close

శుక్రవారం, ఆగస్టు 14, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అగ్నిపరీక్ష!

● జిల్లాలో కొవిడ్‌ నిర్ధరణలో అనేక సమస్యలు

● స్వాబ్‌ నమూనా సేకరణలోనే అంతు లేని జాప్యం

● ఫలితాలకు నాలుగైదు రోజులు.. పేరుకున్న నమూనాలు

స్వాబ్‌ నమూనాలు సేకరిస్తున్న వైద్యసిబ్బంది

ఈనాడు, నెల్లూరు న్యూస్‌టుడే, నెల్లూరు (వైద్యం): పరీక్ష చేయించుకోవాలన్న ప్రయత్నం వారికి కష్టంగా మారుతోంది.. ఫలితాలు తెలుసుకోవాలన్న తాపత్రయం ఇబ్బందుల పాల్జేస్తోంది. రోజులు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరక్కపోవడం, తమకు కొవిడ్‌ ఉందో, లేదో అర్థం కాని స్థితిలో అయోమయంగా కాలం వెళ్లదీయాల్సి రావడం.. వెరసి ఇబ్బందికరంగా మారింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉండగా.. నెల్లూరు జిల్లాలో దయనీయంగా మారింది. వారం రోజులుగా రోజుకు దాదాపు 60 నుంచి 100 కేసులు నమోదవుతుండగా.. బుధవారానికి 1201 కేసులకు ఆ సంఖ్య పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

●*నెల్లూరు నగరంలోని వేదాయపాళెం సమీపంలో త్యాగరాజనగర్‌కు చెందిన ఓ అపార్ట్‌మెంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ మేరకు వారిని ఆసుపత్రికి తరలించారు. అదే భవనంలో మరో అయిదు కుటుంబాలు నివాసముంటున్నాయి. గత నాలుగు రోజులుగా వారిని వైద్యాధికారులు, సిబ్బంది గృహనిర్బంధంలో ఉంచారు. ఇప్పటికీ కొవిడ్‌ పరీక్షలు చేయకపోవడం గమనార్హం. తమ నమూనాలు సేకరించాలని మొత్తుకుంటున్నా కాలయాపన చేయడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో బాధితుల వ్యథ వర్ణనాతీతం.

●*●అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన కుమార్‌ అయిదు రోజుల కిందట విజయవాడ వెళ్లొచ్చారు. ఈ క్రమంలో కొవిడ్‌ పరీక్ష చేసుకునేందుకు ముందుకు రాగా ఆయన పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. జీజీహెచ్‌లో నమూనా సేకరించేందుకు రోజంతా తిప్పుకోగా.. ప్రస్తుతం ఫలితం వెల్లడిలోనూ జాప్యం చేస్తున్నారు. దాంతో ఆయన అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

●*చిల్లకూరు మండలం చింతవరానికి చెందిన నలుగురు అనుమానితుల నుంచి పదిరోజుల కిందట స్వాబ్‌ సేకరించారు. ఆ మేరకు ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు లేవు. ఆ నమూనాలు ఎక్కడున్నాయో, అసలు ఉన్నాయో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. దాంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఇలా ఒకటి, రెండు కాదు.. చెప్పుకుంటూపోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి.

పెండింగ్‌లో 5 వేలు

జిల్లాలో బుధవారానికి మొత్తం 83,827 స్వాబ్‌ నమూనాలు సేకరించినట్లు వైద్యఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 77,984 నమూనాల పరీక్షల ఫలితాలు వెల్లడైనట్లు స్పష్టం చేశారు. 5,845 నమూనాలకు ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందన్నది అధికారుల నివేదిక సారాంశం. అంటే, ఈ లెక్కన ఫలితాలు రావడానికి ఏ స్థాయిలో సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్ఛు నాయుడుపేట, గూడూరులో మరో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఆ దిశగా అడుగులు లేవు. దాంతో సింహపురి వాసుల వ్యథ వర్ణనాతీతంగా మారింది. పరీక్ష ఫలితం వచ్చేలోపే తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై మదన పడుతున్నారు. కొందరు చనిపోయిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధరణ అవుతున్న క్రమంలో దైన్యంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేకంగా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి రాజ్యలక్ష్మితో ‘ఈనాడు’ మాట్లాడగా.. నమూనాలు ఎక్కువ మొత్తంలో వస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు యంత్రాలు, సిబ్బందికి కొంతమేర ఇబ్బంది ఉందన్నారు. సమస్యను అధిగమించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇదీ పరిస్థితి

జిల్లాలో కొవిడ్‌ పరీక్షలు చేయడానికి తీవ్ర జాప్యం జరుగుతుండగా.. పరీక్ష ఫలితాలు వెల్లడించడంలోనూ అదే సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కొందరు స్వయంగా ఆసుపత్రుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయాలని కోరుతున్నారు. ఇక్కడే సిబ్బంది జాప్యం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. చివరకు పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో, బాధిత కుటుంబిలకు నిర్వహించడంలోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. కేవలం కంటైన్‌మెంట్‌ జోన్‌ పేరుతో బారికేడ్లు ఏర్పాటు చేసి బ్లీచింగ్‌ చల్లడం మినహా మిగిలిన చర్యలు కరవయ్యాయి. మూడు నెలలుగా పక్కాగా సాగిన ప్రక్రియ గత నెల రోజులుగా కట్టుతప్పుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఆత్మకూరు, నెల్లూరు జీజీహెచ్‌, ఓ ప్రైవేటు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలు మినహా మిగిలిన చోట్ల లేవు. దీనికితోడు ల్యాబ్‌ టెక్నీషియన్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోంది. వారికి పీపీఈ కిట్లు, చేతులకు గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు సరిపడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

శుభకార్యానికి వెళుతూ మృత్యుఒడికి..

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నగరంలోని మెడికవర్‌ ఆసుపత్రి వద్ద జరిగింది. బుజబుజనెల్లూరు వైఎస్సార్‌ నగర్‌లో ఉంటున్న సిద్ధవరపు హరిబాబు(50), జగదేవిపేటకు చెందిన చంద్రశేఖర్‌ స్నేహితులు. వీరిద్దరూ గురువారం చిత్తూరు జిల్లాలో జరిగే ఓ శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. జగదేవిపేట నుంచి బయల్దేరిన ద్విచక్ర వాహనం మెడికవర్‌ ఆసుపత్రి వద్దకు రాగానే ఓ ప్రైవేటు ఆంబులెన్సు ఢీకొంది. దీంతో బైక్‌ నడుపుతున్న హరిబాబుకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ ఎస్సై రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.