close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

విజయ అనంతరం.. విమానయానం!

బెంగళూరు, గోవాకు తరలనున్న కౌన్సిలర్లు

శిబిరాల్లోనే నజరానాల చెల్లింపునకు నిర్ణయం

రాజకీయ నాయకుల ఎత్తుగడ

ఈనాడు డిజిటల్‌ వికారాబాద్‌, న్యూస్‌టుడే, తాండూరు

పురపాలక ఎన్నికల ఫలితాల అనంతరం స్పష్టమైన మెజార్టీ వచ్చిన పార్టీలు అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. అధిక స్థానాలు రాకుండా హంగ్‌ ఏర్పడితే రెండు స్థానాలను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. దీనిని అధిగమించేందుకు ఒక పార్టీలోని కౌన్సిలర్లను మరో పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి తమ వైపునకు తిప్పుకొని బలం పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది జరగకుండా ఉండడానికి ముఖ్యనాయకులు క్యాంపు రాజకీయలకు సిద్ధం అయ్యారు. ఫలితాలు వెల్లడైన అనంతరం విజయం సాధించిన వారిని గాలిమోటార్లు, ప్రత్యేక బస్సుల్లో బెంగళూరు, గోవా వంటి దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు.

జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ పురపాలక సంఘాల్లోని 95 వార్డులకు 351 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో తెరాస 95, కాంగ్రెస్‌ 90, భాజపా 56, ఎంఐఎం 26, తెదేపా 9, సీపీఎం 6, సీపీఐ ఇద్దరు అభ్యర్థులతో పాటు స్వతంత్రులు 67 మంది ఎన్నికల బరిలో తలబడ్డారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో విజయంపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే పార్టీల వారీగా విజయం సాధించే అభ్యర్థులు ఎవరనే విషయంలో ఒక స్పష్టత ఉంది. ఇదే సమయంలో పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరనే విషయాన్ని అంచనా వేశారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు ఏ పార్టీకీ ఆ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఛైర్మన్‌ స్థానాన్ని ఆశిస్తున్న వారు వీరందరి ఖర్చులను భరించాలని నిర్ణయించారు. బెంగళూరు, గోవా, హైదరాబాద్‌ నగరాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. గోవా, బెంగళూరుకు వెళ్లే వారికి విమానయాన టిక్కెట్లను ఇప్పటికే బుక్‌ చేశారు. హైదరాబాద్‌ వెళ్లే వారికి ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. శిబిరాలకు వెళ్లే ఒక్కో కౌన్సిలర్‌కు ఛైర్మన్‌గా కాబోయే అభ్యర్థి భారీ నజరానాలు అందించాలని నిర్ణయించారు.

ఒకరిని మించి మరొకరు

పురపాలక సంఘాల ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లను ఈనెల 27న(సోమవారం) ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం తేదీని ఇప్పటికే నిర్ణయించింది. శనివారం ఓట్ల లెక్కింపు పూర్తయి అన్ని స్థానాల ఫలితాలు వెల్లడయ్యే సరికి తాండూరు, వికారాబాద్‌లో దాదాపు సాయంత్రం కావస్తుంది. పరిగి, కొడంగల్‌లో మాత్రం మధ్యాహ్నం వరకే ఫలితాలు బయటికి రానున్నాయి. పార్టీలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానానికి కావల్సిన మెజార్టీ స్థానాలు వస్తే సరే. లేదంటే ముఖ్యనాయకులు ఒకరికి మించి మరొకరు రాజకీయ చతురత ప్రదర్శించాల్సిందే. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికలు జరగడానికి ముందు వరకు కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకొనేందుకు రాజకీయ పావులు వేగంగా కదిపేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యారు. ఫలితాలు వెల్లడయ్యాక ఒక పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులు మరో పార్టీకి మద్దతు తెలుపకుండా ఉండేందుకు విప్‌జారీ చేయాలని నేతలు సమాలోచనలు చేస్తున్నారు. విప్‌ను ఉల్లంఘిస్తే సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉండడంతో కౌన్సిలర్లు ఎలా వ్యవహరిస్తారనే విషయంలోనూ చర్చనీయాంశంగా మారింది.

ఎంఐఎం, తెరాస ఏకమయ్యేనా?

ఫలితాలు వెల్లడయ్యాక తెరాస, ఎంఐఎం ఏకమౌతాయా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో తెరాస ముఖ్యనాయకులు తాండూరులో ఎంఐఎంను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకటి రెండు సీట్లు రాని పార్టీతో తాము పొత్తు పెట్టుకోం అన్నారు. అదే స్థాయిలో ఎంఐఎం నాయకులు సమాధానం ఇచ్చారు. ఎన్నికల ఫలితాల్లో తెరాసకు స్పష్టమైన మెజార్టీ స్థానాలు వస్తే ప్రచారంలో పేర్కొన్నట్లే ఎంఐఎంతో జతకట్టే పరిస్థితి ఉండదని పిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓటుండి మేజిక్‌ ఫిగర్‌ రాకుండా ఎంఐఎం కీలకంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

మీపార్టీలోకి వస్తే అధ్యక్షురాలి పదవి ఇస్తారా

జిల్లాలోని తాండూరు పురపాలక సంఘంలో ఓ కౌన్సిలర్‌ తరఫు నాయకుడు అపుడే ప్రత్యర్థి పార్టీ నాయకులతో మంతనాలు ప్రారంభించారు. మా కుటుంబంలోని మహిళ ఎన్నికల్లో పోటీ చేశారు. విజయం సాధిస్తారు. మాకు అనుకూలురుగా ఉన్న ముగ్గురు కౌన్సిలర్లు విజయం సాధించబోతున్నారు. మా తరఫున నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. మీ పార్టీలో పది మంది వరకు విజయం సాధిస్తారు. మరో పార్టీలో ఆరుగురు విజయం సాధించ బోతున్నారు. వీరితోనూ మేం సంప్రదింపులు జరుపుతున్నాం. అందరి మెజార్టీ కలిపితే ఇరవై మంది వరకు ఉంటుంది కాబట్టి అధ్యక్ష స్థానం మాకే సొంతం అవుతుందని ఆ నాయకుడు ఒక పార్టీతో రహస్య మంతనాలు జరిపారు. ఇందుకు సదరు నాయకులు కూడా అంగీకరించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి పరిస్థితి ఇలా ఉంటే ఫలితాలు వెల్లడయ్యాక రాజకీయాలు ఎలా మారుతాయో చెప్పలేం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.