close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

రెచ్చిపోతున్న ముఠాలు

నయా నగరంలోనూ ముఠా తగాదాలు
ఆందోళన కలిగిస్తున్న ఘటనలు
పోలీసులు కన్నేయాల్సిన తరుణమిది

రాజధానిలో కుర్రకారు ముఠాలు కట్టి కొట్లాడుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న కూకట్‌పల్లిలో రోడ్డుపైకి చేరి కొట్టుకున్న ఘటన మరువకముందే శనివారం రాత్రి ఉస్మానియా యూనివర్సిటీ ఠాణా పరిధిలో యువకులు ముష్టిఘాతాలకు దిగడం కలకలం రేపింది.

ఈనాడు, హైదరాబాద్‌

వాస్తవానికి ఒకట్రెండు దశాబ్దాల క్రితం వరకు భాగ్యనగరంలో ముఠాల పోరు ఉద్ధృతంగా ఉండేది. ఎక్కడికక్కడ ఆధిపత్య పోరు కొనసాగేది. జంటనగరాల్లో ప్రాంతాలవారీగా పంచుకొని మరీ రౌడీలు మామూళ్లు వసూలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఆయా ముఠాల మధ్య ఘర్షణలు నెలకొనేవి. అవి ముదిరి హత్యలకు దారితీసేవి. అప్పుడప్పుడు ముంబయి మాఫియా సైతం కలగజేసుకొని సెటిల్‌మెంట్లకు పాల్పడేది. తర్వాతి క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ రావడంతో ముఠాలు తోక ముడిచాయి. ప్రస్తుతం కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే అడపాదడపా ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

ఇక్కడే ఎక్కువ..
ఎక్కువగా స్థిరాస్తి వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తరచూ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. నగర కమిషనరేట్‌ పరిధిలోని దక్షిణ మండలంతోపాటు పశ్చిమ మండలంలో కొన్ని ప్రాంతాలు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని బాలాపూర్‌, పహాడీషరీఫ్‌ ఠాణాల పరిధిలో ఇవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒకే వర్గానికి చెందిన యువకుల మధ్య ఘర్షణలు ముదిరి కత్తిపోట్ల వరకూ దారితీసిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా పాతబస్తీలోనే కాకుండా నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ చిన్నపాటి ఘర్షణలు నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది.

కల్లోలం నుంచి ప్రశాంతత దరికి..
దశాబ్దం క్రితం వరకు భాగ్యనగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ హత్యలకు వేదికలు ఎక్కువగా రాజధాని కేంద్రంగానే ఉండేవి.
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ప్రముఖ నేత శివారెడ్డిని సికింద్రాబాద్‌ జూలూరు వజ్రమ్మ కల్యాణ మంటపంలోనే బాంబు విసిరి హత్య చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన మరో కీలక నేత పరిటాల రవీంద్రపై జూబ్లీహిల్స్‌లో బాంబుదాడి జరిగింది. అతడి ప్రత్యర్థి మద్దెలచెరువు సూరిని యూసుఫ్‌గూడలో రివాల్వర్‌తో కాల్చి చంపారు. పరిటాల రవీంద్ర హత్య కేసు కీలక నిందితుడు మొద్దు శీను చందానగర్‌లోని ఓ లాడ్జిలో బాంబు తయారు చేస్తూ గాయపడ్డాడు.
పరిటాల రవి హత్య కేసు నిందితుడి హత్య కేసు నిందితుడు పట్లోళ్ల గోవర్ధన్‌రెడ్డిని కింగ్‌కోఠి ప్రాంతంలో పట్టపగలే హత్య చేశారు.
పాతబస్తీ వర్గపోరులో భాగంగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌పై పట్టపగలే కత్తులతో దాడి చేశారు.

సినిమా పోరాటాలను మరిపించేలా..
ఉమ్మడి రాష్ట్రంలో నగరం ఎప్పుడు ఏదో ఓ దారుణానికి వేదికగా నిలిచేది. దీనికితోడు కుర్రకారు మధ్య వర్గపోరు నడిచేది. సినిమాల్లో జరిగిన మాదిరిగా కొట్లాటలకు దిగే యువత జట్లుగా విడిపోయి కొట్టుకునేది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ కేంద్రంగా ‘కింగ్‌ డూఫ్‌’, ‘సాద్‌ గ్యాంగ్‌’, ముషీరాబాద్‌ ప్రాంతంలో ‘షారూఖ్‌ అండ్‌ ఫయాజ్‌ గ్యాంగ్‌’తోపాటు మాసబ్‌ట్యాంక్‌ పరిసరాల్లో యువ గ్యాంగ్‌లు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకొంటూ హల్‌చల్‌ చేసేవి. ఈ తరహా సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో క్రమేపి తగ్గిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంస్కరణలతో దాదాపు కనుమరుగైపోయింది. పాతబస్తీలో అప్పుడప్పుడు కనిపించేవి. ఇటీవలికాలంలో కొత్త నగరంలోనూ ఈ తరహా ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రజామిత్ర పోలీసింగ్‌ కారణంగా పోలీసులు దూకుడు తగ్గించడం వల్లే కొందరు యువకులు తోక జాడిస్తున్నారనే విమర్శలున్నాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.