close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పక్కగా చెరువుల లెక్క

కబ్జాలు తేల్ఛి. హద్దులు నిర్ణయించేందుకు సర్వే

భువనగిరి పెద్ద చెరువు



ఆత్మకూర్‌లో చెరువు వద్ద సర్వే చేస్తున్న దృశ్యం

ఆక్రమణల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగించేందుకు అధికార యంత్రాంగం కదిలింది. చెరువుల కబ్జాపై దాఖలైన పిటిషన్‌ విచారణలో భాగంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు చెరువుల లెక్క తేల్చేందుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు రంగంలో దిగారు. మూడు రోజులుగా జిల్లాలో సర్వే కొనసాగుతోంది. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆర్డీవోలు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్వే కోసం మండలాల సమగ్ర కార్యాచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1382 చెరువు, కుంటలను లెక్క తేల్చి వాటి స్థితిగతులపై నివేదికను సమర్పించనున్నారు. కబ్జాలపై కలెక్టర్‌ హైకోర్టులో డిసెంబరు 9న కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన ప్రాథమిక నివేదికను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ చర్యలతోనైనా ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందో వేచిచూడాలి.

- భువనగిరి, న్యూస్‌టుడే


సర్వేకు నీటి పారుదల శాఖ ఏఈ, మండల సర్వేయర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్‌ఏలతో మండలానికి ఒక బృందాన్ని నియమించారు. ఏ గ్రామంలోని ఏ చెరువును ఎప్పుడు సర్వే చేస్తారో ఆ వివరాలతో సమగ్ర కార్యాచరణ రూపొందించారు. సర్వేలో చెరువులకు ఎఫ్‌టీఎల్‌(ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌) నిర్ధారించి హద్దులు పాతనున్నారు. చెరువు ఎంత విస్తీర్ణం, ఆయకట్టు ఎంత ఉంది, ఆక్రమణల ఉన్నాయా అనే వివరాలు సేకరిస్తారు. ఎఫ్‌టీఎల్‌ నిర్దేశించిన ప్రాంతం నుంచి 30 మీటర్ల దూరంలో బఫర్‌ జోన్లను గుర్తిస్తారు. వాటిల్లో కట్టడాలు నిర్మించినా, భూ ఆక్రమణలు చేసినా గుర్తించి నివేదికలో పేర్కొని తదుపరి తొలగిస్తారు. తర్వాత చెరువు నక్షాను తయారు చేస్తారు.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు

పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలోని 1228 చెరువు, కుంటలను 2005లో అప్పటి ప్రభుత్వం నీటి పారుదల శాఖలో విలీనం చేశారు. చాలావరకు వాటి దస్త్రాలు అందుబాటులో లేవు. ఈ సర్వేతో వాటి వివరాలు రికార్డు కానున్నాయి. చాలా వరకు కుంటలు పట్టా భూముల్లోనే ఉన్నాయి. సర్వే చేసి ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించడం ద్వారా ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. హద్దురాళ్లు నాటకుండా సరిహద్దులను గుర్తించేందుకు పక్కాగా సిమెంట్‌ దిమ్మలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. సర్వేలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జలాశయాల ప్రాంతాల్లో బురద, తుమ్మచెట్లు ఎక్కువగా ఉండటంతో ఆటంకం కలుగుతోంది. పెద్ద చెరువులకు రెండు మూడు రోజుల సమయం పడుతోంది. కుంటలు సర్వే ఒక రోజులోనే పూర్తవుతోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని భువనగిరి, బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, బొమ్మలారామారం మండలాల్లో గతంలోనే హెచ్‌ఎండీఏ ఒక ప్రైవేట్‌ సంస్థతో కలిసి నీటి పారుదల శాఖ చెరువుల సర్వే చేపట్టింది. ఇంకా పూర్తి కాలేదు.

నీటి వనరుల సంఖ్య

జిల్లాలోని చెరువులు, కుంటలు 1382

వందెకరాల లోపు ఆయకట్టు ఉన్నవి 1228

వందెకరాలకు పైగా ఆయకట్టు ఉన్నవి 154


ప్రతి చెరువును పరిరక్షించడమే లక్ష్యం

- అనితారామచంద్రన్‌, పాలనాధికారి, యాదాద్రి భువనగిరి

హైకోర్టు ఆదేశం మేరకు సర్వేను పక్కాగా, త్వరగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించాం. సర్వేలో ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తారు. ఆక్రమణలుంటే గుర్తిస్తారు. తర్వాత చర్యలు తీసుకుంటాం. ప్రతి చెరువును పరిరక్షించడమే లక్ష్యం. హెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాల్లో గతంలో సర్వే చేశారు. వీటిపై తదుపరి నిర్ణయం తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.