close

బుధవారం, జులై 24, 2019

తాజా వార్తలు

ప్రశ్నించినందుకు ప్రాణం తీశాడు!

రౌడీషీటర్‌ చేతిలో హతుడైన సాయికిరణ్‌ మరణోత్తర పరీక్షలు పూర్తి
ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

ఉస్మానియా ఆసుపత్రి,  న్యూస్‌టుడే: యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నిలదీసినందుకు రౌడీషీటర్‌ ఆ యువకుడిపై దాడి చేసి కొట్టడంతో తీవ్రంగా గాయాలపాలై, ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడి చేసిన వ్యక్తి రౌడీషీటర్‌ కావడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసుల భద్రత మధ్య మృతదేహానికి మరణోత్తర పరీక్ష నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఉస్మానియా ఆసుపత్రితో పాటు, మంగళ్‌హాట్‌, గుఫామందిర్‌, ఆర్కేపేట్‌, తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్కేపేట్‌ వద్ద పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం అంత్యక్రియులు పూర్తికావడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. రాంగోపాల్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్‌ గుఫామందిర్‌ ప్రాంతానికి చెందిన సాయిసాగర్‌ (23) స్నేహితులతో కలసి జన్మదిన వేడుకలకు ఈ నెల 13న జలవిహార్‌కు బయల్దేరారు. నెక్లెస్‌ రోడ్డుపై రౌడీషీటర్‌ ముబిన్‌ ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో సాయిసాగర్‌ నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన రౌడీషీటర్‌ సాయిసాగర్‌పై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్నేహితులు, పోలీసుల సహకారంతో సాయిసాగర్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబీకులు ఉస్మానియా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుఝాము వరకూ ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో బస్తీవాసులు, మృతుడి కుటుంబీకులు ఉస్మానియాకు చేరుకుని ధర్నా చేపట్టారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత సేపు ఉస్మానియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అఫ్జల్‌గంజ్‌, రాంగోపాల్‌పేట్‌ పోలీసులు సాయిసాగర్‌ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం శవాగారానికి తరలించారు. పోలీసు భద్రత మధ్య మరణోత్తర పరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
భౌతికకాయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌
హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌ ఆరోపించారు. నెక్లెస్‌ రోడ్డుపై యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న రౌడీషీటర్‌పై ఇప్పటికే 12కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. గుఫామందిర్‌ వద్ద గల సాయిసాగర్‌ ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించారు. మృతుడి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.
మిర్యాలగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ఇటీవల సాయిసాగర్‌ అనే వ్యక్తిని హత్యచేసిన ముబిన్‌ అలియాస్‌ జునైద్‌ది చిన్నతనం నుంచి నేరస్వభావమే. ఇప్పటి వరకు అతనిపై 16 కేసులు నమోదై ఉన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కుమారుడైన ఇతడు చిన్నతనం నుంచే పలువురిపై దాడికి పాల్పడేవాడు. ఆ సమయంలో అతనిపై పోలీసులు కేసులు నమోదు చేసి వదిలివేయడంతో గ్యాంగ్‌లను నిర్వహించే స్థాయికి ఎదిగాడు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అనుచరులను ఏర్పాటుచేసుకుని ముబిన్‌ భూతగాదాలు, ఇతర వివాదాల్లో సెటిల్‌మెంట్లు చేసే స్థాయికి ఎదిగాడు. మద్యం దుకాణాల్లో ఘర్షణలకు పాల్పడటం, బీరు సీసాలతో దాడులకు పాల్పడిన కేసులు అతనిపై నమోదయ్యాయి. కేసులు నమోదు చేసిన సమయంలో ద్వితీయశ్రేణి రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని పోలీసుస్టేషన్‌ నుంచి విడిపించేవారు. గంజాయి అమ్మకాల విషయంలో గ్యాంగ్‌లను నిర్వహించి తనదైన శైలిలో రౌడీ మూకలతో కలిసి అల్లర్లు సృష్టించే వాడు. 2011లో అప్పటి సీఐ నర్సింహారెడ్డి సదరు గ్యాంగు కార్యకలాపాలకు అడ్డుకట్టవేశారు. తరువాత 2018లో ఓ యువకుడిపై దాడిచేసి దవడ ఎముకలు విరగ్గొట్టినప్పటికీ అప్పటి పోలీసులు కఠినంగా వ్యవహరించలేదు. దాడులకు దిగి పరారయ్యేవాడు. పోలీసులు పట్టుకోలేకపోవడంతో ఆగడాలు పెరిగిపోయాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ముందు జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఆదేశాలతో ప్రత్యేక బృందం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని హెచ్చరించినప్పటికీ మార్పురాలేదు. కొందరు బడా వ్యక్తులు డబ్బులు ఇస్తూ ఇతన్ని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

https://betagallery.eenadu.net/htmlfiles/112808.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.