close

మంగళవారం, అక్టోబర్ 15, 2019

తాజా వార్తలు

వనపర్తిలో వేరుశనగ పరిశోధన కేంద్రం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

కార్యక్రమానికి హాజరైన రైతులు..

గోపాల్‌పేట, న్యూస్‌టుడే : వనపర్తిలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వేరుశనగ పంటకు వనపర్తి జిల్లా నేలలు చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. గురువారం గోపాల్‌పేట పీఏసీఎస్‌ ఆవరణలో ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వేరుశనగ పంటను వేసిన ప్రతి రైతూ లాభపడాలన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా గోపాల్‌పేటలోనే విత్తన పంపిణీని ప్రారంభించామని, ఇక్కడి రైతులు దుక్కిలు దున్ని విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. మంచి భూముల్లో ఇప్పుడు రైతులు ఎకరాకు 12, 13 క్వింటాళ్ల వేరుశనగను పండిస్తున్నారన్నారు. 20 క్వింటాళ్ల దిగుబడిని రైతులు సాధించాలన్నారు. విత్తనాలు బాగుంటేనే పంటల దిగుబడీ ఎక్కువగా వస్తుందన్నారు. వనపర్తి జిల్లాలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సుమారు 25 ఎకరాల భూమి కావాలని జిల్లా కలెక్టరుతో చెప్పానన్నారు. క్వింటాలు వేరుశనగ విత్తనాల ధర రూ.9వేలు ఉండగా.. ప్రభుత్వం రైతులకు రూ.5వేలకే అందిస్తోందని మంత్రి తెలిపారు. రాయితీ విత్తనాలు పక్కదారి పట్టకుండా చూడాలని, రైతులు పొలంలో వేశారో.. లేదో.. వీఆర్వోలు, ఏఈవోలు పరిశీలించి కలెక్టరుకు నివేదించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే బడ్జెట్లో వ్యవసాయశాఖకు ఎక్కువ కేటాయించారన్నారు. జిల్లా కలెక్టరు శ్వేతా మహంతి మాట్లాడుతూ.. పరిశోధన కేంద్రానికి పామిరెడ్డిపల్లి, వీరాయపల్లి శివారుల్లో 25 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో వేరుశనగ ఎక్కువగా పండిస్తారని, ఇక్కణ్నుంచి గుజరాత్‌, ముంబయికి తరలిస్తున్నారన్నారు. తెలంగాణ విత్తన కార్పొరేషన్‌ ఎండీ డా.కేశవులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ జిల్లావారూ వేరుశనగ విత్తనాలు కావాలని అడగలేదన్నారు. వనపర్తి జిల్లానుంచే విత్తనాలు కావాలని కోరారన్నారు. మన దగ్గరున్న విత్తనాలను పంపిణీ చేస్తూనే రాష్ట్రానికి అవసరమైన వాటిని టెండర్లద్వారా కొని పంపిణీ చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు కావాల్సిన విత్తనాలను ఇక్కడే పండించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా రైసస కన్వీనర్‌ జగదీశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రఘురామారావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీసభ్యురాలు భార్గవి, సర్పంచి శ్రీనివాసులు, ఎంపీటీసీసభ్యురాలు కేతమ్మ, జిల్లా వ్యవసాయాధికారి శివనాగిరెడ్డి, ఏవో నరేశ్‌, తెరాస నాయకులు, పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

వేరుశనగ విత్తనాలను చూపుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, విత్తన కార్పొరేషన్‌ ఎండీ కేశవులు, కలెక్టర్‌ శ్వేతా మహంతి, వనపర్తి జడ్పీ ఛైర్‌పర్సన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

అసెంబ్లీ సమావేశాల తర్వాత రైతుబంధు డబ్బులు

గోపాల్‌పేట : అసెంబ్లీ సమావేశాల తరవాత రైతుబంధు డబ్బులు వస్తాయని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం గోపాల్‌పేటలో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం చివర్లో ఓ రైతు లేచి.. కొంతమందికి రైతుబంధు డబ్బులు రాలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చాడు. స్పందించిన మంత్రి రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది రైతులకు రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ కాలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాఖ ముఖ్యమంత్రితో ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. నిధులు మంజూరు కాగానే కొంత ఆలస్యంగానైనా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. సింగిల్‌విండో కార్యాలయంలోకి లారీలు, ట్రాక్టర్లు వస్తున్నందున ఆవరణ మొత్తం గుంతలుపడి బురదమయంగా మారుతోందని, సీసీ చేయించాలని అధ్యక్షుడు రఘురామారావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పీఏసీఎస్‌ ఆవరణ మొత్తం సీసీ చేయిస్తామని, కలెక్టరూ సహకరించాలని మంత్రి అన్నారు.

పిచ్చిమొక్కలు కనిపిస్తే జరిమానా

జిల్లా పాలనాధికారిణి శ్వేతా మహంతి

వీరాయపల్లి(పెద్దమందడి), న్యూస్‌టుడే : గ్రామాల్లో ప్రైవేటు ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం కనిపిస్తే స్థల యజమానులకు జరిమానా విధిస్తామని జిల్లా పాలనాధికారిణి శ్వేతా మహంతి హెచ్చరించారు. గురువారం మండలంలోని వీరాయపల్లిలో 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు పర్యవేక్షణ అధికారిణి అపూర్వారావుతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని వీధుల్లో పర్యటించగా పలు చోట్ల ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం ఉండడాన్ని గమనించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తక్షణమే అక్కడ శుభ్రం చేయాలని చెప్పగా.. స్థలాల యజమానులు హుటాహుటిన తరలివచ్చారు. శ్రమదానంతో పిచ్చిమొక్కలను తొలగించారు. అంగన్‌వాడీ కేంద్రం వద్దా అపరిశుభ్రత కనిపించడంతో కలెక్టరు గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేసి చెత్తాచెదారాన్ని తొలగించి ఆకుకూరల విత్తనాలు చల్లారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, సర్పంచి భాగ్యమ్మ, ఎంపీపీ మేఘారెడ్డి, జడ్పీటీసీసభ్యుడు రఘుపతిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిణి రాజేశ్వరి, డీఆర్డీవో గణేశ్‌జాదవ్‌, తహశీల్దారు ఘాన్సీరాం, ఎంపీడీవో నాగశేషాద్రిసూరి, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.