close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

ఆర్చుకొని.. తీర్చుకొని.. చేర్చుకొని..!

నిమ్స్‌ అత్యవసర విభాగం వద్ద భారీ నిరీక్షణ

4 రోజులుగా రోగి పడిగాపులు

భర్తకు వైద్యమందించాలని భార్య వేడుకోలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: భారీగా అయ్యే ఖర్చు దృష్ట్యా నిరుపేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం కార్పొరేట్‌ ఆసుపత్రుల వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. నిమ్స్‌ ఆసుపత్రిలోనైనా కొంచెం తక్కువ డబ్బుతో మెరుగైన వైద్యం లభిస్తుందన్న ఆశతో ఎంతోమంది వస్తుంటారు. అత్యవసర విభాగం వైద్య సిబ్బంది ఆర్చుకొని.. తీర్చుకొని.. చేర్చుకోవడం రోగులను తీవ్రంగా బాధిస్తోంది. ఇక్కడ సకాలంలో సేవలు అందక రోజు ఎంతో మంది సతమతమవుతున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన సంతోష్‌ శస్త్రచికిత్స కోసం నిమ్స్‌కు వచ్చి నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తుండడమే ఈ పరిస్థితికి ప్రత్యక్ష నిదర్శనం.

సంతోష్‌ గత కొంత కాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్కడి వైద్యుల సూచన మేరకు గత ఏడాది ఆగస్టులో నిమ్స్‌కు వచ్చాడు. తరచూ వైద్య పరీక్షల కోసం వచ్చివెళుతున్నాడు. వ్యాధి విషమించడంతో ఈనెల 18న మళ్లీ వచ్చి వైద్యులను సంప్రదించాడు. రిపోర్టులన్నీ పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. కానీ ఆసుపత్రిలో మాత్రం చేర్చుకోలేదు. ఆరోగ్యశ్రీ సమస్య ఉందని చెప్పి పంపించారు. నాలుగు రోజులుగా అక్కడే ఉన్న సంతోష్‌ భార్య వినోద సాయంతో రోజూ అత్యవసర విభాగం వరకు వెళుతున్నాడు. అయినా ఆసుపత్రి వర్గాలు పట్టించుకోవడం లేదని వినోద ఆరోపిస్తోంది. వైద్యుల వద్దకు తీసుకెళ్లేందుకు స్ట్రెచ్చర్‌ ఇచ్చేందుకు కూడా సిబ్బంది నిరాకరించారని పేర్కొంది. నడవలేని పరిస్థితి ఉందని బతిమాలితే రూ.500 డిపాజిట్‌ చేయించుకొని స్ట్రెచ్చర్‌ ఇచ్చారని తానే తీసుకెళ్లాల్సి వస్తోందని వాపోయింది. ఒక్కతే తోసుకెళ్లలేక రోగుల సహాయకులను ఎవరో ఒకరిని ప్రాథేయపడితే సహకరిస్తున్నారని తెలిపింది. నా భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వైద్యులు శస్త్రచికిత్స చేయాలని కన్నీటి పర్యంతమైంది.

పడకలు దొరకడం కష్టమే

నిమ్స్‌ అత్యవసర విభాగంలో పడకలు దొరకాలంటే గగనమే. గంటలు, రోజులు తరబడి నిరీక్షించాల్సిందే. అత్యవసర విభాగంలో 90 వరకు వెంటిలేటర్లు ఉన్నాయి. తరచూ 10-15 మొరాస్తుంటాయి. రోజూ సుమారు 70 మంది వరకు క్షతగాత్రులు వస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, ఆత్మహత్యాయత్నం చేసిన వారు ఉంటారు. పడకల కొరత పేరుతో సకాలంలో వైద్య సేవలు అందించడానికి నిరాకరిస్తున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చిన వారు సైతం గంటల తరబడి బయటే నిరీక్షించాలి. రోగి సహాయకులు వైద్యుల వద్దకు వెళ్లి రిపోర్టులు, కానీ పరిస్థితిని కానీ వివరిస్తే వైద్యులు వచ్చి పరిశీలిస్తారు. రోగి పరిస్థితి, వైద్యులు తెలిపే సూచనలను బట్టే లోపలికి అనుమతిస్తారు. అప్పటి వరకు అంబులెన్స్‌ కానీ వ్యక్తిగత వాహనాల్లో కానీ బిక్కుబిక్కుమంటూ ఎదురు చూడాల్సిందే. పైస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సకాలంలో సేవలు అందడంలో తీవ్ర జాప్యమవుతోందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.