close

బుధవారం, జులై 17, 2019

తాజా వార్తలు

సమస్యలివి.. పట్టించుకోవాలి మరి

 మీకోసం ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం
 
సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : మీకోసం ప్రజాదర్బార్‌కు వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో సోమవారం జేసీ అధ్యక్షతన జరిగిన ప్రజాదర్బార్‌లో రెండో జేసీ మణిమాల, శ్రీశైలం ప్రత్యేక కలెక్టర్‌ వెంకటేశం, జడ్పీ సీఈవో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో బీకే వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, డీఎస్‌వో పద్మశ్రీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో పాటు అన్ని శాఖల అధికారులు దర్బార్‌లో ప్రజా వినతులు స్వీకరించారు.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..

*● తన భర్త చనిపోయారని, నలుగురు పిల్లలలో జీవనం కష్టంగా ఉందని, పనులకు వెళ్తే లేనిపోని అనుమానాలతో అత్త పుల్లమ్మ చిత్రహింసలకు గురిచేస్తోందని బండిఆత్మకూరు మండలం కడమరకాలువకు చెందిన శాంతమ్మ విన్నవించారు. 2.60 ఎకరాల భూమిలో తమ వాటాగా ఎకరా భూమి ఇవ్వాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు.

*● కర్నూలు నగరంలోని మార్కెట్‌యార్డు దగ్గర ఇందిరా గాంధీ నగర్‌లో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎయిడెడ్‌ పాఠశాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు యత్నిస్తున్న ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. పాఠశాల స్థలాన్ని కాపాడాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ, మాజీ కార్పొరేటర్‌ రాముడు, నాయకులు లోకేష్‌, చిన్న రోషయ్య తదితరులు జేసీకి విన్నవించారు.

*● ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేటలో 1321 సర్వే నంబరు సమీపంలోని వాగు పోరంబోకు స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారని, ఫలితంగా తమ పంట పొలాలు నీటి ముంపునకు గురవుతున్నాయని డేవిడ్‌రాజు దర్బార్‌లో మొరపెట్టుకున్నారు.

*● పెద్దకడుబూరు మండలం మేకడోనలో సర్వే నంబరు 140, 142/ 3ఏ లో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూమిని కొన్నేళ్లుగా సాగుచేసుకుంటున్నామని, ఆదోనికి చెందిన షఫీ, రఫీ దౌర్జన్యంగా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని, తాము సాగు చేసుకుటున్న భూమికి పట్టాలు ఇవ్వాలని రూతమ్మ, సరోజి, సామలమ్మ, శారద కోరారు.

*● బనగానపల్లె మండల చిన్నరాజుపాలెంలో సర్వేనెంబరు 190లో 6.16 ఎకరాల భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని తహసీల్దారు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సర్వేయర్‌ పట్టించుకోవడం లేదని బాధితురాలు లక్ష్మీదేవమ్మ మొరపెట్టుకున్నారు.

●* కర్నూలు మండలం దిన్నెదేవరపాడు పరిధిలోని ఆర్టీసీ కాలనీలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని, రహదారులు, డ్రైనేజీ కాలువలు లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు హనిమిరెడ్డి, తదితరులు విన్నవించారు.

 
పెద్దఎత్తున తరలివచ్చిన బాధితులు 

https://betagallery.eenadu.net/htmlfiles/116558.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.