close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

నిధులున్నా.. పనులేవీ!

ఏళ్లుగా పూర్తికాని శివసాగర్‌ జలాశయ నిర్మాణం

అందుబాటులోకి వస్తే వెయ్యి ఎకరాలకు సాగునీరు

పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలూ పెరిగే వీలు

న్యూస్‌టుడే, తాండూరు

మ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జలయజ్ఞం కింద చేపట్టిన ఏకైక సాగునీటి జలాశయం శివసాగర్‌... 2007లోనే పూర్తికావాల్సి ఉన్నా అధికారుల పర్యవేక్షణలోపంతో ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. తర్వాత వ్యయ అంచనాలు మార్ఛి. కొత్త గుత్తేదారుకు పనులు అప్పగించి.. ఏడాదిన్నర అవుతున్నా అదేతీరు కొనసాగుతోంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపితే వచ్చే వర్షాకాలానికి ముందుగా పూర్తి చేసే వీలుంది. అందులోకి చేరే వరద నీటిని ఆయకట్టుకు అందిస్తే, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సమీప గ్రామాల్లో భూగర్భజల మట్టాలూ పెరుగుతాయి.

నీటి వృథాకు అడ్డుకట్ట వేసి...

పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల మీదుగా కాకరవేణి నది తాండూరు నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. యాలాల మండలం విశ్వనాథ్‌పూర్‌, గోవిందరావుపేట, సంగెంకుర్దు గ్రామాల చెంత నుంచి.. కోకట్‌ గ్రామ సమీపంలోని కాగ్నానదికి అనుసంధానమౌతుంది. ఏటా ఎగువ నుంచి వస్తున్న వరద కాగ్నానదిలో కలిసి, కర్ణాటక వైపు పోతోంది. ఇలా వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసి.. నిల్వచేసి, ఆయకట్టు పొలాలకు అందిస్తే ప్రయోజనం ఉంటుందని 2005లో అప్పటి ప్రభుత్వం సమాలోచనలు చేసింది. ఇందులో భాగంగా జలాశయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. నది ఒడ్డున శివలింగం ఉండటంతో అధికారులు శివసాగర్‌ జలాశయంగా నామకరణం చేశారు. 300 ఎకరాల శిఖంలో ఉపరితలం నుంచి పది అడుగుల లోతులో నీరు ఉండేలా చేపట్టే ఈ జలాశయ నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం రూ.5.80 కోట్లను మంజూరుచేసింది. అదే ఏడాది ఏడాది ఆగస్టు 14న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. 2006 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా ఏళ్లు గడుస్తున్నా.. అసంపూర్తిగానే ఉంది.

నెల కిందట ప్రారంభమైనా..

నెల రోజుల కిందట జలాశయ నిర్మాణం పునఃప్రారంభమెంది. అలుగు కింది భాగంలో వరద సాఫీగా వెళ్లడానికి మట్టిని తొలగించారు. మిగిలిన పనులను మాత్రం ఇంకా చేపట్టలేదు. వేగంగా చేస్తేనే వర్షాకాలంలో ఎగువ నుంచి వచ్చే వరద జలాశయంలోకి చేరి.. పంట పొలాలకు అందించేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇప్పటి వరకు చేసిన పనులు..

జలాశయం నిర్మాణానికి 800 మీటర్ల పొడవున ప్రధాన కట్టను నిర్మించారు. 303 మీటర్ల పొడవున చేపట్టే అలుగు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. కుడి కాలువకు సంబంధించిన తూము నిర్మాణం పూర్తయింది.

ఇంకా చేయాల్సినవి..

* జలాశయంలోని నీరు పొలాలకు ప్రవహించడానికి కుడి, ఎడమ ప్రధాన కాలువలు, వాటికి అనుసంధానంగా పిల్ల కాలువల ఏర్పాటు.

* అలుగు నిర్మాణం పూర్తి చేసి... ప్రధాన కట్టకు వెలుపలి, లోపలి భాగాలను పటిష్టం.

* శిఖం భూమిలో పెరిగిన ముళ్లపొదలను తొలగించడం, ఎడమ కాల్వ తూము నిర్మాణం.

* ఎగుడు, దిగుడుగా మారిన ప్రధాన కట్టను సమతలం చేయడం.

పెరిగిన అంచనా వ్యయం

శివసాగర్‌ జలాశయం పనులు సకాలంలో పూర్తయి ఉంటే మంజూరు చేసిన నిధులు సరిపోయేవి. గుత్తేదారు నిర్లక్ష్యానికి తోడు అధికారులు పట్టించుకోక పోవడంతో.. ఈలోగా సిమెంటు, కంకర, స్టీలు తదితర ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడతామని గుత్తేదారు నీటిపారుదల శాఖకు లేఖ రాశారు. పనులను పునఃప్రారంభించి, పూర్తి చేసేందుకు మొత్తం రూ. 11.81 కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఈ నిధులను మంజూరు చేసింది. పాత గుత్తేదారుతో ఒప్పందాన్ని రద్దు చేసుకుని కొత్తగా టెండర్లను ఆహ్వానించింది. మరో గుత్తేదారు టెండరు దక్కించుకొని ఏడాదిన్నర దాటిపోయింది. పనుల్లో మాత్రం పురోగతి లేదు.

లబ్ధిపొందే గ్రామాలు

యాలాల, కోకట్‌, రాఘవాపూరు, గోవిందరావుపేట

వేసవి చివరి నాటికి పూర్తి చేస్తాం - నిఖేష్‌కుమార్‌, నీటిపారుదల శాఖ సహాయ ఇంజినీరు, తాండూరు.

వచ్చే వేసవి కాలం చివరి నాటికి జలాశయ నిర్మాణం పూర్తిచేస్తాం. నెల రోజుల కిందటే పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో జలాశయంలోకి వచ్చిన నీటిని రబీ సీజన్‌లో ఆయా గ్రామాల ఆయకట్టుకు అందిస్తాం. యాలాల రైతులకు నీరు అందించే కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి ఇంకా పరిహారం అందాల్సి ఉంది. వీరికీ ప్రభుత్వం త్వరలోనే చెల్లించనుంది. ఈ నీటి వనరు నిర్మాణం పూర్తయితే ఎప్పటి నుంచో సాగు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతుల ఆశలు తీరనున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.