close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిన్నారిని అపహరించిన నిందితుల అరెస్టు

తల్లి మహేశ్వరికి కూతురు చంద్రకళను అప్పగిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి, చిత్రంలో ఏసీపీ భుజంగరావు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: మూడేళ్ల చిన్నారి చంద్రకళను అపహరించిన నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణంలోని డీసీపీ క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో నివసిస్తున్న ఉప్పోతల రాము ఉపాధి కోసం కొన్నిరోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. ఈయన సొంత గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా గార్లపాడు గ్రామం. భర్త రాము ఆచూకీ వెతుక్కుంటూ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు అతని భార్య మహేశ్వరి, తన మూడేళ్ల కూతురు చంద్రకళతో వచ్చారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం తాటికొండకు చెందిన మరపాక బాబు, మరపాక రాజు ఆమెను ఆదివారం గుర్తించి.. భర్త రాము ఆచూకీ చూపిస్తామంటూ మాయమాటలు చెప్పారు. గజ్వేల్‌కు ఆమెతోపాటు కూతురును తీసుకెళ్లారు. అక్కడ గుడ్డి ఆనందమ్మను కలిశారు. తర్వాత వారంతా సోమవారం మధ్యాహ్నం భువనగిరి వచ్చారు. మూత్రవిసర్జనకు వెళ్తున్నానంటూ ఆనందమ్మ మహేశ్వరికి చెప్పి ఆమె బిడ్డ చంద్రకళను తీసుకెళ్లి తిరిగి రాలేదు. తన బిడ్డను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లారని సోమవారం సాయంత్రం భువనగిరి పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు మహేశ్వరి ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగించారు.

ఒప్పందం మేరకు పిల్లల వేటలో..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మందెల్లగూడేనికి చెందిన లకావత్‌ భిక్షపతికి సంతానం లేరు. డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు. తనకు పాప లేదా బాబు కావాలని జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం తాటికొండకు చెందిన జాటోతు బాలు, లావుడ్య శ్రీనుకు తెలిపారు. వారు మధ్యవర్తులుగా ఉండి వారి గ్రామానికి చెందిన మరపాక బాబు, మరపాక రాజు, గుడ్డి ఆనందమ్మకు సమాచారం ఇచ్చారు. పాప లేదా బాబును తీసుకొస్తే రూ.2లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని తలచిన బాబు, రాజు, ఆనందమ్మ ఎవరినైనా ఒకరిని అపహరించాలని నిర్ణయించారు. ఇలా తిరుగుతూ హైదరాబాద్‌ బస్‌స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ కూతురుతో ఒంటరిగా ఉన్న మహేశ్వరిని గుర్తించారు. ఆమెను భువనగిరికి తీసుకొచ్చి ఆమె కూతురును అపహరించారు. బాలిక దొరికింది.. రూ.2లక్షలు తీసుకుని భువనగిరిలోని శ్రీరేణుకా ఎల్లమ్మ గుడి వద్దకు రావాలని ఈ ముగ్గురు భిక్షపతితోపాటు మధ్యవర్తులకు కబురు పెట్టారు. బుధవారం ఎల్లమ్మ గుడిలో పూజలు చేస్తుండగా.. పక్కా సమాచారంతో ఏసీపీ భుజంగరావు పర్యవేక్షణలో పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకొన్నామని డీపీసీ తెలిపారు. ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, వీరందరిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన మారపాక బాబు పరారీ ఉన్నాడని, మిగిలిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. గతంలో వీరికి నేర చరిత్ర లేదని స్పష్టం చేశారు. అనంతరం విలేకరుల సమక్షంలో డీసీపీ నారాయణరెడ్డి చిన్నారి చంద్రకళను తల్లి మహేశ్వరికి అప్పగించారు. కేసును ఛేదించిన పట్టణ ఎస్సై వినోద్‌, పోలీసులు అంజయ్య, వెంకటయ్య, శేఖర్‌ను డీసీపీ అభినందించారు.

బెంగళూరులో మహేశ్వరి భర్త రాము

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి పొందిన మూడేళ్ల చిన్నారి చంద్రకళ, ఆమె తల్లి మహేశ్వరికి పోలీసులు భువనగిరి పట్టణంలోని సఖి కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.ఈ కేంద్రాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ డైరెక్టర్‌ పద్మజ రమణ బుధవారం సందర్శించి విచారణ చేపట్టారు. తల్లి మహేశ్వరితో మాట్లాడి కూతురు అపహరణ ఉదంతంపై ఆరా తీశారు. తాము రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపి దర్గా గ్రామంలో ఉంటున్నామని ఆమె చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తల సహకారంలో జేపీ గ్రామ సర్పంచి ఫోన్‌ నంబరు తెలుసుకొని ఆయనతో డైరెక్టర్‌ పద్మజ రమణ మాట్లాడారు. సర్పంచి.. మహేశ్వరి భర్త రాముకు ఫోన్‌ చేయగా.. తాను బెంగళూరులో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత భర్త రాము భార్య మహేశ్వరితో వీడియో కాల్‌లో మాట్లాడించారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లలో బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిఘా కమిటీలను ఏర్పాటు చేస్తామని డైరెక్టర్‌ పద్మజ రమణ తెలిపారు. బాలలు, మహిళల రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లు 100, 1098, 108, 181లో సంప్రదించాలని కోరారు. ఆమె వెంట మహిళా శిశు సంక్షేమాధికారిణి స్వరాజ్యం, బాలల పరిరక్షణ శాఖాధికారి సైదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.