ఇంజినీరింగ్‌ విద్య..అంతా మిథ్య - Kurnool - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

తాజా వార్తలు

ఇంజినీరింగ్‌ విద్య..అంతా మిథ్య

● ఇప్పటికీ పూర్తికాని భవన నిర్మాణాలు ● మంజూరు కాని నిధులు

● బోధన సిబ్బంది నియామకాల్లో కానరాని పారదర్శకత

● విద్యాశాఖ మంత్రి దృష్టి పెట్టాలి మరి..

ఆర్‌యూలో నిర్మాణంలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాల

రాయలసీమ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఏర్పాటవుతున్న ఇంజినీరింగ్‌ కళాశాలకు అడుగడుగునా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాదిలో తరగతులు ప్రారంభమైనప్పటికీ భవన నిర్మాణాలు మొదలుకొని విద్యార్థులకు వసతి.. తరగతి గదుల ఏర్పాటు.. బోధన, బోధనేతర సిబ్బంది భర్తీ.. ఇలా అన్నీ అంశాల్లో జాప్యం ఏర్పడుతోంది. ప్రిన్సిపల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ఇప్పటివరకు పూర్తి చేయలేదు. పోస్టుల భర్తీలో ప్రతిభావంతులకుకాక ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారికే ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆర్‌యూలో శనివారం జరిగే విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం సమావేశానికి విద్యాశాఖ మంత్రి హాజరవుతున్న నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కళాశాల పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

 న్యూస్‌టుడే-కర్నూలు విద్య: రాయలసీమ విశ్వవిద్యాలయం ఆవరణలో ఇంజినీరింగ్‌ కళాశాల, బాలబాలికలకు వసతిగృహాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.40 కోట్లను కేటాయించింది. కళాశాల భవనం, రెండు వసతిగృహాలకు రూ.14 కోట్లు మంజూరు చేయగా మిగిలిన నిధులు రావాల్సి ఉంది. 2019-20 విద్యా సంవత్సరంలో నాలుగు బ్రాంచిలకు సంబంధించి తరగతులు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు ప్రిన్సిపల్‌, అసిస్టెంటు, అసోసియేట్‌ పోస్టుల భర్తీనే చేపట్టలేదు. మరోవైపు ఆంగ్లం, గణితం, రసాయన సబ్జెక్టులకు సంబంధించి అసిస్టెంటు ప్రొఫెసర్ల నియామకాలకు మౌఖిక పరీక్షలు మాత్రమే నిర్వహించారు. ప్రిన్సిపల్‌ పోస్టులో వారం రోజులపాటు విధులు నిర్వహించిన ఓ అభ్యర్థి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఇప్పటివరకు రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యేసరికి కంప్యూటర్‌ సైన్సు (సీఎస్‌ఈ)-64, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈఎస్‌ఈ)-38, సివిల్‌ ఇంజినీరింగ్‌ (సీఈ)-13, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఎంఈ)లో ఐదుగురు విద్యార్థులు కళాశాలలో చేరేందుకు సుముఖత చూపారు. మొదటి విడతలో ఆర్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాలకు 61 శాతం మంది ఆప్షన్లు ఇచ్చుకోగా రెండో విడత పూర్తయ్యేసరికి 47.35 శాతం ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులో 13 శాతం మందికిపైగా వెనక్కి వెళ్లిపోయారు.

అయినవారికే అందలం

ఇంజినీరింగ్‌ కళాశాలలో బోధన సిబ్బంది భర్తీలో అయినవారినే అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రిన్సిపల్‌ పోస్టుకు ప్రతిభ కలిగిన అభ్యర్థులను కాదని మరో వ్యక్తికి ఎంపిక చేశారని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఇటీవల బయటపెట్టి ఎంపికను రద్దు చేయించారు. తాము సిఫార్సు చేసిన అభ్యర్థిని ఎంపిక చేయాలని వర్సిటీ అధికారిని ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు కోరారు. అందుకు సదరు అధికారి సబ్జెక్టు నిపుణులను కోరగా వారు నిరాకరించి ఏకంగా కొద్దిసేపు ఇంటర్వ్యూలు ఆపేసిన ఘటనలు ఉన్నాయి. ఒకవైపు అన్నింటిలో పారదర్శకత పాటించాలని, అక్రమాలకు తావీయకూడదని ముఖ్యమంత్రి ఆదేశిస్తుంటే వర్సిటీలో అందుకు భిన్నంగా జరుగుతుండడం గమనార్హం.

కళాశాల సిద్ధమేనా?

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతితో ఆర్‌యూసీఈ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రారంభంలో చూపిన శ్రద్ధ చివరి దశలో అధికారులు చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేకపోవడం.. మరోవైపు నిధుల విషయంలో ఉన్నత విద్యాశాఖ, వర్సిటీ అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. దీంతో గుత్తేదారుడు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. కళాశాల పరిస్థితిని చూసిన పలువురు విద్యార్థులు తిరిగి వెళ్లిపోతున్న ఘటనలు సైతం ఉన్నాయి. తరగతుల భవనాలు అసంపూర్తిగా ఉండడంతో ప్రసుత్తం ఆర్‌యూ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ సైన్సు భవనంలో తరగతులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 19 నుంచి కళాశాలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆర్‌యూ పీజీ అచార్యులతో ఓరియంటేషన్‌ తరగతులు చెప్పిస్తున్నారు.

వీటిపై దృష్టి అవసరం

ప్రస్తుతం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించుకునేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పోటీ పడుతుండగా తమ కళాశాలలో ఎంతమంది చేరితే మాకేంటి అన్న ధోరణిలో వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సకాలంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేయాల్సి ఉండగా పట్టించుకోలేదు. భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ కళాశాల పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాకు వస్తున్న విద్యాశాఖ మంత్రి సురేష్‌ స్పందించి నిధులు కేటాయిస్తే అసంపూర్తి భవనాలు పూర్తయ్యే అవకాశం ఏర్పడుతుంది. నియామకాలు సైతం పారదర్శకంగా జరపాలని పలువురు విన్నవిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.