close

మంగళవారం, జులై 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేర వార్తలు

వేర్వేరు చోట్ల అయిదుగురి మృతి

ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అయిదుగురు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొని ఒకరు, నీటిగుంతలో పడి బాలుడు, ఆత్మహత్యా యత్నం చేసిన ఓ మహిళ, ద్విచక్ర వాహనం పైనుంచి పడిన వ్యక్తి, అనుమానాస్పద స్థితిలో వీఆర్వో మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం), న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలో ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రెండవ పట్టణ సీఐ శ్రీనివాసాచారి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న పార్థసారథి (51) జనరల్‌ ఆస్పత్రి ఎదుట రాఘవేంద్ర మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచిన అనంతరం కొన్ని మందులు నిల్వ లేకపోవడంతో తెచ్చుకొనేందుకు ఏజెన్సీకి వెళ్తుండగా.. న్యూటౌన్‌ సమీపంలోని సంస్కృతి షాపింగ్‌మాల్‌ వద్ద అతివేగంగా వచ్చిన ఓ ఆటో ఢీ కొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కావడంతో పార్థసారథిని చికిత్స నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


గాయపడిన వ్యక్తి మృతి

కంచనపల్లి(మిడ్జిల్‌) : మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన యాదయ్య (50) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు. శనివారం దోనూరు-కంచనపల్లి రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ..

నారాయణపేట గ్రామీణం : వ్యక్తి దూషించడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆదివారం మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో అదే గ్రామానికి చెందిన మహ్మద్‌అలి ఈనెల 21న గొడవ పడి ఆమెను భర్త, కులస్థుల ఎదుట దూషించాడు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్సకు మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. భార్య చావుకు కారణమైన మహ్మద్‌అలిపై భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రమోహన్‌రావు తెలిపారు.


నీటి గుంతలో పడి బాలుడు..

ధన్వాడ : మండలంలోని కొండాపూర్‌కు చెందిన రెండేళ్ల బాలుడు ఆదివారం సాయంత్రం నీటిగుంతలో పడి మృతిచెందాడు. పద్మమ్మ, కాశప్ప దంపతుల మూడో కుమారుడు బాబు సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటూ నీటి గుంతలో పడ్డాడు. గుర్తించిన కుటుంబికులు వెంటనే ఆటోలో ధన్వాడ ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన సిబ్బంది మెరుగైన చికిత్సకు పేట ఆసుపత్రికి రిఫార్సు చేశారు. అక్కడికి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు.


అనుమానాస్పద స్థితిలో వీఆర్‌ఏ..

మక్తల్‌ : అనుమానాస్పద స్థితిలో వీఆర్‌ఏ మృతిచెందిన సంఘటన ఆదివారం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన కట్ట నర్సిములు (28) తహశీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు. ఆదివారం స్నేహితులతో కలిసి ముడుమాల్‌, బైరంపల్లిలో వివాహాలకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పరీక్షలు నిర్వహించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లగా.. గాయాలు, రక్తపు మరకలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తూ.. నర్సిములు అన్న కట్ట వెంకటేశ్‌, భార్య అనిత.. కృష్ణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ శంకర్‌ను వివరణ కోరగా.. నర్సిములు భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.


ఆడ శిశువు మృతదేహం లభ్యం

దామరగిద్ద : మండలంలోని కాన్‌కుర్తి శివారులో ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని మహిళ జన్మనిచ్చి గ్రామం చివరన కంపచెట్లలో పడేసిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన మహిళ ఆదివారం బహిర్భూమికి వెళ్లగా.. అక్కడ ఆడ శిశువు మృతదేహం కనిపించడంతో ఆమె గ్రామస్థులకు తెలిపారు. తెరాస నాయకుడు భీంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు బస్వరాజ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాంబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచానామా అనంతరం శిశువు మృతదేహానికి పేట జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు శిశువు మృతదేహాన్ని పాతిపెట్టారు.


వివాహిత ఆత్మహత్య

ముచ్చింతల (చిన్నచింతకుంట) : మండలంలోని ముచ్చింతలలో ఆదివారం సాయంత్రం జమున (26) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన నాగరాజుతో గద్వాలకు చెందిన జమునతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. హైదరాబాద్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహించే నాగరాజు లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలలుగా గ్రామంలోనే ఉంటున్నారు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో జమున ఇంట్లో ఉరి వేసుకొంది.


టంకరలో ఇంటర్‌ విద్యార్థిని..

టంకర (హన్వాడ) : సెల్‌ ఫోన్‌ వినియోగం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించటంతో టంకర గ్రామానికి చెందిన విద్యార్థిని (17) శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొన్నట్లు హన్వాడ ఎస్సై సతీశ్‌ ఆదివారం తెలిపారు. ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సరం విద్యార్థిని ఇటీవల సెల్‌ ఫోన్‌ ఎక్కువగా వినియోగిస్తుండటంతో ఇది మంచిది కాదని, సెల్‌ఫోన్‌ వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపం చెందిన యువతి ఇంట్లో ఉరేసుకొందన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.