close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గలీజు దందా

పురపాలికల్లో ఏళ్లుగా కొనసాగుతున్న తీరిది

పురపాలికల్లో మడిగెల అద్దె దందా సాగుతోంది. కొందరు యథేచ్ఛగా వాటిని ఆక్రమించేస్తున్నారు. నామమాత్రపు ధరలకు లీజుకు తీసుకుని ఇతరులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని పురపాలికలను ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

-నల్గొండ పురపాలిక, దేవరకొండ, చిట్యాల, మిర్యాలగూడ, చండూరు, న్యూస్‌టుడే


పురపాలిక ఆదాయానికి గండి


దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ముందున్న వాణిజ్య దుకాణాలు

దేవరకొండ పురపాలక పరిధిలోని ఆస్పత్రి ముందు ఎనిమిది వాణిజ్య దుకాణ సముదాయాలు, పాత బజార్‌ వాణిజ్య దుకాణాలు, మాయాబజార్‌లోని వాణిజ్య దుకాణాల యజమానులు దశాబ్దాలుగా తిష్ఠ వేశారు. వీటితో పాటు లీజు పేరిట విక్రయాలు కొనసాగుతున్నాయి.ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఎనిమిది దుకాణాలు దేవరకొండ 1996లో గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో రాత్రికి రాత్రి అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆశీస్సులతో విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాలకు కారణమయ్యాయి. ఆ నిర్మాణాలు లీజుకు తీసుకుంటామని అధికారులకు వ్యాపారులు తెలిపారు. 2001 నుంచి వ్యాపారులు లీజు చెల్లించడం లేదు. లీజు చెల్లించకపోగా పురపాలిక స్థలంలో అక్రమంగా నిర్మించిన దుకాణాలను ఒక్కొక్కటిగా విక్రయాలకు పాల్పడుతున్నా పురపాలిక అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. గతంలో ఇదే తరహాలో పాతబజార్‌లోని ఆరు దుకాణాలు లీజు దారులు వేరొకరికి విక్రయించారు. గ్రామపంచాయతిలో దశాబ్ధాల క్రితం లీజుకు ఒకరి పేరు ఉండగా ప్రస్తుతం అవి వేరొకరి ఆధీనంలో ఉన్నాయి.


టెండరు పిలవలేదు

చండూరు చౌరస్తాలోని పురపాలిక మడిగెలు

చిట్యాల పురపాలికకు సంబంధించి 10 మడిగెలు ఉన్నాయి. వీటిలో ఒకటి పాల ఉత్పత్తిదారుల సంఘం కోసం ఉచితంగా కేటాయించారు. మిగిలిన 9మడిగెలను అద్దెకిచ్చారు. వీటి ద్వారా నెలకు రూ. 97,00,300 ఆదాయం వస్తోంది. వీటికి 2017 ఏప్రిల్‌ ఒకటిన(చిట్యాల పంచాయతీగా ఉన్న సమయంలో) టెండరు పిలిచి కేటాయించారు. దీని గడువు 2019 డిసెంబరుతో ముగిసింది. ఇప్పటికీ రూ.3లక్షల పైచిలుకు బకాయిలు రావాల్సి ఉంది. అప్పటినుంచి ఇప్పటి వరకు టెండరు పిలవలేదు.


35 ఏళ్లుగా కొనసాగుతున్న లీజుల దందా


ప్రకాశంబజారులోని లీజు దుకాణాల సముదాయం

నల్గొండ పురపాలికకు రూ. వందల కోట్ల విలువైన దుకాణాల సముదాయాలు ఉన్నాయి. ప్రకాశం బజారు, వస్త్రలత బజారు, నెహ్రూ గంజ్‌, చౌరస్తా ప్రాంతాల్లో 233 దుకాణాలు, కూరగాయల మార్కెట్‌లో 104 మడిగెలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 14 మడిగెలు, పట్టణ మందిరం ప్రాంతంలో 20వరకు దుకాణాల సముదాయాలున్నాయి. వీటికి ప్రతి ఐదేళ్లకోసారి వేలం ద్వారా లీజులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రకాశం బజారులోని 233 దుకాణాలకు 35 ఏళ్లు దాటినా అద్దె రేట్లు పెంచలేదు. లీజులు పొడిగించలేదు. ఇప్పటి వరకు వారినే కొనసాగిస్తున్నారు. అవే దుకాణాల స్థలాలు తమకే మార్కెట్‌ ధరలకు ఇవ్వాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు. వాటికి సంబంధించిన అద్దెలు సుమారు రూ.2 కోట్లకు పైగా మున్సిపాలిటీకి రావాల్సి ఉంది. ఇక కూరగాయల మార్కెట్‌ మడిగెల పరిస్థితి కూడా అంతే. పదేళ్లు దాటినా అద్దెలు పెంచడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌ ధరల ప్రకారం లీజులకు ఇస్తే నెలకు రూ.2 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.


సరైన అద్దె ఇవ్వరు... మడిగెలను వదిలి వెళ్లరు


చిట్యాలలో పురపాలిక దుకాణ సముదాయం

చండూరు పురపాలిక పరిధిలో 21 అద్దె మడిగెలున్నాయి. మొదట లీజు తీసుకున్నవారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. చౌరస్తాలో ప్రైవేటుగా ఒక్కో దుకాణానికి సుమారుగా రూ.10వేల వరకు అద్దె నడుస్తుండగా పురపాలిక మడిగెలకు మాత్రం లీజు దారులు గరిష్ఠంగా రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. దీంతో రూ. లక్షల్లో పురపాలిక ఆదాయానికి గండి పడుతోంది.


నిర్మాణం పూర్తై ఐదేళ్లు...


ఎన్టీఆర్‌ పురపాలిక దుకాణ సముదాయం రెండో అంతస్తు

మిర్యాలగూడలో ఎన్టీఆర్‌ పురపాలిక దుకాణ సముదాయంలో రెండో అంతస్తులో 99 దుకాణాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం వీటి నిర్మాణాలు పూర్తయ్యాయి. మూడేళ్ల క్రితం టెండర్లు పిలవటంతో మార్కెట్‌ ధరలకన్నా అద్ధెలు ఎక్కువగా ఉన్నాయంటూ టెండర్లకు వ్యాపారులు ముందుకు రాలేదు. పురపాలిక దుకాణ సముదాయం కింద దుకాణాలు, పాతబస్టాండు దుకాణాలు అద్దెల రూపంలో నెలకు సగటున రూ.6 లక్షల వరకు పురపాలికకు ఆదాయం సమకూరుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.