close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బోధన్‌ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి
బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రి

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: బోధన్‌ ఆస్పత్రిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వైరస్‌ బారినపడుతుండటంపై ‘ఈనాడు’లో ‘పరీక్ష చేసే వారికే పరీక్ష’ శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించారు. అధికారుల సమీక్షలో ఈ మేరకు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. విభాగాల వారీగా ఎంత మంది పని చేస్తున్నారు? మూతపడిన, పడే అవకాశమున్న విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవడానికి చర్యలు చేపడుతున్నారు. జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో నియామకాలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు మౌఖికంగా సూచించారు.

నాలుగు వెంటిలేటర్లు

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ప్రయత్నం ఫలించింది. కొవిడ్‌ బాధితుల కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో పది వెంటిలేటర్లు కావాలని మంత్రి ఈటల రాజేందర్‌ నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో ఉన్న నాలుగు వెంటిలేటర్లను బోధన్‌కు కేటాయించారు. ఇప్పుడు వాటి వినియోగంపై దృష్టి సారించాలి. ఇక్కడ ఐసీయూ లేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసి కనీసం ఆరుగురు నర్సులు, నలుగురు నాల్గో తరగతి ఉద్యోగులను నియమించాల్సి ఉంటుంది. ముగ్గురు ఫిజీషియన్లు అవసరం కాగా ఇద్దరే ఉన్నారు. ముగ్గురు మత్తు మందు వైద్యులు అందుబాటులో ఉండటంతో కొత్తగా ఎవరినీ నియమించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐసీయూ కోసం మాత్రం గది కేటాయింపు, ఏసీ సహా పలు వనరులు సమకూర్చాల్సి ఉంటుంది.

ఇద్దరు వైద్యుల కేటాయింపు

బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయడానికి ఇద్దరు ఒప్పంద వైద్యులను కేటాయించారు. ఇటీవల జిల్లాలో 20 మంది వైద్యుల నియామకానికి మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఎంపికైన వారిలో ఇద్దరిని ఇక్కడి అవసరాల దృష్ట్యా కేటాయించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

132 పడకలకు ఆక్సిజన్‌

బోధన్‌ ఆస్పత్రిలో ప్రతి పడకకు ఆక్సిజన్‌ అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం 22 పడకలు కొవిడ్‌ రోగులకు కేటాయించారు. అందులో 12 మాత్రమే ఆక్సిజన్‌ సదుపాయం కలిగి ఉన్నాయి. అన్నింటికి అందించాలని అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగితే వంద పడకలు కేటాయించే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న పడకలన్నింటికి ఆక్సిజన్‌ అందేలా పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇంజినీర్లు పరిశీలన జరిపి మొత్తం 146లో 132 పడకలకు ఆక్సిజన్‌ సరఫరా చేయొచ్చనే నివేదికను కలెక్టర్‌కు అందించారు. అన్నింటికి ప్రాణవాయువు సరఫరా చేయాలంటే సిలిండర్లకు బదులు ఆక్సిజనల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆస్పత్రి అవసరాలపై అధికారులు దృష్టి సారించినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అన్నపూర్ణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.