close

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

ప్రధానాంశాలు

అన్నదాతకు మరింత సహకారం

60ఏళ్లకు సమకూరిన సొంత భవనం

లాభాల బాటలో ఎల్మకన్నె సంఘం

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

తుది దశకు చేరిన నూతన భవన నిర్మాణం

రైతుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించి అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నెలకొల్పారు. మండలానికి ఒకటి చొప్పున కొనసాగుతున్న సంఘాలను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆచరణలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో సహకార సంఘాలు పెరగనుండటంతో గ్రామాల్లోని రైతులకు సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం...

మండలానికి రెండు చొప్పున..

తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లో 37,050మంది రైతులు ఉన్నారు. వీరిలో 50శాతం మందికిపైగా రైతులు వ్యవసాయ సహకార సంఘాల్లో నమోదయ్యారు. 2005 సంవత్సరానికి ముందు మండలానికి ఐదు చొప్పున సంఘాలు ఉండగా ఆ తర్వాత మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటయ్యాయి. తాజాగా మండలానికి రెండు సంఘాలు ఉండాలన్న ప్రభుత్వ ఉత్తర్వులతో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌లో మరో మూడు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. తాండూరు మండలం ఎల్మకన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 38 గ్రామాలకు చెందిన 3269మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఛైర్మన్‌, పన్నెండు మంది డైరెక్టర్‌లతో పాలకవర్గం కొనసాగుతోంది. కొత్తగా మరో సంఘాన్ని ఏర్పాటు చేయనుండటంతో మరో పదమూడు మందితో పాలకవర్గం ఏర్పాటు కానుంది. మరింత మంది రైతులు సభ్యులు చేరే ఆస్కారముంటుంది. కొత్తగా చేరిన వారికి ఏడాది తర్వాత ఓటు హక్కు కల్పించనున్నారు.

రూ.కోటి లాభంతో..

అరవై సంవత్సరాల క్రితం ఏర్పాటైన సహకార సంఘం ద్వారా రైతులకు ఎరువుల విక్రయాలు చేస్తున్నారు. ప్రధానంగా బంగారం తాకట్టుకు రుణాల్ని కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో అందిస్తుండటంతో నియోజకవర్గంలోని వేలాదిమంది సద్వినియోగం చేసుకుంటున్నారు. రూ.4కోట్లకు పైగా బంగారం తాకట్టు రుణాల్ని సంఘం తరఫున అందించడంతో కొన్ని సంవత్సరాలుగా సంఘం రూ.అరకోటి నుంచి రూ.కోటి లాభాల్లో కొనసాగుతోంది. సంఘం ద్వారా వచ్చిన ఆదాయంతో రూ.50లక్షల వ్యయంతో సొంత భవనాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది నవంబరులో భవన నిర్మాణ పనులు మొదలుపెట్టగా ప్రస్తుతం తుది దశకు చేరాయి. సంఘం ఏర్పాటైన ఆరు దశాబ్దాలకు సొంత భవనం సమకూరడంతో ఛైర్మన్‌ నారాయణ్‌గౌడ్‌, సీఈఓ చంద్రారెడ్డి, పాలకవర్గం డైరెక్టర్‌లు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరిలో ఆస్తుల పంపకాలు..

మండలంలో కొత్తగా మరో సంఘం ఏర్పాటు కానుండగా గ్రామాల కొనసాగింపుపై అభ్యంతరాల స్వీకరణకు ఫిబ్రవరి 9వ తేదీ వరకు గడువు విధించారు. ఇది పూర్తైన వెంటనే ప్రస్తుతం ఉన్న ఎల్మకన్నె సహకార సంఘం పరిధిలోని ఆస్తులను కొత్త సంఘానికి సమానంగా కేటాయించనున్నారు. ఎల్మకన్నె, జిన్‌గుర్తి, కోటబాస్పల్లిలో సంఘానికి చెందిన భవనాలు ఉండగా బెల్కటూరులో 400 చదరపు గజాల స్థలం ఉంది. వీటిని రెండు సంఘాలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం నిర్మించిన భవనం విలువను అంచనా వేసి ఓ సంఘానికి భవనాన్ని కేటాయించి మరో సంఘానికి యాభైశాతం వాటా సొమ్ము అందించేందుకు సహకార సంఘం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటితోపాటు సంఘం పరిధిలోని రైతులకు చెల్లించిన రూ.1.80కోట్ల అప్పుల్ని సైతం రెండు సంఘాలకు విభజించనున్నారు. ఎల్మకన్నె సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు సంఘాధ్యక్షులు నారాయణ్‌గౌడ్‌, సీఈఓ చంద్రారెడ్డి గురువారం వెల్లడించారు.

రైతులకు మేలు..

- నర్సింహులుగౌడ్‌, మాజీ ఉపాధ్యక్షులు

కొత్తగా మరో సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తుండటంతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. రెండు సంఘాల మధ్య పోటీతత్వంతో సేవలు విస్తరించేందుకు పాలకవర్గాలు కృషి చేస్తాయి. మరికొంత మంది రైతులకు పాలకవర్గంలో చోటు దక్కుతుంది. రైతులు తమ అవసరాలు తీర్చుకునేందుకు మార్గం సుగమమవుతుంది.

అనుకూలంగా విస్తరించాలి..

- భీంరెడ్డి, డైరెక్టర్‌

గ్రామాల నుంచి రైతుల రాకపోకల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంఘాల్లో చేర్చాలి. తాండూరులోని మల్‌రెడ్డిపల్లి, సాయిపూర్‌, పాతతాండూరును ఎల్మకన్నె సహకార సంఘంలోనే కొనసాగించాలి. కొత్త సంఘం పేరు తాండూరుకు బదులుగా సంఘాన్ని కొనసాగించే గ్రామం పేరిట ఏర్పాటు చేస్తే మేలు. కొత్తగా మరో సంఘం ఏర్పాటు నిర్ణయంతో వందలమంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.