close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

అందని ఇంధనం.. ఆగిన అత్యవసరం

వారంరోజులుగా మూలకు చేరిన 108

పేదలపై ఆర్థిక భారం

పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ


చెత్త కుప్ప వద్ద ఇలా..

అత్యవసర సమయాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్సులు మూలకు చేరాయి. ఇంధనం నిండుకోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిత్యం కుయ్‌..కుయ్‌..అంటూ తిరిగే వాహనాలు మూగబోయాయి. పగలూ.. రాత్రి తేడా లేకుండా ఇరవైనాలుగు గంటలు సేవలందించే వాహనాలు లేకపోవడంతో పేద, మధ్యతరగతి వారికి అవస్థలు తప్పడం లేదు.

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో 9.79 లక్షల జనాభా నివసిస్తోంది. వీరిలో 70 శాతం ప్రజలు పేద, మధ్యతరగతికి చెందిన వారున్నారు. ఇలాంటి వారికి అత్యవసర సమయంలో, రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు సత్వరమే ప్రాథమిక చికిత్సలు అందించడంతోపాటు, అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తరలించే లక్ష్యంతో ప్రభుత్వం ‘108’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. పగలు, .రాత్రి తేడాలేకుండా ఒక్కఫోన్‌ కాల్‌తో ప్రమాద స్థలికి చేరుకునే వాహనం ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్పత్రులకు చేరే అవకాశం కల్పించింది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు గర్భిణులు, రహదారి ప్రమాద బాధితులు, ఆత్మహత్యాయత్నం చేసిన వారు, పాము కాటుకు, అనారోగ్యం, అస్వస్థతకు గురైనా.. ఇలా ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే 108 ద్వారా అంబులెన్సులో ఆస్పత్రికి తరలించే వెసులుబాటు లభించింది.

వారం రోజులుగా ఆగిపోయి..

జిల్లాలో తాండూరు, యాలాల, బంట్వారం, కొడంగల్‌, పరిగి, వికారాబాద్‌, కుల్కచర్ల, మోమిన్‌పేట, పెద్దేముల్‌ మండలాలకు తొమ్మిది అంబులెన్సులను కేటాయించారు. ఆయా మండలాల్లోని అంబులెన్సులు రెండుచొప్పున మండలాల్లో సేవలు అందించేందుకు ఖరారు చేశారు. ఫోన్‌ కాల్‌ చేసిన వెంటనే ఇరవై నిమిషాలలోపు బాధితుల చెంతకు చేరుకునే వాహనాలు ఆస్పత్రికి తరలిస్తూనే అంబులెన్సులో ప్రాథమిక వైద్యం అందించి ఉపశమనం కల్పిస్తున్నాయి. గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడుతుంటే అంబులెన్సులోని సిబ్బంది కాన్పులను సైతం చేస్తుండటంతో మహిళలకు ఊరట కలిగిస్తోంది. ఇంతటి ప్రాధాన్యమైన సేవలందిస్తున్న వాహనాలకు ఇంధనం లేకపోవడంతో వారం రోజులుగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి పెట్రో బంకు యజమానులకు బకాయిలు ఉంచారు. దీంతో నిర్వాహకులు ససేమిరా అనడంతో కదలడంలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పేదలకు 108 సేవలు అందకుండాపోయాయి. ఆశతో ఫోన్‌ చేస్తున్న ప్రజలకు నిరాశ మిగులుతుండగా గత్యంతరం లేక డబ్బులు వెచ్చించి ఆస్పత్రులకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాండూరు నియోజకవర్గంలోని రెండు అంబులెన్సులను జిల్లా ఆస్పత్రి పీపీ యూనిట్‌కు పరిమితం చేశారు. మరో అదనపు వాహనం మూలకు చేరడంతో దుమ్ముతో అపరిశుభ్రంగా మారింది.

జీతాలు అందక

జిల్లాలోని 36మంది ఉద్యోగులు ప్రతిరోజు అంబులెన్సుల వద్దకు చేరుకుంటున్నారు. ఇంధనం లేకపోవడంతో ఉద్యోగ సమయం వరకు ఖాళీగా కూర్చొని వెళ్తున్నారు. గంటల తరబడి పడిగాపులు కాయాల్సి రావడంపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరికి రెండు నెలలుగా వేతనాలు సైతం చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది పొరుగు జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది తిండికి, వసతికి డబ్బుల్లేక ఆస్పత్రుల వద్ద చెట్ల నీడన, ఆరుబయట కాలం వెళ్లదీస్తున్నారు. అప్పులతో సర్దుబాటు చేసుకొని పూట గడుపుతున్నారు. వెంటనే వేతనాలు చెల్లించి ఇంధనం సమకూర్చాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై వివరణ కోరేందుకు జిల్లా పొగ్రాం అధికారి జాన్‌షాహిద్‌, ఈఎంఈ దిలీప్‌కు ఫోన్‌ చేస్తే స్పందించలేదు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.