close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

నగరం కోసం.. నేను సైతం

24 నుంచి నగరంలో పారిశుద్ధ్యంపై సమర భేరి

కార్పొరేషన్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే : పల్లెల్లో పరిశుభ్రత కోసం ప్రజలు కదిలినట్లుగానే.. నగరవాసులు సైతం సామాజిక బాధ్యతగా గుర్తించి పారిశుద్ధ్యంపై ‘సమర భేరి’ మోగించేందుకు ముందుకు రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. నగరంలో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు, జ్వరాల బారిన పడుతుండటంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై గురువారం జిల్లా పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, నగరపాలక కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డితో కలిసి చర్చించారు. అనంతరం నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అపరిశుభ్రత మన ద్వారానే నెలకొంటుందని, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, ఖాళీ స్థలాలు మురికి కూపాలుగా మార్చడంతో దోమలు కుడుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక విజయవంతంగా అమలవుతోందని, అదే తరహాలో నగరంలో ఎందుకు చేయకూడదనే ఆలోచనతో కలెక్టర్‌, కమిషనర్‌తో చర్చించినట్లు తెలిపారు. ప్రజలందరినీ భాగస్వాములు చేసేందుకు ‘నేను సైతం.. నా నగరం కోసం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఈ నెల 23న కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నగరంలోని అన్ని అసోసియేషన్‌ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వార్డు కమిటీలు, కిట్టీ పార్టీలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఇందులో పాల్గొనేలా కార్యాచరణ చేస్తున్నట్లు చెప్పారు. వీరందరితో కలిసి 24న అంబేడ్కర్‌ స్టేడియం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. వీధుల్లో ఖాళీ స్థలాలు, చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయడం, డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేయడం వంటి పనులు చేయడానికి ముందుకు రావాలన్నారు. అసోసియేషన్‌ సభ్యులతో మాట్లాడితే పొక్లెయిన్లు, బ్లేడ్‌ ట్రాక్టర్లు, ట్రాక్టర్లు ఇస్తామన్నారు. 10 రోజుల పాటు నగరంలోని 60 డివిజన్లను 20 బ్లాకులుగా విభజించి పనులు చేపడుతారన్నారు. ప్రతి ఇంటికి ఒక్కరు స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని కోరారు. తెలంగాణలోనే మొదటగా కరీంనగర్‌ నగరపాలిక ఈ కార్యక్రమం తీసుకొని ఆదర్శంగా నిలవాలన్నారు. ఆరోగ్యకర నగరం కోసం నడుం కట్టాలని, తమ కుటుంబమంతా ఒకరోజు పాల్గొని శుభ్రం చేస్తామన్నారు. కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజుల పాటు ప్రణాళిక తయారు చేస్తామన్నారు. ఊరంతా శుభ్రం చేసిన తర్వాత ఈ బాధ్యత ప్రజలకే ఇస్తామన్నారు.

రహదారులు వాహనాల కోసం : ప్రజలు, వాహనాలు నడవడానికి రహదారులు ఉన్నాయని, రోడ్లపై అడ్డాలు పెట్టుకొని ఆక్రమించుకోవడం, వ్యాపారాలు చేయడం సరికాదని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. అమ్ముకోవడానికి పెద్ద పెద్ద రైతుబజార్లు ఉన్నాయని, అవన్నీ ఖాళీగానే ఉన్నాయని చెప్పారు. అక్కడ అమ్ముకోవాలని, రోడ్లు నడవడానికి వదిలి పెట్టాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఈ ఎం.భద్రయ్య, డీసీపీ పురుషోత్తం, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.