close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

ఇల్లు..అనుమతిసులువు

 బీ-పాస్‌ విధానం అమలు

● అక్రమాలకు అడ్డుకట్ట

● సాఫ్ట్‌వేర్‌కు తుది మెరుగులు

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

పురపాలనలో పారదర్శకతకు శ్రీకారం చుట్టారు. వినూత్న మార్పులకు నాంది పలకనున్నారు. పరిశ్రమలకు అనుమతుల జారీ విషయంలో టీఎస్‌ ఐ-పాస్‌ పేరిట ప్రభుత్వం సులభతర చర్యలు అమలు చేస్తోంది. తాజాగా భవన నిర్మాణాలకు బీ-పాస్‌ పేరిట అనుమతులివ్వనున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా నూతన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన చేస్తున్నారు. మార్చిలో వెబ్‌సైట్‌లో ఎదురవుతున్న లోటుపాట్లను చక్కదిద్దనున్నారు. ఏప్రిల్‌ 2న లాంఛనంగా ప్రారంభించేందుకు పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తోంది.

 ఏటా నిర్మాణాల అనుమతులిలా

ఉమ్మడి జిల్లాలో ఒక నగర, ఆరు పురపాలక సంఘాలున్నాయి. వీటి పరిధిలో ఏటా 3500-4000 వరకు ఇళ్ల నిర్మాణాలకు అనుమతిస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు దరఖాస్తులు చేశాక అధికారులు వివిధ నిబంధనల పేరుతో అనుమతులను నిరాకరిస్తున్నారు. పురపాలక అధికారులు కోరిన ధ్రువపత్రాలను సమర్పించాక అనుమతికి ఆమోద ముద్ర వేస్తున్నారు. ఇందులో పై అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలల తరబడి భవన నిర్మాణాలకు అనుమతులు లేక దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. చివరకు నేతల కనుసైగల్లోనే అనుమతుల తతంగం కొనసాగుతోంది. అధికారులను మచ్చిక చేసుకొని వారికింత ముట్టజెప్పడంతో చివరకు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలించిన ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేందుకు పురపాలక శాఖ చర్యలు చేపడుతోంది.

75 గజాల్లోపు ఉంటే అనుమతి అక్కర్లేదు

పేద, మధ్య తరగతి వర్గాలకు నూతన పట్టణ ప్రణాళికతో భాగంగా 75 గజాల్లోపు ఇళ్లు నిర్మించుకుంటే ఎలాంటి అనుమతి అవసరం లేదు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ఇళ్లు నిర్మిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్వీయ మదింపునకు దరఖాస్తు చేసుకోవాలి. సూచించిన మేరకు నిర్మాణం జరిగితే ఇంటి నంబరు కేటాయిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. అవసరమనుకుంటే భవనం కూల్చివేతకు వెనుకాడబోమని యంత్రాంగం చెబుతోంది. ఈ తరహా ఇళ్లకు ఏటా రూ. 100 ఆస్తి పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు.

భారీ నిర్మాణాలకు ఇలా..

పెద్దపెద్ద నిర్మాణాలకు నిబంధనలను కఠినతరం చేశారు. జీ ఫ్లస్‌ 1 దాటితే నియమావళి తప్పనిసరి పాటించాలి. 675 చదరపు అడుగులతో జీ ప్లస్‌ 1 నిర్మించాలి. అగ్నిమాపక, విద్యుత్తు, ట్రాఫిక్‌, ప్రణాళిక శాఖల ఆధ్వర్యంలో ధ్రువపత్రాలు విధిగా పొందాలి. బహుళ అంతస్తులు నిర్మిస్తే అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకోవాలి. 100 గజాలు దాటిన నిర్మాణాలకు రుసుములు ఏ మేరకు వసూలు చేయాలో త్వరలో విధివిధానాలు ఖరారు కానున్నాయి.

ఇదీ పరిస్థితి

నగర, పురపాలికల్లో ఇదివరకు నేతల కనుసన్నల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అక్రమాలకు ఆమోదముద్ర వేశారు. ధ్రువపత్రాలు సక్రమంగా లేకున్నా అనుమతులిచ్చారు. నూతన పురపాలక చట్టం ప్రకారం ప్రస్తుతం నిబంధనలు కఠినతరం చేశారు. ఎవరైన నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో పొందుపరిచారు. స్వీయ మదింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇళ్ల నిర్మాణ అనుమతులకు ముప్పుతిప్పలు పడే దుస్థితికి ఇక తెరపడుతుందని భావిస్తున్నారు.

నిజామాబాద్‌ 3000

కామారెడ్డి 650

బోధన్‌ 450

ఆర్మూర్‌ 320

ఎల్లారెడ్డి  70

బాన్సువాడ  75

భీమ్‌గల్‌ 50

 

సునాయాసంగా అనుమతుల జారీ

పురాల్లో సునాయసంగా భవన నిర్మాణ అనుమతులు పొందేలా విధి విధానాలు ఖరారవుతున్నాయి. 75 గజాల లోపు నిర్మాణం చేసే వారు స్వీయ మదింపును పక్కాగా చేపట్టాలి. వీరు పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాలనలో పారదర్శకత కోసం పురపాలక శాఖ నూతన సంస్కరణలు చేపట్టబోతోంది.

- శైలజ, టీపీవో, కామారెడ్డి

కామారెడ్డి పట్టణ ఉపరితల చిత్రం


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.