close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

తాయిలాల గాలం!

లక్ష్యం 50 శాతం ఓట్లు

వార్డుల వారీగా అభ్యర్థుల ప్రచారం

ప్రలోభాల పరంపర

న్యూస్‌టుడే, తాండూరు

పురఎన్నికల్లో ఓటర్లకు అభ్యర్థులు తాయిల గాలం వేస్తున్నారు. నచ్చినవి ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నారు. మేం ఇచ్చేవి తీసుకోండి.. మీ ఓటు మాకే.. మరవద్దంటూ మాట తీసుకుంటున్నారు. పుర పోలింగ్‌ గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఒక్కో వార్డులో మొత్తంగా ఉన్న ఓట్లలో 50 శాతం సాధించాలని వ్యూహంతో తమ అనుచర గణాన్ని రంగంలోకి దింపారు. ఒకవైపు అభ్యర్థుల ప్రచారం.మరో వైపు వారికి నమ్మకంగా ఉన్న వ్యక్తులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళుతున్నారు. ఒక్కో ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఎంత సంఖ్య ఉంటే ఆ విధంగా అభ్యర్థులకు తాయిళాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికే పంపకాన్ని ప్రారంభించారు. అంతా సవ్యంగా జరిగిపోవడంతో వార్డులో నిర్ణీత మొత్తం ఓట్లలో సగం తమకే వస్తాయని అంచనాకు రాగానే ఇక గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.

జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లోని 95 వార్డులకు 351 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తెరాస, కాంగ్రెస్‌, భాజపా, తెదేపా, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం నుంచి బరిలో ఉన్నారు. రెండు స్థానాల్లో ఇతరులు పోటీ చేస్తున్నారు. పోటీలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో ఎనిమిది మంది మినహా మిగిలిన 343 మంది ఓట్లను రాబట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక వార్డులో 1500 మంది ఓటర్లున్నారనుకుంటే అందులో 750 వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇలా అన్ని వార్డుల్లో ఉన్న నిర్ణీత ఓట్లలో సగం తమకు వచ్చేట్టుగా పావులు కదుపుతున్నారు. ప్రతి వార్డులో ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.. ఇందులో 50 శాతం ఓట్లు సాధిస్తే తామే విజయం సాధిస్తాం. మిగిలినవి పోటీలో ఉన్న అభ్యర్థులు పంచుకుంటారు. కాబట్టి అత్యధికంగా ఓట్లు వచ్చే తామే విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. అందరూ ఇదే భావనతో ఉండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓటర్లున్న ఇళ్లకు అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు విడతల వారీగా వెళ్లి వస్తున్నారు. వీలు కుదరకుంటే అనుచరులను ఓటర్ల వద్దకు పంపించి తాయిళాల గురించి వివరిస్తున్నారు. వీలుంటే మాటిచ్చిన కొంతమేరకు పంపిణీ చేసి, మిగిలినవి పోలింగ్‌ సమయంలో ఇస్తామని చెప్పి వస్తున్నారు.

వ్యతిరేక ఓట్ల కొనుగోలుకు యత్నాలు

పోటీలో ఉన్న అభ్యర్థులు వ్యతిరేక ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వార్డుల్లో పార్టీల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సొంత పార్టీ నుంచే కొంత మంది వ్యతిరేకతతో ఉన్నారు.

స్థాయి ప్రకారం పంపకం

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల స్థాయిని బట్టి కానుకలు పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే ఓటర్లతో జరిపిన చర్చల మేరకు ఫలాన రోజు ఫలాన వ్యక్తి మీరు కోరినవి అందించేందుకు వస్తారని హామీ ఇచ్చి వస్తున్నారు. ఆకట్టుకునేందుకు విలువైన కానుకలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా మద్యం, డబ్బును అందజేసే యోచనలో ఉన్నారు. ఈమేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఎంపిక చేసిన ఓటర్లనే కలుస్తున్న అభ్యర్థులు

జిల్లాలో 26 మంది అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని పెద్దగా నిర్వహించడం లేదు. గుట్టుగా ఓటర్ల ఇళ్లకే నేరుగా వెళుతున్నారు. వారితోనే మంతనాలు జరుపుతున్నారు. ఓటుకు ఇంత చెల్లిస్తామని మాట్లాడుతున్నారు. మిగిలిన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరైనా వచ్చి తాయిళాలు ఇస్తానంటే తీసుకోండి. ఓటు మాత్రం తమకే వేయండని చర్చలు జరుపుతున్నారు. మీకు అండగా ఉండేది మేమే కాబట్టి ఓటును ఆలోచించి వేయాలని చెప్పి వస్తున్నారు. 2014లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో సదరు రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇదే విధానాన్ని అనుసరించారు. తాండూరులో సఫలమయ్యారు. తాజాగా జరిగే ఎన్నికల్లో గడచిన ఎన్నికల్లో అవలంబించిన విధానంలోనే వెళుతున్నారు. అయితే హడావుడి లేని వీరి ప్రచారాన్ని పసిగట్టిన ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థులు కొత్త వ్యూహాలతో ప్రయత్నాలు చేస్తున్నారు.


మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు నానాతంటాలు పడుతున్నారు.

ఇందు కోసం మధ్యవర్తులను రంగంలోకి దింపి బేరసారాలు నడిపిస్తున్నారు. ఒక్కో ఓటుకు ఇంతా అంటూ ధరను నిర్ణయిస్తున్నారు. ఓటర్లు అంగీకరిస్తే వారి ఇళ్లకు వెళుతున్నారు. గతంలో మీ విషయంలో వ్యవహరించిన తీరుకు క్షమించండి. ఇక మీదట పొరపాటు జరగదని విన్నవిస్తున్నారు. ఓటర్లు సదరు అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారనిపిస్తే వారు అడిగిన తాయిళాలను ముట్టజెప్పి సంతోషంగా వెనక్కి వస్తున్నారు.

పురపాలకం  వార్డులు  పోటీ చేస్తున్న అభ్యర్థులు

తాండూరు 36 148

వికారాబాద్‌ 32 103

కొడంగల్‌ 12 46

పరిగి 15 54

మొత్తం 95 351

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.