close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త పాలన.. ఆసుపత్రి ప్రక్షాళన

కొవిడ్‌ వార్డులో పర్యవేక్షణకు సీసీ కెమెరాలు

రోగులకు ఆత్మస్థైర్యం నింపేలా కౌన్సిలింగ్‌

● 24 గంటల్లో పరీక్షల ఫలితాలు

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం: ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ ప్రతిమారాజ్‌ వైద్యశాలలో ప్రక్షాళనపై దృష్టి సారించారు. అన్ని విభాగాల సిబ్బంది వైద్యులు, హెచ్‌వోడీలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకోవడంతోపాటు సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ వార్డులో ఉన్న లోపాలను గుర్తించి వాటిని పరిష్కరించే పనులు ప్రారంభించారు.

24 గంటల నిఘా

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేసి మూడు నెలలవుతున్నా ఉన్నతాధికారులు ఇటువైపు కన్నెత్తిచూడలేదు. ఇక్కడ సంభవించిన మరణాలకు కారణాలు, రోగుల ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు సూపరింటెండెంట్‌, వైద్యబృందం కొద్ది రోజుల క్రితం ఆకస్మిక తనిఖీలు చేశారు. వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. వీటిని నిత్యం పరిశీలించేలా టీవీలు ఏర్పాటు చేస్తున్నారు.

భయం పోగొట్టేలా ఏర్పాట్లు

కొవిడ్‌ బారినపడ్డ వెంటనే భయానికి గురై ఒత్తిడితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అధికారులు మానసిక వైద్యులతో కొవిడ్‌ వార్డులోని రోగులకు కౌన్సిలింగ్‌ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు.

కొవిడ్‌ రోగులతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌

ల్యాబ్‌ చక్కదిద్దారు

కొవిడ్‌ ల్యాబ్‌ ప్రారంభించి నెలన్నర గడిచినా నేటికీ అధికారులెవరూ దృష్టి సారించిన దాఖలాలు లేవు. సిబ్బంది చెప్పింది వినడానికే పరిమితమయ్యారు. డాక్టర్‌ ప్రతిమారాజ్‌ ల్యాబ్‌ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి అనుమానితుల నుంచి నమూనాలు సేకరించిన 24 గంటల్లో రిపోర్టు అందించాలని ఆదేశించారు.

సేవలపై రోగుల అభిప్రాయ సేకరణ

కొవిడ్‌ విభాగంలో ఆకస్మిక తనిఖీల్లో గుర్తించిన విషయాలపై చర్యలు ప్రారంభించారు. ప్రతి అంతస్తుకు ఒక నర్సింగ్‌ సిబ్బంది, పేషంట్‌కేర్‌ సిబ్బంది, డ్యూటీ డాక్టరును ఏర్పాటు చేశారు. అందుతున్న సేవల గురించి ఉదయం, సాయంత్రం రోగులకు వద్దకు వెళ్లి తెలసుకుని, వారి ఫొటోలు తీసి సూపరింటెండెంట్‌కు పంపేలా హెడ్‌నర్సుల పర్యవేక్షణ ఉంచారు.

పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది కొరత

గతంలో 500 పడకలకు సరిపడా భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ప్రస్తుతం కొవిడ్‌ ఉగ్రరూపం దాల్చడంతో ఆసుపత్రిలో ఇప్పటికే 200 పడకలు ఏర్పాటు చేశారు. ఇవి సరిపోకపోవడంతో కారిడార్‌లోనూ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఈ లెక్కన 300 పడకలు అదనంగా వచ్చినా అంతే సిబ్బందితోనే కాలం వెల్లదీస్తున్నారు. వారు సాధారణ, కొత్త ఆసుపత్రుల్లోని ఏడు చొప్పున అంతస్తులను శుభ్రం చేయడం కష్టమవుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకపోతే ఇబ్బందులు తప్పవు.

డబ్బులు వృథా చేసుకోకండి

- డాక్టర్‌ ప్రతిమారాజ్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ప్రభుత్వ ఆసుపత్రిపై చేస్తున్న ఆరోపణలు నమ్మి ప్రైవేటుకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసి అప్పులపాలై ఇబ్బందులు పడొద్ధు జిల్లా ఆసుపత్రి కొవిడ్‌ బాధితులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మరో నాలుగు రోజుల్లో మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు మృతిచెందిన వారిలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఉన్నారు. అలాంటి వారిని సైతం రక్షించేందుకు 70 వెంటిలేటర్లు తెప్పించాం. ప్రతి పడకకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేస్తున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.