close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం 

 ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీ

● ‘నవశకం’ అమలుకు ప్రత్యేక చర్యలు

● గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ ముత్యాలరాజు

 

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే జిల్లా సమగ్రాభివృద్ధికి అవిరళ కృషి సాగిస్తున్నట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు వ్యాఖ్యానించారు. 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఏలూరు నగరంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ ముత్యాలరాజు తదుపరి జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఉగాది పండుగ నాడు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్‌ఆర్‌ నవశకం కార్యక్రమాల అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని వివరించారు. జిల్లాలో పలు ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న, చేపట్టబోయే కార్యక్రమాలను తన ప్రసంగంలో కలెక్టర్‌ ప్రస్తావించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

త్యాగధనులకు నివాళులు..

స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగధనులందరికీ నివాళులు. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, అల్లూరి సీతారామరాజు తదితర మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా మననం చేసుకుందాం. మువ్వన్నెల జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం.

 

ప్రజా  సంక్షేమానికి పలు కార్యక్రమాలు.. ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీటి అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తాం. జిల్లా ప్రజలు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. రానున్న రోజుల్లో ఇంటి వద్దకే నిత్యావసర సరకుల పంపిణీతోపాటు వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ, వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.

వ్యవసాయ అనుబంధ రంగాలు.. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు, సాగుదారుడికి పంట  పెట్టుబడి నిమిత్తం రూ.13,500 చొప్పున 3,21,935 మందికి రూ.257 కోట్ల ఆర్థిక సాయం అందించాం. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌లో 2,37,069 మంది రైతులకు ప్రయోజనం కల్పించేలా రూ.52 కోట్లను ప్రీమియంగా చెల్లించాం. ప్రతి మండలానికి ఐదు కేంద్రాల చొప్పున 240 రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి 2,809 మంది రైతులకు చెందిన 16,286 హెక్టార్లలో సూక్ష్మసేద్యం అమలు చేస్తున్నాం. రైతుబంధు పథకం కింద వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ యార్డుల్లో నిల్వ ఉంచిన 39 మంది రైతులకు రూ.69 లక్షలను రుణంగా మంజూరు చేశాం. ఆక్వా ఉత్పత్తుల్లో మన జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ రాష్ట్రానికి ముఖ్య ఆదాయ వనరుగా మారింది.

పరిశ్రమలు: జిల్లాలో 5,813 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను రూ.2,983 కోట్లతో స్థాపించి 57,195 మందికి, 73 భారీ పరిశ్రమలను రూ.3222 కోట్లతో స్థాపించి 30,308 మందికి ఉపాధి కల్పించాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 504 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను రూ.192 కోట్ల పెట్టుబడితో స్థాపించి 5,515 మందికి ఉపాధి కల్పించాం. ఏకగవాక్ష విధానం ద్వారా పలు పరిశ్రమల స్థాపనకు 1,200 దరఖాస్తులు అందగా వాటిలో 1,157 అనుమతులను మంజూరు చేశాం.

పర్యాటక శాఖ: జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పోలవరం, పాపికొండలు, కొవ్వూరు, చించినాడ, యలమంచిలిలంక, వలంధర రేవు, ఎర్ర కాల్వ జలాశయంలో బోటింగ్‌ పాయింట్ల ఏర్పాటు, పేరంటాలపల్లి, కొల్లేరు ప్రాంతాల్లో పర్యాటక సదుపాయాలు, ఆకివీడులో కాటన్‌ పార్కును అభివృద్ధి చేశాం. పేరుపాలెం బీచ్‌ అభివృద్ధికి రూ.2 కోట్లను వెచ్చించాం.

యువజన సేవల శాఖ: ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై జిల్లాలో అర్హులైన 1,162 మంది యువతకు శిక్షణ ఇచ్చాం. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించేందుకు రూ.81 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నాం.

గృహ నిర్మాణ సంస్థ: జిల్లాలో ఉగాది నాటికి 2.63 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాం. వీరిలో స్థలం కలిగి ఉండి ఇళ్లు మంజూరు చేయాల్సిన 75,455 మంది లబ్ధిదారులను గుర్తించాం. ప్రధానమంత్రి ఆవాస యోజన - వైఎస్‌ఆర్‌ పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణ పథకాల కింద 11,100 గృహ నిర్మాణాలు చేపట్టి 2020 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం.

గ్రామీణాభివృద్ధి శాఖ: జిల్లాలోని 57,598 స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,362 కోట్ల రుణ ప్రణాళికను చేపట్టి.. ఇప్పటివరకు 31,139 సంఘాలకు రూ.925 కోట్లను రుణాలుగా మంజూరుచేశాం. వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పథకంలో భాగంగా 4,32,648 మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, మత్స్యకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రతినెలా రూ.105.68 కోట్లను పింఛన్లుగా పంపిణీ చేస్తున్నాం.

పట్టణ పేదరిక నిర్మూలన: పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలకు ఇంతవరకు బ్యాంకు లింకేజీ కింద 2,872 సంఘాలకు రూ.154 కోట్లు, వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద 9,295 సంఘాలకు రూ.303 కోట్లు, వడ్డీలేని రుణాల కింద 8,097 సంఘాలకు రూ.7 కోట్లు మంజూరు చేశాం.

ఉచిత విద్యుత్తు: నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ఇందుకు గాను రూ.554 కోట్ల రాయితీని ప్రభుత్వం భరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ఇందుకుగాను రూ.53 కోట్లను రాయితీగా ప్రభుత్వం చెల్లిస్తోంది. 14,099 మంది ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50 చొప్పున రూ.230 కోట్ల రాయితీని అందిస్తున్నాం.

జలయజ్ఞం: పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు రూ.3,791 కోట్లను ఖర్చు చేయగా.. అందులో భూసేకరణ నిమిత్తం రూ.1,221 కోట్లు, కాలువ తవ్వకం పనులకు రూ.2569 కోట్లను వెచ్చించాం. తాడిపూడి ఎత్తిపోతల పథకానికి రూ.886 కోట్లతో అంచనాలను రూపొందించగా ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయి. దీనిద్వారా 14 మండలాల్లోని 135 గ్రామాలకు తాగునీరు, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టును రూపొందించాం.

గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పథకం: జిల్లాలో ప్రతి మనిషికి రోజుకు వంద లీటర్ల శుద్ధిచేసిన మంచినీటిని అందించాలనే లక్ష్యంతో రూ.3,670 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ అభివృద్ధి పనులకు పరిపాలన ఆమోదం లభించింది. రక్షిత మంచినీటి సరఫరా పథకం కింద ఎనిమిది ఎస్సీ ప్రాంతాల్లో మంచినీరు సరఫరా చేయడానికి రూ.3.84 కోట్లతో చేపట్టిన ఎనిమిది పనుల్లో మూడు పనులు పూర్తవగా ఐదు పనులు ప్రగతిలో ఉన్నాయి.

ఉపాధి హామీ పథకం: జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 2.97 లక్షల కుటుంబాలకు చెందిన 4.60 లక్షల మంది కూలీలకు 106 లక్షల పని దినాలు కల్పించి రూ.213 కోట్లను వేతనాలుగా చెల్లించాం. భూగర్భ జలాల పెంపునకు రూ.1.92 కోట్లతో 1,217 పనులను పూర్తిచేయగా మరో 1,031 పనులు పురోగతిలో ఉన్నాయి. చెత్త నుంచి సంపదను సృష్టించడానికి 59 కేంద్రాలను ఏర్పాటుచేశాం. గ్రామ సచివాలయాలు, సీసీ రహదారులు, సీసీ డ్రెయిన్లు, పాఠశాలలకు ప్రహరీలు, బీటీ రహదారుల నిర్మాణానికి 8,432 పనులను గుర్తించి రూ.1,797 కోట్లకు పరిపాలన ఆమోదాలు ఇచ్చాం.

స్పందన పరిష్కార వేదిక: ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సమస్యలకు నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇంతవరకు 79,903 అర్జీలందగా.. వాటిలో 78,326 అర్జీలను పరిష్కరించాం. అర్జీల పరిష్కార శాతం 98 నమోదైంది.

గ్రామ, వార్డు సచివాలయాలు: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో 16,330 గ్రామ వాలంటీర్ల కొలువులను భర్తీ చేశాం. తొమ్మిది పట్టణ ప్రాంతాల్లో 3,897 వార్డు వాలంటీర్ల కొలువులను భర్తీ చేశాం. రూ.204 కోట్ల అంచనా విలువతో 510 గ్రామ సచివాలయ భవనాలను ఉపాధి హామీ పథకం కింద మంజూరుచేశాం.

రహదారులు, భవనాల శాఖ: ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.468 కోట్ల విలువైన 14 పనులను మంజూరు చేశాం. అదేవిధంగా పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.244 కోట్ల అంచనాలతో 675 గ్రామ సచివాలయాల నిర్మాణం లక్ష్యం కాగా 381 భవనాలు పురోగతిలో ఉన్నాయి. పలు గ్రామాల్లో రూ.672 కోట్ల అంచనాలతో 3,085 సీసీ రహదారుల నిర్మాణం లక్ష్యం కాగా 2,623 పనులు పూర్తయ్యాయి.

ఎంపీ నిధులు: పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రాంతీయ అభివృద్ధి పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.6 కోట్లతో 104 పనులు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.7 కోట్లతో 231 పనులు మంజూరయ్యాయి.

విద్య: ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా తొలి విడతగా ఎంపికచేసిన 1,148 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాన్ని గతేడాది నవంబరు 14 నుంచి ప్రారంభించాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నాం. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల అభ్యున్నతి కోసం అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున చెల్లిస్తున్నాం. ఈ పథకం ద్వారా 3.37 లక్షల మంది తల్లులకు రూ.505 కోట్లను చెల్లించాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభించాం. 3,270 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది.

వైద్య, ఆరోగ్య శాఖ: ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.266 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల భవన సముదాయ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం విస్తరించింది. ఈ పథకం కింద ప్రస్తుతం అమల్లో ఉన్న 1,059 చికిత్సలకు మరో వెయ్యి చికిత్సలను జతచేశాం. 12.46 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ప్రజలకు అందజేశాం. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం కింద 4,361 పాఠశాలల్లో 5,20,072 మంది విద్యార్థులకు రెండు విడతలుగా నేత్ర వైద్య పరీక్షలు చేయించి కంటి సంబంధిత సమస్యలున్న 32,654 మందిని గుర్తించాం. వీరిలో 11,294 మందికి కళ్ల జోళ్లను పంపిణీ చేశాం.

శాంతి భద్రతలు: దిశ చట్టం అమల్లో భాగంగా డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏలూరులో మహిళా పోలీసు స్టేషన్‌ను నిర్దేశించాం. మహిళలు, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి పోలీసు స్టేషన్‌లో ఆరుగురు మహిళా మిత్ర సభ్యులతో కూడిన 60 కమిటీలను ఏర్పాటు చేశాం. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిరంతరం నిఘాను పటిష్ఠం చేసేందుకు జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో 847 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.