close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏకగ్రీవం.. నజరానా బహుదూరం..!

ఎన్నికలు జరిగి ఏడాదిన్నరైనా అందని ప్రోత్సాహకం

సమస్యల చట్రంలో చిన్న పంచాయతీలు

వెంకటాపురం, న్యూస్‌టుడే

రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న రాచపల్లి పంచాయతీ కార్యాలయం

పాలనా సౌకర్యం కోసం తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. గిరిజన పల్లెలకు నూతన శోభను తెచ్చింది. పారదర్శకమైన పరిపాలనకు గాను యంత్రాంగాన్ని నియమించింది. ఏడాదిన్నర కిందట ఎన్నికలను నిర్వహించింది. గ్రామాల్లో సమష్టితత్వంను చాటుకునేందుకు ఏకగ్రీవ ఎన్నికల దిశగా వెన్నుతట్టింది. ప్రోత్సాహక సొమ్ములను పెంచి ఉత్సాహాన్ని నింపినా నేటికీ నజరానా అందని ద్రాక్షగా మారింది. పరిపాలనకు అవస్థలు పడుతున్న చిన్న పంచాయతీల దుస్థితిపై కథనం..

జిల్లాలోని 9 మండలాల పరిధిలో 174 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతేడాది జనవరిలో మూడు విడతల్లో ఎన్నికలకు ప్రభుత్వం ఆదేశించింది. న్యాయస్థానంలో కేసులు ఉండటంతో మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలు మినహా 149 పంచాయతీల్లో ఎన్నికలను అధికారులు నిర్వహించారు. ఏకగ్రీవ పంచాయతీలుగా ఎంపిక చేసుకునే పాలకవర్గాలకు ప్రభుత్వం నుంచి రూ.10లక్షల ప్రోత్సాహకం అందిస్తామంటూ ప్రకటించారు. దీనికి తోడు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం మరో రూ.10లక్షలు ఇస్తామంటూ ఎన్నికల సమయంలోనే వెల్లడించారు. దీంతో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు విభేదాలను పక్కన పెట్టి ఏకగ్రీవం చేసే దిశగా కృషి చేశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో 24 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తై ఏడాదిన్నర గడుస్తున్నా నయా పైసా విదల్చకపోవడంతో మౌలిక వసతులకు చిన్న పంచాయతీలు అష్టకష్టాలు పడుతున్నాయి.

ఏకగ్రీవమైనా నయాపైసా రాని నూగూరు పంచాయతీ

నిధులు చాలవు.. గూడు కరవు

ప్రోత్సాహక నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జనాభా తక్కువగా ఉండటంతో ప్రభుత్వం నుంచి విడుదల అవుతున్న ఎస్‌ఎఫ్‌సీ, 15 ఆర్థిక సంఘం నిధులు ఎటూ సరిపోని పరిస్థితి దాపురించింది. ఈ పంచాయతీలు ఆసాంతం కొత్తగా ఏర్పాటైనవి కావడం గమనార్హం. స్థానిక సంస్థలకు అధికారాలను అప్పగించిన ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు నిలువ నీడను నేటీకీ కల్పించకపోవడంతో పరాయి పంచన సేవలందిస్తున్నారు. దీనికి తోడు పంచాయతీల్లో నర్సరీలు, వైకుంఠధామం నిర్మాణం, సెగ్రిగేషన్‌ షెడ్లు, ఇతరత్రా కార్యకలాపాలన్నీ పంచాయతీలపైనే బాధ్యత మోపడంతో ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే గ్రామ పంచాయతీ నిధులతోనే ప్రతి పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, నీటి ట్యాంకరును విక్రయించాలని నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో చిల్లిగవ్వ లేని చిన్న పంచాయతీలు అప్పులు చేసి మౌలిక వసతులను సమకూర్చుకోవాల్సి వచ్చింది.

జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు


ప్రభుత్వానికి నివేదికలు పంపాం - ఒ.దేవరాజ్‌, డీఎల్‌పీవో, ములుగు

గతేడాది జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల జాబితాను ప్రభుత్వానికి నివేదించాం. ఇది వరకే పూర్తి వివరాలను పంపించాం. సర్కారు నుంచి సొమ్ములు విడుదల కాగానే ఆయా పంచాయతీలకు జమ చేస్తాం. ప్రస్తుతం విడుదల అవుతున్న నిధులతో పారదర్శకమైన పాలనను అందించాలి. సొంత గూడు సమకూర్చేందుకు ఉపాధి నిధులతో ప్రణాళిక చేయబోతున్నాం.


రూ.8 లక్షలు అప్పు చేశాం - సొర్లం సమ్మయ్య, రాచపల్లి సర్పంచి

కొత్తగా ఏర్పాటైన పంచాయతీకి గిరిజనం అంతా ఒక్కటై ఎన్నికను ఏకగ్రీవం చేసుకున్నాం. సర్పంచితో సహా పాలకవర్గాన్ని ఎన్నుకున్నాం. రూ.20లక్షలు నజరానా ఇస్తామన్నారు. నేటికీ పైసా రాలేదు. పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకరు కొనుగోలు చేయాలని అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఖజానా ఖాళీగా ఉందని చెప్పడంతో బ్యాంకు ద్వారా రూ.8లక్షలు అప్పు తీసుకుని యంత్రాలను కొనుగోలు చేశాం. నెలకు రూ.13వేల చొప్పున చెల్లిస్తున్నాం. ఆ సొమ్ములు వస్తేనే కష్టాలు తీరుతాయి.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.