close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

ప్రధానాంశాలు

చేజారకుండా..

రహస్య ప్రాంతాలకు తరలిన చిట్యాల, గుట్ట కాంగ్రెస్‌ నాయకులు

నేటి సాయంత్రానికి చౌటుప్పల్‌, చండూరు నాయకులూ శిబిరాల్లోకి!

ఫలితాల అనంతరమే నల్గొండ పురపాలికలో శిబిరాలపై స్పష్టత

మెజార్టీ స్థానాలపై ధీమాతో తెరాస

ఎమ్మెల్సీల ఓటు హక్కు వినియోగంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయం

ఈనాడు, నల్గొండ :

ఒక వైపు ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతుండగానే ఉమ్మడి జిల్లాలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ ఛైర్మన్‌ పీఠాలను దక్కించుకుంటుందని ఆశలున్న చిట్యాల, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌లో పార్టీ తరఫున పోటీ చేసిన వారందరినీ ఇప్పటికే రహస్య ప్రాంతాలకు తరలించగా.. నేటి సాయంత్రానికి చండూరు, హాలియా, నందికొండ పురపాలికల్లో నేతలను క్యాంపులకు తరలించడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాలు అతడి సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ క్యాంపు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సాగర్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నేత జానారెడ్డి స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో చండూరు, చౌటుప్పల్‌లో రెండు పురపాలికలు ఉండగా... రెండింటిలోనూ విజయం సాధిస్తామని కాంగ్రెస్‌పార్టీ ధీమాగా ఉంది. గెలిచిన తర్వాత తమ సభ్యులు చేజారిపోతారన్న అనుమానంతో ఛైర్మన్‌ ఆశావహులు ముందే పోటీదారులను తమకు అనుకూలమైన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 18 పురపాలికలుండగా దాదాపు ఎనిమిది పురపాలికలపై పార్టీ జెండా ఎగరనుందని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త పడితేనే వాటిని చేజిక్కుంచుకుంటామన్న ఆశతో ఫలితాలకు రెండు రోజుల ముందే క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఫలితాల సరళి ఓ కొలిక్కి రాగానే చిట్యాల, గుట్టతో పాటు చౌటుప్పల్‌, చండూరుల నాయకులంతా ఈ రాత్రికి బెంగళూరుకు బయలుదేరనున్నట్లు తెలిసింది. చౌటుప్పల్‌లో అధికార పార్టీ నాయకులు కూడా క్యాంపుల్లో ఉన్నట్లు తెలిసింది. వీరు ఈ రోజు కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లి మళ్లీ సాయంత్రం రహస్య ప్రాంతాలకు వెళ్లనున్నారు. తిరిగి ఛైర్మన్‌ ఎన్నిక జరిగే ఈ నెల 27న నేరుగా వారి వారి ప్రాంతాలకు చేరుకోనున్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరమే

ఉమ్మడి జిల్లాలోని త్రిముఖ పోరు జరిగిన నల్గొండ, భువనగిరి, దేవరకొండల్లో ఎన్నికల ఫలితాల అనంతరమే క్యాంపు రాజకీయాలు చేయాలని అధికార తెరాస భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీలోనూ ఈ పురపాలికల్లో ఇప్పటికిప్పుడు క్యాంపు రాజకీయాలు నడిపితే ఖర్చు తడిసి మోపెడవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. పార్టీ ఛైర్మన్‌ ఆశావహులు సైతం ఈ పురపాలికల్లో గెలుపుపై అంత ధీమా వ్యక్తం చేయకపోవడంతో ఈ మూడింటిలో ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మూడింటిలోనూ అతి పెద్ద పార్టీగా తెరాస అవతరిస్తుందన్న అంచనాల మధ్య అధికార పార్టీ నాయకులు సైతం ఫలితాల అనంతరమే నిర్ణయం తీసుకుందామని వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. ఈ మూడింటిలోనూ స్థానిక ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం కావడం, ఎక్కడ కూడా అధికార పార్టీ ఛైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో క్యాంపులకు ఎవరు నాయకత్వం వహించాలన్న మీమాంస వ్యక్తమవుతోంది. అన్నింటిలోనూ పూర్తి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న తెరాస పార్టీ నాయకులు ఎన్నికల ఫలితాల సరళి అనంతరమే క్యాంపు రాజకీయాలపై దృష్టిపెట్టనున్నారు. మరోవైపు క్యాంపు రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ పెట్టింది పేరని..తమకు ఆ అవసరం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం.

ఎమ్మెల్సీల ఓటు హక్కు ఎక్కడా?

ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నే ప్రభాకర్‌ ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో తేరా చిన్నపరెడ్డి, వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ ఉపాధ్యాయ కోటాలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల కోటాలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. వీరంతా ఉమ్మడి జిల్లాలోని ఏదో ఒక పురపాలికలో పేరు నమోదు చేసుకొని ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఛైర్మన్‌ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. అయితే ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయిన సభ్యులు రాష్ట్రంలో ఏ పురపాలికలో అయినా ఒక దాంట్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్ఛు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా వినియోగించుకోవచ్ఛు ఏదేనీ పురపాలికలో ఒకట్రెండు ఓట్లు తక్కువ పడితే వీరి ఓట్ల ద్వారా గట్టెక్కవచ్చనే ఉద్దేశంతో అధిష్ఠానం ఎన్నికల ఫలితాల అనంతరమే ఏ ఎమ్మెల్సీ ఎక్కడ ఓటు వేయాలో చెబుతామని తాజాగా ప్రకటించింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.