close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

పట్టణ ప్రగతి.. మారాలి పురపాలికల గతి!

రేపటి నుంచి జిల్లాలో ప్రారంభం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో మార్పు కనిపించింది. పల్లెప్రగతి కార్యక్రమం ఎంతో బాగుందన్న ప్రశంసలూ దక్కాయి. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమాన్ని ఈనెల 24 నుంచి ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు మార్చి 4వ తేదీ వరకు కొనసాగించనున్నారు. ముందుగా పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. పురపాలికల్లో ఏ పనులు చేపట్టాలి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలను సిద్ధం చేసి అనంతరం అమలుచేస్తారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.

నాలుగు పురపాలికల్లో..

జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ పురపాలికల్లో సోమవారం నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నారు. 10 రోజుల పాటు ఏకధాటిగా వార్డుల్లో అధికారులు, వార్డు కమిటీ సభ్యులు పర్యటించి వార్డుల్లో చేపట్టాల్సిన పనులు గుర్తిస్తారు. వార్డుల్లో పర్యటించి కార్యాచరణ రూపొందిస్తారు. ప్రథమంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అనంతరం మురుగు కాల్వలు శుభ్రం చేయడం, వార్డుల్లో పేరుకుపోయిన పొదలు, భవన నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేయిస్తారు. చెత్త సేకరణకు వికారాబాద్‌, పరిగికి కేటాయించిన వాహనాలను వినియోగిస్తారు.

వార్డుకు నాలుగు కమిటీలు

వార్డుల్లో నాలుగు విభాగాలుగా కమిటీలను ఏర్పాటు చేశారు. మహిళలు, యువత, వయోపౌరులు, వివిధ రంగాల్లో నిష్ణాతులతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు వార్డు కౌన్సిలర్లకు సమాచారం అందజేశారు. వార్డుల్లో మెప్మా రిసోర్స్‌పర్సన్‌లు పర్యటించి కౌన్సిలర్‌ సహకారంతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ జాబితాను అధికారులకు అందజేశారు. ప్రతి కమిటీలో 8 నుంచి 15 మంది సభ్యులుంటారు. ప్రతి వార్డులో అన్ని విభాగాలు కలిసి 60 మంది వరకు సభ్యులుగా ఉంటారు. వీరంతా ఈనెల 24 నుంచి జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు.

వార్డుకో పర్యవేక్షక బృందం

ప్రతి వార్డులో 8 మంది అధికారులతో కూడిన వార్డు కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఆరుగురు అధికారులు, ఇద్దరు వార్డు కమిటీ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల్లో గజిటెడ్‌ అధికారులు, నాన్‌ గజిటెడ్‌ అధికారులున్నారు. వీరు పట్టణప్రగతి కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించటానికి, పర్యవేక్షించేందుకు కృషి చేస్తారు.

వార్డు కమిటీ విధులు

మహిళలు, యువత, వయోవృద్ధులు, వివిధ రంగాల్లో నిష్ణాతులతో కలిపి ఏర్పాటైన వార్డు కమిటీ సభ్యులు వార్డు అభివృద్ధికి కృషి చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించటానికి ప్రయత్నించాలి. హరితహారం, పచ్చదనం - పరిశుభ్రత, కార్యక్రమాలను నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. వార్డుల్లో విద్యుద్దీపాలు, మంచినీటి సరఫరా మెరుగుకు అవసరమైన సలహాలు, సూచనలు కౌన్సిలల్‌కు ఇవ్వాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేలా చూడాలి. నిరక్షరాస్యతను రూపుమాపి అక్షరాస్యతను పెంపొందించాలి. వార్డులో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తగిన సలహాలివ్వాలి.

మూడు నెలలకోకసారి సమావేశం

వార్డు కమిటీలకు ప్రతి మూడు నెలలకోకసారి సమావేశం ఏర్పాటు చేస్తారు. వార్డు కమిటీల సూచనలు, సలహాలను అధికారులు సేకరించి అమోదం కోసం కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెడతారు. కౌన్సిల్‌ తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.

ఆన్‌లైన్‌లో వార్డు కమిటీ సభ్యుల జాబితా

జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో ఏర్పాటుచేసిన వార్డు కమిటీ సభ్యుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. సభ్యుని పేరు, వయసు, వృత్తి, ప్రవృత్తి, చరవాణి నంబర్‌ తదితర విషయాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అన్ని పురపాలికల్లో వార్డు కమిటీల ఏర్పాటు ఇప్పటికే పూర్తిచేశారు.

పురపాలిక వార్డులు

వికారాబాద్‌ 34

పరిగి 15

తాండూరు 36

కొడంగల్‌ 12

మొత్తం 97

వార్డు కమిటీలకు కీలక బాధ్యత - బోగేశ్వర్లు, కమిషనర్‌, వికారాబాద్‌

వికారాబాద్‌ పురపాలికలో వార్డు కమిటీ సభ్యులను నియమించాం. పట్టణ ప్రగతిలో వార్డు కమిటీల పాత్ర ప్రధానంగా ఉంటుంది. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో వీరి సలహాలు, సూచనలు కీలకమవుతాయి. ఈ క్రమంలోనే శనివారం నుంచి చెత్త సేకరణకు విద్యుత్తు ఆటోలు ప్రారంభించాం. వార్డు కమిటీ సభ్యుల వివరాలను అన్‌లైన్‌లో పొందుపరిచాం.

కొత్తగా 140 మంది పారిశుద్ధ్య సిబ్బంది - సి.మంజుల, అధ్యక్షురాలు, వికారాబాద్‌

వికారాబాద్‌ పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు గాను కొత్తగా 140 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమిస్తున్నాం. వీరితో ఈ పది రోజుల పాటు వార్డుల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. ఇప్పటికే పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది 105 మంది ఉన్నారు. కొత్తగా నియమించిన వారితో కలిసి 245 మంది పట్టణాన్ని చెత్త రహితంగా మార్చేందుకు సరిపోతారు. పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. మట్టిదిబ్బలు, మురికి కాల్వలో పూడిక తొలగిస్తాం.

వార్డు కమిటీ సభ్యుల్ని నియమించాం - టి.శ్రీదేవి, 24 వార్డు కౌన్సిలర్‌, వికారాబాద్‌

వికారాబాద్‌ 24 వార్డులో వార్డు కమిటీలు ఏర్పాటు చేసి జాబితాను అధికారులకు అందజేశాం. అధికారులు తెలిపిన విధంగా మహిళలు, యువత, వివిధ రంగాల్లో నిష్ణాతులు, వయోపౌరులు కమిటీలో ఉండేలా జాబితాను సిద్ధం చేశాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.