close

మంగళవారం, ఫిబ్రవరి 18, 2020

ప్రధానాంశాలు

అమ్మ భాషకు ప్రాణం

అన్ని హంగులతో తెలుగు అధ్యయన కేంద్రం ఏర్పాటు

21న ఉపరాష్ట్రపతిచే ప్రారంభం

రెండు రాష్ట్రాలకు విస్తృత సేవలు

న్యూస్‌టుడే, వెంకటాచలం

వెంకయ్యనాయుడు ప్రారంభించనున్న తెలుగు అధ్యయన కేంద్రం

అమ్మ భాషకు ప్రాణం పోసేందుకు కన్నడ నేల నుంచి తెలుగు నేలకు తరలివచ్చిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం అన్ని హంగులతో రూపుదిద్దుకొంది. కళకు జీవం పోసేందుకు సిద్ధంగా ఉంది. తిక్కన నడయాడిన సింహపురి గడ్డపై నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు మార్గదర్శనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవతో ఏర్పాటైన ఈకేంద్రం భాషాభిమానుల్లో అంతులేని ఆనందం నింపనుంది. వెంకటాచలం మండలం సరస్వతినగర్‌లో జాతీయ రహదారిపై ఏర్పాటైన ఈకేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 21న ప్రారంభించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2011లో కన్నడతో పాటు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రారంభం నుంచి కర్ణాటకలో కొనసాగుతుంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈకేంద్రాన్ని కావాలని కోరడంతో ఎక్కడికీ రాకుండా ఉండిపోయింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవతో కన్నడ నేల నుంచి ప్రస్తుతం ఇక్కడికి తరలివచ్చింది. తెలుగుభాష, సాహిత్యం, సంస్కృతి పరంగా విశేష కృషి చేసి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలికితీయాలన్నదే ఈకేంద్ర ప్రధాన లక్ష్యం. శాసనాలను సేకరించి అందులోని భాష, లిపిని ప్రాచుర్యంలోనికి తేవాలన్నది ముఖ్య ఉద్దేశం. డిజిటలైజేషన్‌ ద్వారా ఆ వివరాలను విశ్వవ్యాప్తం చేయాలనేది మరో లక్ష్యం. వీటితోపాటు తాళపత్ర గ్రంథాల్లోని వివరాలను సిద్ధం చేసి ముద్రణ సౌకర్యం కల్పించడం. అలభ్య గ్రంథాలను దాతలు, ప్రజల నుంచి సేకరించి వాటిని పదిలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నారు.

శాసనాలు, తాళపత్రాల నిలయాలుగా కార్యశాలలు

ఈ కేంద్రంలో ప్రత్యేక కార్యశాలలు నిర్వహించనున్నారు. 2019 ఫిబ్రవరిలో హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్‌ మ్యాన్‌స్క్రిప్ట్‌ లైబ్రరీ వద్ద పరిశోధక విద్యార్థులు, ఆచార్యులకు ఈకేంద్రం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అదే ఏడాది మార్చి 25 నుంచి 31వతేదీ వరకు తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనూ రెండు శిబిరాల్లో 70 మందికి తర్ఫీదు ఇచ్చారు. నాలుగు నెలల క్రితం మైసూరులోనూ దేశ నలుమూలల నుంచి 37 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. మున్ముందు ఈ ప్రక్రియ కొనసాగించేందుకు కేంద్ర నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనాలు, తాళపత్రాలు చదివే వారిని ప్రోత్సహించటంతోపాటు తాళపత్ర గ్రంథాలకు ఒక కార్యశాల ఏర్పాటు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని తహసిల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రాంతంలో లభ్యమయ్యే శాసనాలు, తాళపత్ర గ్రంథాల వివరాలను కేంద్రానికి తెలియజేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

స్వర్ణభారత్‌ ట్రస్టు సహకారం

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక చొరవతో ఇక్కడికి వచ్చిన ఈ కేంద్ర ఏర్పాటుకు అనువైన స్థలం లేకపోవటంతో తాత్కాలిక ఏర్పాటు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేశారు. ఇందుకు స్వర్ణభారత్‌ ట్రస్టు సహకారం అందించింది. స్వర్ణభారత్‌ ట్రస్టు ద్వారా ట్రస్టు నిర్వహకులు సరస్వతినగర్‌లోని దీనదయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ భవనంలో 6వేల చదరపు అడుగుల స్థలం ఐదేళ్లు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తాళపత్ర గ్రంథాలు, శాసనాలు ఉంచేందుకు, గ్రంథాలయం ఏర్పాటు, కార్యశాలలు నిర్వహణకు ఈభవనం విశాలంగా ఉండటంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. కాగా శాశ్వత భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

● జిల్లాలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటుతో రెండు రాష్ట్రాల్లోని భాషాభిమానులు, కవులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక గ్రంథాలయం నిర్వహణ

అధ్యయన కేంద్రం ప్రధాన విధుల్లో గ్రంథాలయ నిర్వహణ ఒకటి. ప్రాచీన, ఆధునిక సాహిత్యంతో పాటు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి విషయాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. గత ఏడాది సుమారు 600 పుస్తకాల వరకు సేకరించి గ్రంథాలయంలో భద్రపరిచారు. కవులు, రచయితలు ఎవరైనా తెలుగు పుస్తకాలు అందిస్తే కేంద్ర గ్రంథాలయంలో ఒక అరను వారి పేరుతో కేటాయించి అందులో ఆ పుస్తకాలు నిల్వ చేస్తారు. కన్నడ నేలపై ఏర్పాటు చేసిన విధంగా జానపద, సాహిత్య మ్యూజియాలు ఇక్కడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతుల్లోని అంశాలను డిజిటలైజ్‌ చేసేందుకు కేంద్ర నిర్వహకులు చర్యలు తీసుకుంటున్నారు. ముందు తరాలకు భాషా, సాహిత్య అంశాలను అందించాలన్న లక్ష్యంతో డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేయనున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.