close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉచిత రేషన్‌కు ఎదురు చూపులు..!

నర్సాపూర్‌రెవెన్యూ డివిజన్‌లో 5,618 దరఖాస్తుల పెండింగ్‌

అధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌ టౌన్‌

 


రేషన్‌ దుకాణంలో బియ్యం పంపిణీ

లాక్‌డౌన్‌లో పేదలు జీవనోపాధి కోల్పోవడంతో వారు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్‌, కందిపప్పు పంపిణీ చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రేషన్‌ కార్డు కలిగిన కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యంతో పాటు కుటుంబానికి రూ.1500 నగదును నేరుగా వారి ఖాతాల్లోనే రెండు పర్యాయాలు ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి నిమిత్తం వలస వచ్చిన కార్మికులను సైతం గుర్తించి బియ్యంతోపాటు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. ఎవరూ పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని లబ్ధిదారులను గుర్తించి ఈ కార్యక్రమం నిర్వహించారు. నవంబర్‌ నెల వరకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలపడంతో పేద ప్రజలకు కొంత ఊరట లభించింది. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిని నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో నష్టపోతున్నామని వారు వాపోతున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో పేదలకు బియ్యం ఇస్తున్న దాతలు

అన్ని మండలాల్లో..

నర్సాపూర్‌ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 5,618 వరకు కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ బియ్యం అందక నియోజకవర్గంలోని కొంతమంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి వారికి కూడా నవంబర్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వెల్దుర్తి మండల పరిధిలో వలస కార్మికులకు మొదటి విడతగా బియ్యం, రూ.500 అందజేశారు. రెండో విడత సమయంలో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో పంపిణీ చేయాల్సిన వాటిని నిలిపివేశారు.

దాతల సాయంతో..

నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చాలా మంది ప్రజలు తమ రేషన్‌ను తిరిగి ఇచ్చి పేదలకు అందించేందుకు ముందుకు రావడంతో అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రేషన్‌ కార్డు లేని పేద కుటుంబాలకు బియ్యాన్ని అందించారు. దీంతో లాక్‌డౌన్‌ కాలంలో పేదలకు కాస్త సాయం లభించింది. అయితే రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాకపోవడంతో నవంబర్‌ వరకు ఎలా ఉండాలని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఏళ్లు గడుస్తున్నా ఇంకా రాలేదు

- మన్నె చంద్రకాంత్‌, నర్సాపూర్‌

కొత్త రేషన్‌ కార్డుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు రేషన్‌ కార్డు రాకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ ఫలాలను పొందలేకపోతున్నాం. లాక్‌డౌన్‌ సమయంలో సైతం మా కుటుంబానికి ఎలాంటి ఆర్థికపరమైన లబ్ధి చేకూరలేదు.


లాక్‌డౌన్‌ కాలంలో అవస్థలు పడ్డాం

- అబీద్‌ హుస్సేన్‌, నర్సాపూర్‌

రేషన్‌కార్డు లేక లాక్‌డౌన్‌ కాలంలో అవస్థలు పడ్డాం. దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో పెండింగ్‌లోనే ఉంది. దీంతో ఉచిత బియ్యం, ఆర్థిక సాయం పొందలేదు. గతంలో ఉచిత గ్యాస్‌ కోసం దరఖాస్తు చేసుకోగా రేషన్‌ కార్డు లేకపోవడంతో వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

- అరుణారెడ్డి, ఆర్డీవో, నర్సాపూర్‌

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. రేషన్‌ తీసుకునే సమయంలో ఏదైన సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తాం. రేషన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.


మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.