పోలీసు వాహనం ఢీకొనే విద్యార్థి మృతి - Nellore - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

తాజా వార్తలు

పోలీసు వాహనం ఢీకొనే విద్యార్థి మృతి

మృతదేహంతో బంధువుల ధర్నా

నితిన్‌ మృతదేహంపై గాయాలు

నెల్లూరు(వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే : వాహనం ఢీకొని మృతి చెందిన తమ కుమారుడిని.. మూర్ఛ వ్యాధితో మృతి చెందినట్లు చెప్పి పోలీసులు కప్పిపుచ్చుతున్నారని.. దీనిపై విచారణ నిర్వహించి తమకు న్యాయం చేయాలని నితిన్‌ అనే ఇంటర్‌ విద్యార్థి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. మృతదేహంతో స్థానిక భట్వాడిపాలెం కూడలిలో ఆందోళన చేపట్టారు. ఎస్పీ వచ్చేంత వరకు కదిలే ప్రసక్తే లేదంటూ భీష్మించుకొన్నారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదివే నితిన్‌(17) మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మూర్ఛ వచ్చి కింద పడిపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్థానికులు మాత్రం పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన మహీంద్ర జైలో కారు ఢీకొనడంతోనే మృతి చెందినట్లు తెలుపుతున్నారు. దీంతో నితిన్‌ కుటుంబసభ్యులు మృతదేహంతో తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆందోళన చేపట్టారు. నితిన్‌ కుటుంబసభ్యులు, బంధువులు భారీగా కూడలికి చేరుకున్నారు. రొట్టెల పండగతో రద్దీగా ఉన్న ప్రాంతంలో.. మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబులెన్సును నిలిపివేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీగా జనం గుమికూడారు. సమాచారం అందుకున్న దర్గామిట్ట ఇన్‌స్పెక్టరు ఎం.నాగేశ్వరమ్మ, ఎస్సై జిలానీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయినా బాధితులు ససేమిరా అన్నారు. పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన వాహనం కచ్చితంగా పోలీసులదే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీసీ కెమెరా ఫుటేజీలను అడిగితే జిల్లా పోలీసు కార్యాలయం వద్ద పనిచేయడం లేదని సమాధానమిచ్చారని, ఇది ఎంతవరకు నిజమని అన్నారు. కావాలని పోలీసులు కేసును కప్పిపుచ్చుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాణం పోయినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో ఇన్‌స్పెక్టరు మాట్లాడుతూ మంగళవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోస్టుమార్టం రిపోర్టు, సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించిన అనంతరం కచ్చితంగా నిందితులను గుర్తిస్తామన్నారు. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మూర్ఛ వస్తే గాయాలు ఎలా అవుతాయి..

నితిన్‌ కుటుంబసభ్యులు

మూర్ఛ వ్యాధితో కింద పడిపోయి నితిన్‌ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. కింద పడిపోతే గాయాలు ఉండవు.. నితిన్‌ శరీరంపై గాయాలు ఉన్నాయి. ఏపీ 27 నంబరు గల ఓ కారు అతి వేగంగా పోలీసు కార్యాలయం నుంచి వచ్చి ఢీకొంది. దీంతో నితిన్‌ మృతి చెందాడు. పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. చివరకు సీసీ కెమెరాలను పరిశీలించాలని వేడుకుంటే, పనిచేయడం లేదని ఓ కానిస్టేబుల్‌ బెదిరిస్తున్నాడు. దీనిపై విచారించాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.