close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

గంపగుత్త ఓట్లపై  అభ్యర్థుల గురి

జోరుగా సంప్రదింపులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌

పురపాలక ఎన్నికల్లో ఓ వైపు హోరాహోరీ ప్రచారంతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు మరోవైపు స్మార్ట్‌ ప్రచారానికీ అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు గంపగుత్త ఓట్లను ఖాతాలో వేసుకునే దిశగా జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఒక్కచోట పది ఓట్లకు మించి ఉంటే చాలు.. అదే మహాభాగ్యమని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వార్డుల సంఖ్య పెరగడంతో పోటీ తీవ్రమైన నేపథ్యంలో జిల్లాలో ప్రచార తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.

సంఘాల మద్దతుకు పాకులాట..

ఎన్నికల్లో మహిళా సంఘాలు, సామాజికవర్గ సంఘాలకు ఉన్న ప్రత్యేకత వేరు. సంఘాలంటేనే నేతలకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి సంఘాల పరిధిలో పెద్ద మొత్తంలో ఓట్లు ఉండటంతో పాటు కీలకమైన వ్యక్తులతో రహస్య సమావేశాలు నిర్వహించి, తాయిలాలతో వారి ఓట్లు ఖాతాలో వేసుకునే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బహిరంగ ప్రచారం అవసరం లేకుండానే గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టుకునే అవకాశం ఉండటంతో సంఘాలను ప్రసన్నం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు.

కిట్టీ పార్టీలు ప్రధానమే..

కుటుంబ బాధ్యతలతో అలిసిపోయిన మహిళలంతా ఒకచోట హాయిగా కాలక్షేపంతో సేద తీరేందుకు ఏర్పాటుచేసుకున్న కిట్టీ పార్టీలు సైతం ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వికారాబాద్‌, తాండూరు పట్టణాల్లో 40 నుంచి 60 కిట్టి పార్టీలు ఉండగా, ఒక్కో దానిలో 30 నుంచి 60 మంది సభ్యులున్నారు. పరిగి, కొడంగల్‌లో కిట్టీ పార్టీల సంస్కృతి ఇప్పుడిప్పుడే అలవడుతోంది. మహిళా రిజర్వేషన్లు 50 శాతం ఉండటంతో జిల్లాలోని నాలుగు పురపాలికల్లోని 97 వార్డుల్లో 48 వార్డులు మహిళలకే కేటాయించారు. వీటితో పాటు మహిళా రిజర్వేషన్‌ లేని మరికొన్ని వార్డుల్లో సైతం పలుచోట్ల మహిళలు బరిలో నిలిచారు. దీంతో కిట్టీ పార్టీలు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో మేమంటే మేమంటూ అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరహాలో ఆయా వార్డుల్లో ఉన్న మహిళా సంఘాలను తమవైపు తిప్పుకొని ఎన్నికల్లో విజయం సాధించడానికి జోరుగా సంప్రదింపులు జరుపుతున్నారు.

పరపతితోనూ ఓట్లు కొల్లగొడుతాం..

పురపాలిక ఎన్నికల బరిలో నిలిచిన కొత్త అభ్యర్థులైనా ఆయా వార్డుల్లో తమకు తెలిసినవారు, పరపతి ఉన్నవారు ఉంటే చాలు.. వారి మద్దతుతో సులభంగా ఓట్లు కొల్లగొట్టే వ్యూహాలు రూపొందిస్తున్నారు. ప్రతి వార్డులో ఏదోక విధంగా ఎంతో కొంత పరపతి, పలుకుబడి ఉన్నవారు నలుగురైదుగురు ఉండటం సహజం. వీరు చెబితే పది ఇళ్లున్నా 40 నుంచి 50 ఓట్లు పడతాయన్న ఆశతో పలువురు అభ్యర్థులు పరపతి ఉన్న వ్యక్తుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాలనీల్లో ఒకింత మంచిపేరున్న వారి మద్దతు కూడగట్టుకొని విజయం సాధించే దిశగా ముందుకెళ్తున్నారు.


వినాయక మంటపాల నిర్వాహకుల మద్దతు

వినాయక చవితి సందర్భంగా గతంలో పట్టణంలో క్రమం తప్పకుండా విరాళాలు, చందాలు ఇచ్చి ప్రోత్సహించిన నేతలు ప్రస్తుతం మంటప నిర్వాహకులను కలిసి ఓట్ల కోసం మద్దతు కూడగట్టుకుంటున్నారు. పట్టణంలో ఏటా 150 వరకు వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులు నిర్వహించిన తరుణంలో తమ వంతుగా చందాలు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రతి మంటపం పరిధిలో లెక్కకు మిక్కిలి కుటుంబాలు సంబరంగా నవరాత్రులు నిర్వహించగా, ప్రస్తుతం చందాలు ఇచ్చిన నాయకులు, అభ్యర్థులు పాత పరిచయాలను గుర్తు చేసుకొని పుర ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు.


ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు

ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేకపోవడం, పెళ్లిళ్ల సీజన్‌ కాకపోవడంతో ఉసూరుమంటున్న నేతలు, అభ్యర్థులు వార్డుల్లోని ఎవరింట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా పరుగెత్తుతున్నారు. పుట్టినరోజు తదితర వేడుకలకు హాజరై ఆకర్షణీయమైన, ఖరీదైన కానుకలు సమర్పించుకుంటూ ఓట్లకు గాలం వేస్తున్నారు. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ జారవిడుచుకోకుండా అభ్యర్థులు ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులు గతంలో వివిధ కారణాలతో వార్డుల్లో పలువురితో తగాదా పెంచుకొని ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. అలాంటి వారి ఓట్లు తమకు ఎలాగూ పడవన్న భావనతో నేరుగా వారింటికి వెళ్లి.. అన్నీ మరిచిపోదాం.. ఇకనుంచి కలిసిమెలిసి ఉందామని బతిమాలుకొని రాజీ కుదుర్చుకొని మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న తంటాల తీరును చూసి.. మా ఓటు ఎవరికనేది బ్యాలెట్‌ డబ్బాలు తెరిచాకే తెలుస్తుందంటూ మదిలోని భావాన్ని తెలపకుండా ఓటర్లు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.