అంగరంగ వైభవంగా శతవసంత సంబరాలు - Chittoor - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

అంగరంగ వైభవంగా శతవసంత సంబరాలు

వేదికపై అతిథులు గల్లారామచంద్రానాయుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్ఢి

పాకాల, న్యూస్‌టుడే: పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల శతవసంత సంబరాలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన పాఠశాల పూర్వ విద్యార్థులంతా తరలిరావడంతో సందడి వాతావరణం నడుమ కార్యక్రమాన్ని కొనసాగించారు. అమరరాజా పరిశ్రమల అధినేత గల్లా రామచంద్రనాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజన్న ట్రస్టు ప్రతినిధులు రమాదేవి దంపతులు అతిథులుగా హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల విరాళాలతో పాటు రాజన్న ట్రస్టు సహకారంతో పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన రాజన్న మెమోరియల్‌ హాల్‌, వంటగదిని ప్రారంభించారు. నచ్చుకూరు కృష్ణమ్మ, కృష్ణారెడ్డి స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని ఆవిష్కరించారు. భోజన విరామానంతరం విరాళదాతలకు సన్మానాలు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి.

 

ఆ ప్రధానోపాధ్యాయుడి చొరవతోనే...

శత వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల పూర్వ విద్యార్థి గల్లా రామచంద్రనాయుడు తన గత స్మృతులను ఓ సారి గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో ఎస్‌ఎల్‌సీ పూర్తయ్యాక ఇంటి వద్దే ఉండిపోయాననీ, ఇది తెలుసుకున్న అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్టీరంగారెడ్డి కాలినడకన ఏడు కిలోమీటర్లు తమ గ్రామానికి వచ్చారని వివరించారు. స్తోమత లేదన్న కారణంతో తెలివైన విద్యార్థిని ఉన్నత చదువులకు పంపకుండా ఆపొద్దని తన తండ్రిని కోరినా ఆయన తన వల్ల కాదని తేల్చేశారన్నారు. నీ కుమారుని నాకు దత్తతనిస్తే నేనే చదివించుకుంటానని ప్రధానోపాధ్యాయుడు పట్టుబట్టడంతో ఈ మాటలు విని ప్రభావితులైన తన తండ్రి ఉన్నత చదువుల కోసం తనను అనంతపురానికి పంపారని వివరించారు.

హాజరైన పూర్వ విద్యార్థులు

ఇది ఓ రికార్డు

పార్టీలు, రాజకీయాలకు అతీతమైన ఓ సత్కార్యానికి రావడం ఆనందంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా జీవితంలో ఎదిగిన గల్లా రామచంద్రనాయుడును ఆదర్శంగా తీసుకుని యువత స్ఫూర్తి పొందాలన్నారు. సుమారు 65 ఏళ్లకు ముందు చదువుకున్న పూర్వ విద్యార్థులను మళ్లీ ఒక వేదిక పైకి చేర్చడం ఓ రికార్డుగా ఆయన అభివర్ణించారు. పాఠశాలలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుతోపాటు వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. తుడా నిధులతో మండలంలోని ప్రతి పంచాయతీ పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. తొలి గ్రంథాలయాన్ని గల్లారామచంద్రనాయుడు చేతుల మీదుగానే ప్రారంభింపజేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో శతవార్షిక కమిటీ అధ్యక్షుడు మునస్వామి, కార్యదర్శి రాజేంద్రనాయుడు, ఉపాధ్యక్షుడు అన్నయ్యనాయుడు, పూర్వ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌నాయుడు, ప్రధానోపాధ్యాయుడు దేవరాజులు రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.