతున్నాం. ఈ ఏడాది కర్రల సమరం నిషేధించాం. దేవరగట్టులో మిగతా ఉత్సవాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం పూజలన్నీ జరుగుతాయి.

ప్రశ్న: కర్రల సమరం కంటే ముందు స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఊరేగింపు ఉంటాయి కదా. వాటికి అనుమతి ఉందా? ఎంతమందిని అనుమతిస్తారు?

సమాధానం: ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆలయ కమిటీతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం.

ప్రశ్న: కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి నుంచి మద్యం రాకుండా ఎలా అడ్డుకుంటారు?

సమాధానం: ఎక్సైజ్‌ శాఖ ఇప్పుడు పోలీసు శాఖలో కలిసింది. అక్రమ మద్యాన్ని అరికట్టడానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోని ఏర్పాటు చేశాం. కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం రాకుండా ఆరు చెక్‌పోస్టులు, ఐదు మొబైల్‌ పార్టీలు కూడా పని చేస్తున్నాయి. ఎస్‌ఈబీ ఏర్పాటు చేశాక కర్ణాటక మద్యం తీసుకువస్తున్న వారిపై కేసులు పెట్టాం. దేవరగట్టు ఉత్సవాల సమయంలో కర్ణాటక మద్యం, నాటుసారాలను అరికట్టడానికి కృషి చేస్తున్నాం.

ప్రశ్న: కర్రల సమరాన్ని ఆపేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏవిధంగా వినియోగించనున్నారు?

సమాధానం: డ్రోన్లు వాడతాం. ఆలయం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. మాకున్న సమచారంతో ఉత్సవాల్లో ఎవరు పాల్గొంటారనే విషయాన్ని సేకరిస్తాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: ఎంతమంది సిబ్బందిని కేటాయిస్తున్నారు?

సమాధానం: గత ఏడాది కన్నా ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని కేటాయిస్తాం. పది రోజుల ఉత్సవం కాబట్టి 1500 మంది సిబ్బందిని బందోబస్తు కోసం కేటాయిస్తాం.

ప్రశ్న: ఈ ఉత్సవంలో పాల్గొనాలనుకునే ప్రజలకు మీరేం చెబుతారు?

సమాధానం: కర్రల సమరం తప్ప మిగతా ఉత్సవాలు చేసుకోవచ్ఛు కర్రల సమరాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

ప్రశ్న: ఆలయ కమిటీ సహకారం ఉన్నా.. స్థానిక ప్రజలు బన్ని ఉత్సవం నిర్వహిస్తామంటున్నారు. దీనిపై మీరేమంటారు?

సమాధానం: ఒకరిద్దరు వ్యతిరేకిస్తున్నా వారికి కూడా ఇది కరెక్ట్‌ కాదు అని చెప్పడం జరిగింది. ఎవరి మనోభావాలూ దెబ్బతీయాలనే ఉద్దేశం లేదు. ఇప్పటివరకు కొన్ని పండగలకు ఆంక్షలు విధించాం. రాబోయే రోజుల్లో జరిగే కొన్ని పండగలకు ఆంక్షలు విధిస్తున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.