close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

లెక్క తేలింది.. కార్యాచరణే మిగిలింది!

జిల్లా గ్రామీణుల్లో 13.75 శాతం నిరక్షరాస్యులు

త్వరలో అక్షరాలు దిద్దించేందుకు సిద్ధమవుతున్న వ్యూహాలు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌


రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 33 లక్షల మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించాం. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఏవిధంగా ముందుకెళ్లాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

- ఇటీవల పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నమాటలివి.


స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నాయి.. నిరక్షరాస్యులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఎన్నో పథకాలు అమలైనా నూరుశాతం అక్షరాస్యత సాధన మాటలకే పరిమితమైంది. అందునా గ్రామాల్లో అనుకున్నంత మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పల్లెల్లో ప్రతి ఒక్కరికీ అక్షరాలు నేర్పేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. 7.69 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 13.75 శాతం మంది ప్రజలు నేటికీ నిరక్షరాస్యులుగానే ఉన్నారు. రెండోవిడత పల్లె ప్రగతి సమయంలో ఆయా గ్రామాల్లో ఈ సమాచారం సేకరించారు.

ఈచ్‌ వన్‌..టీచ్‌ వన్‌..

మారుతున్న కాలంతోపాటు.. పోటీ ప్రపంచంలో ముందుకెళ్లాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా విద్య అతిముఖ్యమైనదిగా ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రతి ఒక్కరిని విద్యావంతులుగా తీర్దిదిద్దాలని భావిస్తోంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో సేకరించిన వివరాల ఆధారంగా తదుపరి ఎలాంటి వ్యూహం అనుసరించాలనే విషయం ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌’ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల పరిధిలోనూ అక్షరాస్యతపై సర్వే చేపట్టనున్నారు. అనంతరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

లోపాలకు తావు లేకుండా...

గత ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనకు వయోజన విద్యాకేంద్రాలు, సాక్షర భారత్‌ వంటి కార్యక్రమాలు చేపట్టినా ఆచరణలో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలు కనిపించాయి. దీంతో ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. ప్రస్తుతం ఆ లోపాలకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణతో, రాష్ట్రంలో వంద శాతం ప్రజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

జిల్లా గ్రామీణ జనాభా: 7,69,889

అక్షరాస్యులు 6,64,012

నిరక్షరాస్యులు 1,05,877

మహిళలు 37,282

పురుషులు 68,587

ఇతరులు 8

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.