మంగళవారం, డిసెంబర్ 10, 2019
బాగ్లింగంపల్లి, న్యూస్టుడే: రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. సుందరయ్య కళానిలయంలో శనివారం ఎయిడెడ్ కాలేజెస్ టెంపరెరీ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థలు నగరాలు, పట్టణ కేంద్రాల్లో అధిక సంఖ్యలో ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి ఎంతో ఖర్చుతో కూడిన పనని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు 1000 మంది కూడా పని చేయడంలేదన్నారు. దీంతో ప్రభుత్వ విద్య పేదలకు అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను బలోపేతం చేయాలన్నారు. విద్యార్థుల తరఫున ఉద్యోగ సంఘాలు, ఎయిడెడ్ అధ్యాపకులు కలిసి ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. 2007 నుంచి ఎయిడెడ్ విద్యా వ్యవస్థ బలోపేతంపై పోరాటం చేస్తున్నామన్నారు. విద్యావకాశాలను మరింత పెంచాలని, ఎయిడెడ్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రతను కల్పించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. ఉద్యోగులను నియమిస్తే బాగుంటుందన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసివేస్తుండటం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో నల్లా రాధాకృష్ణ, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.జి.రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎం.విజయలలిత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కోశాధికారి ఎం.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు