close

బుధవారం, ఆగస్టు 05, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామాయపట్నం ఓడరేవుకు ఆగస్టులో టెండర్లు

రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి

గుడ్లూరు, న్యూస్‌టుడే: రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, దీని నిర్మాణానికి ఆగస్టులో టెండర్లు పిలుస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో కలిసి గుడ్లూరు మండలంలోని సాలిపేట, రావూరు, చేవూరులోని ఓడరేవు ప్రతిపాదిత భూములను పరిశీలించారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వారికి స్థల లభ్యతను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు మేజర్‌ ఓడరేవులను, ఏడు షిప్పింగ్‌ హార్బర్‌లను నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి జపాన్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. ఓడరేవును నిర్మించి ఈ ప్రాంతాన్ని దిల్లీ, ముంబయి పారిశ్రామిక నడవాకు ధీటుగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నెదర్లాండ్స్‌, యూరోపియన్‌ దేశాలు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు.

5000 ఎకరాలు సేకరిస్తాం

సుమారు 5000 ఎకరాలు సేకరిస్తామని, అందులో 3,200 ఎకరాలు ఓడరేవుకు, మిగిలింది ఏపీఐఐసీకి కేటాయిస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఏపీఐఐసీకి కేటాయించిన స్థలంలో పరిశ్రమలు స్థాపిస్తామన్నారు. ఓడరేవుకు, పరిశ్రమలకు అవసరమైన నీటిని రాళ్లపాడు జలాశయం నుంచో, వెలిగొండ జలాశయం నుంచో తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందుకు సుమారు రూ. 100 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. అవసరమైన భూ సేకరణకు త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. ఉప్పునీటిని మంచినీటిగా మార్చే డీశాలినేషన్‌ ప్రక్రియ ద్వారా నీటి లభ్యతను పరిశీలిస్తున్నామని వివరించారు. ఓడరేవులో ఇండియన్‌ నావల్‌బేస్‌ మూడు బెర్త్‌లు కావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని తెలిపారు. ఉలవపాడు మండలంలోని కరేడు వద్ద మన్నేరు ముఖద్వారంలో సముద్రం లోతు ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఓడరేవు నిర్మించడానికి అనువుగా ఉంటుందని.. పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఓడరేవు, పరిశ్రమలకు వెలిగొండ నుంచి నీటిని అందించే పనులు వెంటనే పూర్తి చేస్తే రాళ్లపాడు జలాశయం పరిధితో పాటు కనిగిరి, కందుకూరు, కొండపి నియోజకవర్గాలు సస్యశ్యామలమవుతాయన్నారు. కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో ఓబులేసు, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజరు నరసింహారావు, తహసీల్దారు కిశోర్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.