close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అన్ని హంగులతో వైద్య కళాశాల భవనం

నేడు ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్‌, ఈటల

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

వైద్యకళాశాల భవనం

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరవాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని సోమవారం రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించనున్నారు. 2014 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్‌కు వైద్య కళాశాలను మంజూరు చేసింది. దీంతో జిల్లా ఆస్పత్రి జనరల్‌ ఆస్పత్రిగా రూపుదిద్దుకుంది. జనరల్‌ ఆస్పత్రి ప్రాంగణంలోని వెనుక భాగంలో తాత్కాలికంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 2015లో భారత వైద్య మండలి (ఎంసీఐ)కి ప్రతిపాదనలు పంపించగా 2016 ఆగస్టు నుంచి తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో 150 మంది విద్యార్థులకు అనుమతి రాగా, 2016 నుంచి 2019 వరకు నాలుగు బ్యాచ్‌ల్లో 625 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 2018-19లో ఆల్‌ ఇండియా కోటాలో కేరళ, రాజస్థాన్‌, హరియాణా విద్యార్థులకు ఇక్కడ సీట్లు వచ్చాయి. 2019-20 బ్యాచ్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 175 సీట్లకు అనుమతి వచ్చింది.

● వైద్య కళాశాల సొంత భవనం, జనరల్‌ ఆస్పత్రి నిర్మాణాల కోసం 2015 నవంబరు నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.450 కోట్లతో అనుమతి ఇచ్చింది. జిల్లా కేంద్రం శివారులోని ఎదిరలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌, ఫిజియోథెరపీ కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రూ.130 కోట్లతో వైద్య కళాశాల భవనం, వసతి గృహాలు, ల్యాబ్‌లు, ఆడిటోరియం నిర్మించారు. మొత్తం మూడు బ్లాకుల్లో భవనాలు నిర్మించగా ఒక్కో బ్లాకులో గ్రౌండ్‌-1 ఫ్లోర్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, సెంకడ్‌ ఫ్లోర్‌, థర్డ్‌ ఫ్లోర్‌ ఉన్నాయి. దీంతోపాటు వ్యాయామశాలలు, ఆట మైదానం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబరులో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రి భవన సముదాయంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఎదిరకు తరలించారు.

కళాశాల ప్రత్యేకతలు...

*● 2017లో సెమీ అటానమస్‌ సంస్థగా గుర్తింపు వచ్చింది

*● కేంద్రం ఈ కళాశాలకు అనుబంధంగా ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధన కేంద్రం (ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ) మంజూరు చేయగా, జానంపేట పీహెచ్‌సీలో ఏర్పాటు చేశారు.

*● 800 మంది విద్యార్థులు, 100 మంది సీనియర్‌ రెసిడెంట్స్‌కు వసతి కొనసాగుతోంది.

*● ప్రతి బ్లాక్‌లో సీసీ కెమెరాలను అమర్చారు.

*● కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం పరీక్షల్లో ఫార్మకాలజీ విభాగంలో ఈ కళాశాల విద్యార్థి రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాల్లో మహబూబ్‌నగర్‌ వైద్య కళాశాల మూడో స్థానంలో నిలిచింది.

*● కొవిడ్‌-19 నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన మొదటి ప్రభుత్వ వైద్య కళాశాలగా మహబూబ్‌నగర్‌ నిలిచింది.

భవిష్యత్తులో మరింత విస్తరిస్తాం : వైద్య కళాశాలను సోమవారం మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రూ.130 కోట్లతో వైద్య కళాశాల భవనాన్ని నిర్మించాం. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మెడికల్‌ హబ్‌గా మార్చడానికి మరో 50 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇక్కడ అత్యాధునికమైన జనరల్‌ ఆస్పత్రితోపాటు పరిశోధన కేంద్రాలు రానున్నాయి. భవిష్యత్తులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రతిపాదనలు జరుగుతున్నాయి.

- పుట్టా శ్రీనివాస్‌, సంచాలకులు, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.