close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

మురుగులో జలం.. ముప్పులో జనం

నగర పరిధిలో నీటి సరఫరాలో నిర్లక్ష్యం

డ్రైనేజీ కాల్వల్లోనే తాగునీటి పైపులైన్లు

పొంచి ఉన్న వ్యాధులు

ఈనాడు, నెల్లూరు న్యూస్‌టుడే, నగరపాలకసంస్థ

మురుగులోనే జలం వెళుతోంది.. ముప్పులోనే జనం ఉంటున్నారు.. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లిప్తత.. కారణాలు ఏవైనా నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలోని తాగునీటి సరఫరాలో అధ్వాన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడంతో దయనీయంగా తయారైంది.. దీంతో డ్రైనేజీకాల్వల్లోని కాలుష్య జలం తాగునీటిలో కలిసిపోతూ రోగాలకు నెలవుగా పరిణమిస్తోంది.. ఇంత జరుగుతున్నా అధికారులు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడం, వాస్తవాలను తొక్కిపెట్టి అంతా బాగుందని బుకాయించే ప్రయత్నం చేస్తుండటం.. వెరసి సమస్యకు అద్దం పడుతోంది. లోతుగాచూస్తే, రాష్ట్రంలోనే నెల్లూరు నగరపాలకసంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రూ.1,600కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగి అభివృద్ధిలోనూ ముందడుగులో కనిపిస్తుండటం గమనార్హం. ఇలాంటి ఇక్కడ, ఏళ్ల తరబడి మౌలిక వసతుల కల్పనపరంగా నిర్లిప్తత నెలకొనడంతో సమస్య ఏర్పడింది. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీవ్యవస్థ, రోడ్ల వంటి వాటిని నిర్మించడంలోనూ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ సమస్య

ప్రస్తుతం నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో నీటిసరఫరాపరంగా చూస్తే దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నగరంలో శుద్ధిజలం సరఫరా చేసే తాగునీటి పైపులైన్లు ఎక్కువభాగం డ్రైనేజీకాల్వల్లోనే వెళుతుండటం సమస్యను జటిలం చేస్తోంది. అర్ధ శతాబ్దం క్రితం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఏళ్లుగా ఆధునికీకరించకపోవడంతో ప్రస్తుతం పైపులు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల తుప్పుపట్టి పగిలిపోయి శిథిలస్థితిలో దర్శనమిస్తున్నాయి. మురుగుకాల్వల్లోనే వెళుతుండటంతో ప్రస్తుతం ఇబ్బంది ఏర్పడింది. ఆ కాల్వల్లోని మురుగునీరు పగిలిన పైపుల ద్వారా శుద్ధిజలంతో కలిసిపోయి ఇళ్లకు సరఫరా అవుతుండటం గమనార్హం. కొన్నిచోట్ల కిలోమీటర్ల కొద్దీ డ్రైనేజీల్లో వెళుతుండటంతో ఇబ్బంది ఎక్కువైంది. వాస్తవానికి, తాగునీటి పైపులైను వ్యవస్థకు ప్రత్యేక భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. నీటిసరఫరా విభాగం ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాల్సి ఉంది. లీకేజీలను అరికట్టడంతో పాటు జలం కలుషితమైనట్లు అనుమానం ఉన్న చోట స్పాట్‌ క్లోరినేషన్‌ ప్రక్రియ జరపాలి. అలాగే, ఎప్పటికప్పుడు నీటి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో అధ్యయనం చేయడంతో పాటు.. కాలుష్య కారకాలు ఎక్కువగా బయటపడిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అయితే, నెల్లూరు కార్పొరేషన్‌లో ఆ దిశగా అడుగులు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నది బహిరంగరహస్యం. నీటినమూనాలు సేకరించి అధ్యయనం మాత్రం చేస్తున్న అధికారులు కలుషిత జలంపై దృష్టి పెట్టకపోవడం ప్రస్తావనార్హం. రాయాజీవీధి, మెక్లైన్స్‌రోడ్డు, కోటమిట్ట, టెక్కేమిట్ట, ఫత్తేఖాన్‌పేట, జెండావీధి, మూలాపేట, కొరడావీధి, చిన్నబజార్‌, బృందావనం, స్టోన్‌హౌస్‌పేట.. ఇలా అనేక చోట్ల డ్రైనేజీల్లో పైపులైన్లు దర్శనమిస్తున్నాయి.


8లక్షలు జనాభా(సుమారుగా)

1.25 లక్షలు గృహాలు

43,465 కుళాయిలు

697 తాగునీటిపైపులైను వ్యవస్థ పొడవు కి.మీలలో

39 నీటిట్యాంకులు

82 ఎంఎల్‌డీ ప్రతి రోజు సరఫరా అయ్యే నీరు

166 కార్పొరేషన్‌కు నీరిచ్చే పవర్‌బోర్లు


జనానికి అవస్థ

డ్రైనేజీకాల్వల్లో తాగునీటి పైపులైన్లు వెళుతుండటం, మురుగునీరు వాటిలోకి చేరుతుండటంతో నగరజనం అవస్థ పడుతున్నారు. ఓ దశలో కలుషిత నీటిని తాగలేక ప్రైవేటు ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. లోతుగాచూస్తే, నగరపాలకసంస్థ చేపట్టే శుద్ధి ప్రక్రియల మేరకు ఈ నీటిని పక్కాగా తాగడానికి అవకాశం ఉంది. ఆ స్థాయిలో పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు ఉన్నాయి. సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు వద్ద గమనిస్తే.. వివిధ దశల్లో నీటిశుద్ధి చేపడుతున్నారు. అరకొరగా అయినా ఆలం, క్లోరినేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి పంపిణీకి దిగుతున్నారు. అయితే, పైపులైన్లే ఇక్కడ ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. సాక్షాత్తూ సమ్మర్‌స్టోరేజీ కేంద్రం వద్దే గమనిస్తే.. శుద్ధిజలం సిద్ధమైన తరువాత పైపులైనులోకి చేరే ప్రాంతంలోనే అవి తుప్పుపట్టి ఎర్రబారి దర్శనమిస్తున్నాయి. అక్కడి నుంచి పాతపైపులైన్ల ద్వారా ఇళ్ల వరకు చేరడం మరో సమస్యగా మారగా.. చివరకు డ్రైనేజీ నీరు కలుస్తుండటం ఆ శుద్ధిజలాన్ని మరింత మలినపూరితంగా చేస్తోంది. హెడ్‌వాటర్‌వర్క్స్‌,బుజ్జమ్మరేవు వద్ద కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. అక్కడ క్లోరినేషన్‌ సైతం చేపట్టకపోవడం అధికారులకే చెల్లింది.

సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు వద్ద శుద్ధిజలం పంపిణీ ప్రారంభమయ్యే పైపులు తుప్పుపట్టి ఇలా..

అడ్డంగా బుకాయింపు

కళ్లముందే కాలువల్లో తాగునీటి పైపులైన్లు దర్శనమిస్తున్నా.. నీళ్లు కలుషితమై జనం ఇబ్బంది పడుతున్నా కార్పొరేషన్‌ వర్గాలు మాత్రం అడ్డంగా బుకాయిస్తుండటం గమనార్హం. అసలు నీటికాలుష్యమే జరగడం లేదంటూ చెప్పుకొస్తుండటం చూస్తే ఏస్థాయిలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారో అర్థమవుతోంది. చివరకు వరద వచ్చినప్పుడే క్లోరినేషన్‌ చేస్తామని చెబుతుండటం చూస్తే అధికారుల తీరు అర్థమవుతోంది. ఎప్పుడైనా లోపాలను ఎత్తిచూపినప్పుడు వాటిని సరిదిద్దుకోవడం, మరోసారి జరగకుండా చూసుకోవడం పద్ధతి. తద్వారా ప్రజలకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, నగరపాలకసంస్థ వర్గాలు మాత్రం లోపాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తుండటం విమర్శనాత్మకంగా మారింది. చివరకు అసలు తప్పే జరగలేదంటూ బుకాయించడంపై ప్రజల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గతంలోనే అడుగులు పడినా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఉన్న పాత తాగునీటి పైపులైను వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రూ.550కోట్ల వ్యయంతో సంగం నుంచి నెల్లూరు నగరానికి సరికొత్త వ్యవస్థ ఏర్పాటుకు 2016లో అడుగులు వేశారు. ప్రస్తుతం ఈ పనులు 90శాతం మేర పూర్తికాగా.. ఇళ్ల వరకు పైపులైను వచ్చింది. అయితే, గృహాలకు కనెక్షన్లు అనుసంధానించడంలో మీనమేషాలు లెక్కిస్తుండటం ప్రతిబంధకంగా మారింది. ఫలితంగా పాతపైపులైను పైనే ఆధారపడి జనం కలుషిత నీటిని తాగాల్సి వస్తోంది. ఇప్పటికైనా కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారులు, ఉన్నతాధికారులు ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది.

ఫత్తేఖాన్‌పేట మసీదు వీధిలో..

శుద్ధిజల సరఫరాకు కృషి

- పీవీవీఎస్‌మూర్తి, నెల్లూరు నగరపాలకసంస్థ కమిషనర్‌

నెల్లూరు నగరంలో ప్రజలకు శుద్ధిజలం అందించేందుకు పక్కాగా కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పటికే ఆలం, క్లోరినేషన్‌ ప్రక్రియ సమర్థంగా జరిగేలా చొరవ చూపాం. నమూనా నీరు సేకరించి ప్రయోగశాలల్లో అధ్యయనం చేస్తున్నాం. ఎక్కడా నీరు కలుషితమైనట్లు తేలలేదు. కొత్తపైపులైను వ్యవస్థనూ వినియోగించుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.